‘భారత రాష్ట్ర సమితి… అనే ఈ వెలుగు దివ్వెను దేశమంతటా ప్రసరింపజేసి, అద్భుతమైన బాటలు వేసి, తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల దగ్గర పెట్టి, ఆ తల్లి కండ్లల్లో సంతృప్తిని చూడాలని కోరుకుంటున్నా.’ బీఆర్ఎస్ పార్టీని ప్రకటిస్తూ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలివి.
వాస్తవంగా ఈ దేశాన్ని రాష్ర్టాల సమాహారంగా పేర్కొన్న రాజ్యాంగస్ఫూర్తిని బీజేపీ అనైతికంగా దెబ్బతీస్తున్నది. దేశంలో ప్రతిపక్షాలు, ప్రాంతీయపార్టీల ఉనికే లేకుండా బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయమే ఎజెండాగా బీఆర్ఎస్ పురుడు పోసుకున్నది. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలవాల్సిన కాంగ్రెస్ బలహీనమైన నేపథ్యంలో జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయంగా నిలవడమనేది ఒక చారిత్రక అవసరమైంది. ఈ క్రమంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీయే నేడు బీఆర్ఎస్గా మారి క్రమంగా ఒక్కో రాష్ట్రంలో విస్తరిస్తూ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నది. ఈ క్రమంలో దేశ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు జాతీయస్థాయిలో విస్తృత వేదిక అవసరమని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ భావించారు.
బీజేపీ అప్రజాస్వామిక పాలనలో అట్టడుగువర్గాలే అత్యధికంగా ఉన్న ఈ సమాజమంతా అట్టుడికిపోతున్న ప్రమాదకర పరిస్థితిలో… తమ రక్షణ కోసం నేనున్నానంటూ కదిలే ధీరోదాత్తుడి కోసం దేశ ప్రజ లు ఎదురుచూస్తున్నారు. ఈ విషమ పరిస్థితుల్లో.. కేసీఆర్ బీఆర్ఎస్కు ఆయువు పోశారు. తెలంగాణ కోసం సుదీర్ఘకాలం శాంతియుత, ప్రజాస్వామ్యయుత ఉద్య మం చేసిన టీఆర్ఎస్ పార్టీ గమ్యాన్ని ముద్దాడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. ఉద్యమ నాయకుడే ఆ అనుభవంతో నేడు ప్రభుత్వ రథసారథియై రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ, తొమ్మిదేండ్ల కాలంలోనే తెలంగాణను దేశానికే మార్గదర్శకంగా నిలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్న ఎన్నో పథకాలను వివిధ రాష్ర్టాలు అధ్యయనం చేసి, తమ తమ రాష్ర్టాల్లో కూడా ప్రవేశపెట్టాయి. అదేవిధంగా కేంద్రం కూడా అందుకే ‘తెలంగాణ ఆచరిస్తున్నది, దేశం అనుసరిస్తున్నది’ అని నేడు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
తెలంగాణలో అమలవుతున్న ‘రైతుబంధు’ పథకాన్ని ‘ప్రధానమంత్రి కిసాన్ యోజన’ పేరు తో, ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ‘హర్ ఘర్ జల్’ పేరుతో, రేషన్ పోర్టబిలిటీ పథకాన్ని ‘వన్ నేషన్-వన్ రేషన్’ పేరుతో అమలుచేస్తున్నది. ఇట్లా ఇంకెన్నో పథకాలను దేశంలోని కొన్ని రాష్ర్టాలతోపాటు, కేంద్రం కూడా అనుసరిస్తున్నది.
‘సమైక్య రాష్ట్రంలో ఎడారిగా మారిపో యి, వలసలు పెరిగిపోయినయి. మంచినీరు కూడా దొరకని తెలంగాణ ప్రాంతమే తొమ్మిదేండ్లలో ఇంత అభివృద్ధి చెందగలిగితే… భారత్ రత్నగర్భ, అద్భుతమైన, అపారమైన మానవ సంపద ఉన్న దేశం. ప్రపంచంలోనే ఏ దేశానికీ లేని అనుకూలతలున్న దేశం ఇం కెంత అభివృద్ధి చెందాలి? సుసంపన్నమైన పంటలు పండే భూములు ఉండి, 75 వేల టీఎంసీల నీళ్లుండి, పనిచేయగలిగే 140 కోట్ల మంది ప్రజలు ఉండి, ఆకలి బాధలు ఎందుకు పడాలె? రైతులు నెలల పాటు ఎందుకు ధర్నాలు చేయాలె? ఈ దుస్థితి ఇంకెంత కాలం? ప్రపంచంలో ఏ దేశానికైనా ఉన్న అత్యంత విలువైన వనరు మానవ వనరులు. భారతదేశంలో 52 శాతం యువశక్తి ఉన్నది. వాళ్లను నిర్వీర్యం చేస్తున్నరు. మతోన్మాదం పేరుతో రెచ్చగొడుతున్నరు. మనం మాత్రం నిస్తేజంగా నిస్సహాయంగా భరిస్తూ, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూనే ఉన్నం. ఇంకెంత కాలం ఈ వేదన? దేశంలో ఈ పరిస్థితి మారాలె. మార్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ’ అని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వివిధ పాలసీలను ప్రజల ముందు చర్చకు పెట్టారు.
‘ఈ దేశంలో ప్రజలకు కావాల్సింది రాజకీయాలు కాదు.. ప్రజాకీయాలు కావాల’న్న ప్రజాకవి కాళోజీ ఆకాంక్షను అందిపుచ్చుకొని, ఒక రాష్ర్టాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్. ఆయన ఆధ్వర్యంలో అవతరించిన బీఆర్ఎస్ స్వల్పకాలంలోనే దేశం నలుదిక్కులా విస్తరించి, ఉర్రూతలూపడం ఖాయమన్న విషయం తేటతెల్లమవుతున్నది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
– పీఎల్ శ్రీనివాస్ 73374 01177