భారతీయ జనతా పార్టీ కేం ద్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యపరుస్తున్నది. ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోజూడటం, లొంగనివారిపై కేసులు నమోదు చేస్తూ రాజకీయంగా వేధిస్తున్నది. అత్యంత స్వతంత్రంగా వ్యవహరించవలసిన కేంద్ర ఎన్నిక ల సంఘంపై ఇటీవల శివసేన పార్టీ గుర్తు కేటాయింపు విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ చాలవన్నట్టు బీజేపీ నాయకులు, మంత్రులు, చివరికి రాజ్యాంగబద్ధమైన పరిధిలో ఉన్న ఉప రాష్ట్రపతి కూడా భారత న్యాయవ్యవస్థపై దాడి చేయడం చూస్తుంటే అసలు మన దేశంలో రాజ్యాంగం అమలవుతున్నదా అన్న సందేహం రాకమానదు.
‘భారత రాజ్యాంగం ప్రకారం, చట్టానికి అనుగుణంగా పనిచేసే న్యాయమూర్తులు కొందరైతే, భారత ప్రభుత్వానికి లోబడి, న్యాయశాఖా మంత్రికి అనుగుణంగా పనిచేసే న్యాయమూర్తులు ఇంకొందరు. పదవీ విరమణ పొందిన తర్వాత పొందే పదవుల ప్రభావం, పదవీ విరమణ కాకముందు ఇచ్చే తీర్పులపైన ఆధారపడి ఉంటుంది’ 2012 అక్టోబర్ 1న ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర న్యాయశాఖా మంత్రి స్వర్గీయ అరుణ్ జైట్లీ న్యాయవ్యవస్థకు సంబంధించిన రెండు ముఖ్య విషయాలను పై విధంగా ప్రస్తావించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ విధంగా మాట్లాడారు.
2020 నవంబర్‌లో గుజరాత్‌లోని కవాడియాలో జరిగిన ఏఐపీడీసీ సదస్సులో ‘శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు మూడింటిలో ఏ ఒక్కటీ మిగతా వాటికన్నా ఉన్నతమైనదిగా చెప్పుకోలేదు. రాజ్యాంగమే అన్నింటికన్నా ఉన్నతమైనది’ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుత భారత ఉపరాష్ట్ర జగదీప్ ధన్కర్ పశ్చిమబెంగాల్‌కు గవర్నర్‌గా పనిచేశారు. ఈయన గారు అప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఆమె పార్టీని చాలా ఇబ్బందులకు గురిచేశాడు. భారత ఉప రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఆయన తీరులో మార్పు రాలేదు.
2023, జనవరి 13న జైపూర్‌లో ఆల్ ఇండియా ప్రెసిడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (ఏఐపీడీసీ) సదస్సు జరిగింది. ఈ సదస్సులో జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ ‘పార్లమెంటులో చేసిన చట్టాలను, సుప్రీంకోర్టుకు సమీక్షించే అధికారం లేదు. అంటే పార్లమెంటు మాత్రమే సుప్రీం అన్నాడు. అంతేగాక కేశవానంద భారతి కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పబట్టారు. ఇంతకు ఈ ‘కేశవానంద భారతి’ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును మనం గమనిస్తే జగదీప్ ధన్కర్ గారి ‘రాజభక్తి’ అర్థమవుతుంది.
‘రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదు, రాజ్యాంగానికి సవరణలు మాత్రమే చేసుకొనే అధికారం పార్లమెంటుకు ఉంది’ 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇది. ‘చట్టసభలు, కార్యనిర్వహణా వ్యవస్థ, న్యాయవ్యవస్థ’ రాజ్యాంగం ద్వారానే ఈ మూడు
ఏర్పడ్డాయి. మరో ముఖ్య విషయమేమంటే పార్లమెంటు రాజ్యాంగాన్ని రూపొందించలేదు. అందుకని రాజ్యాంగాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదు. రాజ్యాంగమే వీటన్నింటి కంటే గొప్పది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన బీజేపీ నాయకులు న్యాయవ్యవస్థపై పలురకాలుగా దాడులకు దిగుతున్నా రు. మాటల యుద్ధం చేస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పలుసార్లు కావాలనే న్యాయవ్యవస్థపై దాడి చేశారు. కొలీజి యం వ్యవస్థను విమర్శించడం, రద్దు చేయాలనడం, దాని సిఫారసులను తోసిపుచ్చడం, న్యాయవ్యవస్థపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై.చంద్రచూడ్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరుకాలేదు. ఎన్నికల ప్రచారం నెపం చూపి, హాజరుకాకపోవడం, భారత న్యాయవ్యవస్థను అవమానించడం కాదా!
2014కు ముందు యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర న్యాయవస్థను తప్పుబట్టిన బీజేపీ నాయకులు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అవే పనులు చేస్తూ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. భారత న్యాయవ్యవస్థపైనా అడ్డగోలు ఆరోపణలు, దాడులు చేస్తూ భారత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. దానికి తాజా ఉదాహరణలు చూద్దాం. ఎప్పటినుంచో కొనసాగుతున్న కొలీజియం వ్యవస్థ స్థానంలో ‘ఎన్‌జేఏసీ’ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్భాటం. ఈ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఎప్పుడో కొట్టివేసింది. న్యాయవ్యవస్థపై ఇంత భీకరంగా దాడి చేయడానికి కారణమేమంటే భారతీయ జనతా పార్టీకి రాజ్యాంగంపై నమ్మకం లేదు.
మనుధర్మ శాస్త్ర ప్రకారం భారతదేశం నడువాలనుకునే పార్టీ. అందుకే మనం బీజేపీని కేవలం ఒక రాజకీయ పార్టీగా చూడకూడదు. బీజేపీ అనుకుంటున్న మెజారిటిజం, హిందుత్వ ఎజెండాను అమలుపరిచే క్రమంలో చట్టసభల్లో, చట్టాలు పాస్ అయినప్పటికీ, భారత న్యాయవ్యవస్థలో సమీక్షకు గురికాకూడదు. రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నట్టే. భారత న్యాయవ్యవస్థను వాడుకోవాలని చూస్తున్నది. న్యాయవ్యవస్థను విమర్శిస్తూనే లొంగదీసుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అందుకే మతతత్వ పార్టీ అయిన బీజేపీపై మనం రెండురకాలుగా పోరాటం చేయాలి. ఒకటి రాజకీయ పోరాటం అయితే, రెండవది సైద్ధాంతిక పోరాటం. అప్పుడే బీజేపీని మనం సంపూర్ణంగా ఓడించగలుగుతాం.
(వ్యాసకర్త: తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యులు)
ఓ.నర్సింహా రెడ్డి
80080 02927