రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచే నెలకొన్న అంతర్గత అసంతృప్తులు, కుమ్ములాటళఉ రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. దీంతో పాలన కుదేలైపోయింది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మధ్య సంబంధాలపై నెలకొన్న అనుమానాలు, భిన్న స్వరాలు, మౌన సంకేతాలు రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా, కాంగ్రెస్ పాలన విశ్వసనీయతను ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయి. ఇది వ్యక్తిగత అభిప్రాయభేదాల సమస్యగా కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలోని నిర్ణయాల్లో ఏకపక్ష ధోరణి, లోపించిన సమతుల్యతగా మారడం గమనార్హం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల వ్యవధిలోనే సీఎం కార్యాలయం చుట్టూ అధికార కేంద్రీకరణ జరిగింది. క్యాబినెట్లో మంత్రుల అభిప్రాయాలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. కాంగ్రెస్‌లోనే అసంతృప్తి నెలకొన్నది. ఇటీవల భట్టివిక్రమార్క వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం, పేదలపై దృష్టి తగ్గుతున్నదని భట్టి చెప్పుకొచ్చారు. ఈ మాటలు సొంత ప్రభుత్వంపై పరోక్ష విమర్శలుగానూ చూడవచ్చు. రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడ పార్టీలోని సీనియర్‌నేతలకు అసహనం కలిగిస్తున్నది. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య సంబంధాలు చెడిపోయాయని స్పష్టమవుతున్నది.
కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, మంత్రుల మధ్య కాంట్రాక్టుల గొడవ, ఇలా రోజుకో పంచాయితీ తెరమీదకు రావడం కేవలం రాజకీయ విభేదాలుగా చూడలేని పరిస్థితి. సీఎంకు, మంత్రులకు ఇదే పనిగా మారిపోయిందని, పాలన పడకేసిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టకపోవడంతో పాలన గందరగోళంలో పడిపోయింది. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య వివాదం సామాజిక కోణంలోనూ మరింత సున్నితంగా మారుతున్నది. భట్టివిక్రమార్క ఎస్సీ వర్గానికి చెందడం, ఆయన రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆ వర్గం నేతలు ఇప్పటికే హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఎస్సీల పట్ల వివక్ష చూపుతున్నారని ఇప్పటికే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. డిప్యూటీ సీఎం స్థాయిలోని దళిత నేతను పక్కన పెట్టడం దారుణమనే ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
ఇక్కడ కీలకంగా మారుతున్న మరో అంశం కాంగ్రెస్ అధిష్ఠానం మౌనం. రాష్ట్రంలో ఇంతస్థాయిలో చర్చ జరుగుతున్నా, హస్తిన పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు రాకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో చోటుచేసుకున్న అంతర్గతవిభేదాలు, ఆ తర్వాత ఎదురైన ప్రతికూల అనుభవాలు కాంగ్రెస్ ముందు ఉన్నాయి. తెలంగాణలోనూ పాలన పక్కకు పెట్టి ముఠా రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌కు ఎదురయ్యేది అదే పరిస్థితి. మొత్తానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రుల మధ్య అగాథం వారి వారి వ్యక్తిగత విభేదాల సమస్య కాదు. తెలంగాణ ప్రజలకు పాలన కరువై, అభివృద్ధి, సంక్షేమం అందని దయనీయమైన స్థితి.
-సంగనభట్ల రామకిష్టయ్య, సీనియర్ జర్నలిస్ట్, 9440595494