ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా అనుకూల స్పందన వస్తున్నది. దీన్ని ఓర్వలేని తెలంగాణలోని ప్రత్యర్థి వర్గాలు ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు అనుకూలత అధికంగా ఉండి, ప్రతికూలత మాత్రం పాక్షికంగా ఉంది. అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అమలు కోసం పరితపించే తపోదీక్షలో అనుకూల, అననుకూల అభిప్రాయ వ్యక్తీకరణలు సహజమే. బీఆర్ఎస్గా టీఆర్ఎస్ రూపాంతరం చెందడం జీర్ణించుకోలేని కొందరు మేధావులు, రాజకీయ జీవులు, సొంత ఆలోచనలు మృగ్యమైన నిరాశాజీవులు సంధించే విమర్శనాత్మక వ్యాఖ్యానాలు,అభిప్రాయాలు ఎంత హేతుబద్ధమైనవో పరిశీలించే అంశమే ఈ వ్యాసం ఉద్దేశం.
రాష్ట్రస్థాయిలో టీఆర్ఎస్ (కేసీఆర్ ఆధ్వర్యంలో) సాధించిన ప్రగతి, ప్రజల సంక్షేమం, సంక్షేమ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా వెలుగులీనుతున్నాయి. రాజకీయ స్వార్థానికి బలైన మనస్తత్వాలు కేసీఆర్ ఏ పథకం ఆలోచించినా, ఏం చేసినా, ఏమి చేయకపోయినా కేసీఆర్ విమర్శించడం, వ్యతిరేకించడమే వారి ప్రధాన లక్ష్యం. ప్రస్తుత సంక్షుభిత రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితి నేపథ్యంలో బీఆర్ఎస్ స్థాపన ఒక అనివార్యతగా ఎందుకు సమ్మతించరో అర్థం కాదు. సర్వతోముఖంగా, అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న ‘తెలంగాణ’ నమూనా దేశ కాలమాన పరిస్థితులకు అన్వయించగా బీఆర్ఎస్ ఆవిర్భావం ప్రతిపాదించబడిన ఒక నవ్య పురోగాత్మక ఆలోచన.
ఏ రాజకీయపక్షమైనా రాజ్యాధికారమే పరమ లక్ష్యంగా భావించినా, దేశ సంక్షేమం, భావితరాల భవితవ్యం దృష్ట్యా అన్నింటికీ అతీతంగా ఆలోచించడం ఒక చారిత్రాత్మక సందర్భం. దేశమంతా ఏకపక్ష నిర్ణయాలకు బలైపోతూ, చట్టసభల్లో చర్చల ప్రామాణికత పూర్తిగా నశించి, దేశంలో ప్రజాస్వామ్య పాలన మృగ్యమై జాతి పురోగమన లక్ష్యాలను తృణీకరిస్తూ ఏకస్వామ్య దిశలో అడుగులు వేస్తుంటే.. ఏ ప్రత్యామ్నాయం లేక దేశం అఘోరిస్తుంటే… ఒక ఆశాజ్యోతిలా ముందుకురికిన బీఆర్ఎస్ను ఆహ్వానించడం అభిలషణీయం ఎందుకు కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఇంతవరకూ ఏ రాజకీయ నాయకుడు లేదా పార్టీ దీటుగా సమర్థవంతంగా ఉపయోగించుకోలేక ఒక డోలాయమాన సందిగ్ధంలో కొట్టు మిట్టాడుతున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆవిష్కారం ఒక నూతన ప్రస్థానానికి నాంది పలుకుతుంది. బీఆర్ఎస్ కాలక్రమంలో విజయవంతమై రాజ్యాధికారం దిశగా మనగలుగుతుందా లేదా అన్న మీమాంస శుద్ధ అనవసరం!
తెలంగాణ అస్తిత్వానికి భిన్నంగా బీఆర్ఎస్ ఆవిర్భావం ఒక లోపభూయిష్ఠ ప్రతిపాదన అన్నది కొందరి అభిప్రాయం. అయితే తెలంగాణ అభివృద్ధిని జీర్ణం చేసుకోలేక కేవలం లోపాలను అంటగడుతూ జాతీయస్థాయిలో బీఆర్ఎస్ పనికిరాదని సిద్ధాంతీకరిస్తున్నారు.
తెలంగాణ అస్తిత్వ పోరాటం ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ లేదా 60 ఏండ్లకు పైగా సాగిన అపసవ్య పాలనలో జరిగిన ఇతర అక్రమాలకు వ్యతిరేకంగా ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు, తెలంగాణ యావత్తు తెలంగాణ ఉద్యమానికి జీవం పోసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నది. అదే అపసవ్య పాలనలో సవాలక్ష పరిపాలనా లోపాలతో, దేశ భవితవ్యాన్ని ప్రమాదంలో పడేసే అప్రజాస్వామిక అనారోగ్యకర విధానాలతో బీజేపీ ప్రభుత్వం దేశంలో అరాచకాన్ని సృష్టిస్తూంటే నిమ్మకు నీరెత్తినట్లు ఒక దేశ పౌరుడు-జ్ఞానోదయ దిశగామియై ఒక సంకల్పం బీఆర్ఎస్ రూపంలో ఎందుకు చేయకూడదు? బీఆర్ఎస్ ఆవిర్భావం ఒక అనివార్యత కాదా? ఇందిరాగాంధీ పాలనలో దేశవ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడితే అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత ఇందిరాగాంధీ పదవి కోల్పోయే ప్రమాదం దాపురిస్తే ఎమర్జెన్సీ ప్రకటించి దేశవ్యాప్త కల్లోలానికి ఆజ్యం పోసి నిర్బంధాల గుప్పిట్లో దేశాన్ని బంధించి ‘వినాశకాలే విపరీతబుద్ధి’ అనే ఆర్యోక్తిని నిజం చేయలేదా?
ఒకే వ్యక్తి లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ రూపంలో ప్రభవించి దేశవ్యాప్త సంపూర్ణ విప్లవాన్ని రగిలించి ప్రజానాయకుల, ప్రజాభీష్టాన్ని ఒక సామూహిక శక్తిగా తీర్చిదిద్ది అపసవ్య ప్రభుత్వాన్ని గద్దెదింపిన ఉదంతాన్ని ‘కాలం’ ఇంకా మరచిపోలేదు.
ఒక వ్యక్తి ఆలోచనల అంతరంగం హేతుబద్ధంగా ప్రయోజనకరంగా శాస్ర్తోక్తంగా దేశ పురోగమన దిశలో పనికివస్తాయా లేదా అన్న విషయాన్ని సమగ్రంగా ఆలోచించి అవలోకనం చేసుకోవడం విజ్ఞుల విచక్షణపై ఆధారపడి ఉంటుం ది. కక్షలు, కార్పణ్యాలు, ఉన్మాదంలో ప్రేలాపనలు, స్వార్థపూరిత రాగద్వేషాలు, తక్షణ పదవి లాలసతలో ప్రలోభాలకు లోనయ్యే దుస్థితిని అధిగమించి ఒక బృహత్తర ప్రణాళికలోని నవ్యతను ఆహ్వానించే దిశలో సాగాలని ఆశిద్దాం.
-కె.లక్ష్మణ్ గౌడ్ , 97049 30509