75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ దేశాన్ని ఇంతకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీలు బడుగు, బలహీన వర్గాలను తమ ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప, ఏనాడూ ఆ వర్గాల ప్రగతి కోసం పాటుపడలేదు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది. ఇక బీజేపీ టికెట్ల విషయంలో బీసీలకు పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అత్యధికంగా సీట్లిచ్చి అవకాశాలు కల్పించింది.
బీసీ ప్రధానినని ప్రగల్భాలు పలికే నరేంద్రమోదీ బీసీలకు చేసిందేమీలేదు. దేశ జనాభాలో 50 శాతానికి పైగా బీసీలున్నప్పటికీ, 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేదు. ఇది ఈ దేశాన్ని ఇప్పటివరకూ పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల అప్రజాస్వామిక వైఖరికి, అణచివేత ధోరణికి నిదర్శనం. బీసీలకు సంక్షేమ మంత్రిత్వశాఖ ఉన్నట్టయితే బీసీల సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని, పరిష్కారానికి ఒక అధికారిక వేదిక ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ మొదటినుంచి భావిస్తున్నది. అందుకే, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ అవసరాన్ని కేంద్రానికి పలుమార్లు గుర్తు చేస్తూ, డిమాండ్ చేశారు.
దేశంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీల కులగణన చేయకుండా, బీసీ వర్గాల అభివృద్ధిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. కేంద్ర విధానాలతో విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు న్యాయం జరుగటం లేదు. ఈ నేపథ్యంలోనే తగిన వివరాలు లేకుండా ఏ వర్గాన్నయినా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎలా రచిస్తారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించిన తీరు ఆలోచింపదగినది.
ప్రజల సమగ్ర వివరాలు విధానకర్తలకు, సామాజిక పరిశోధకులకు ఉపయోగపడాలి. ఏయే ప్రాంతాల్లో, ఏయే వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలియకుండా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడమంటే చీకట్లో బాణం వేసినట్లే ఉంటుంది. సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలున్న మన సమాజంలో గణాంకాలకు మరింత ప్రాధాన్యం ఉం టుంది. కేంద్రం కులాలవారీ జనగణన అవసరాన్ని గుర్తించాలి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కేంద్రం బీసీ జనగణన జరపనంత వరకు బీసీల కు ఇలాగే తీరని అన్యాయం జరుగుతుం టుంది. ఇందుకు బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కండ్లు తెరిచి, తక్షణమే బీసీ వర్గాల జనగణనను చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ఈ దేశంలోని బీసీలకు జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అంది, కొంతలో కొంతైనా న్యాయం జరుగుతుంది.
పీ.ఎల్.శ్రీనివాస్
73374 01177