రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు పార్టీలు సభలు, సమావేశాలు ఏర్పాటుచేసుకొని, జన సమీకరణ చేసుకోవడం సహజమే. కానీ, అలాంటి సభలతోనే అధికారంలోకి వస్తామనుకోవడం హాస్యాస్పదం.
ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ బలాబలాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయని అంచనా వేసుకోవాలి. బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఉండాలి. ఆ కమిటీలు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడే ఆ పార్టీలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కాంగ్రెస్, బీజేపీలకు అలాంటి గుర్తింపు లేదు. ఎందుకంటే గత పదేండ్లలో ఈ రెండు పార్టీలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఒకటైతే, ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటు పడుతున్న తెలంగాణ సర్కారుపై నిరాధారమైన ఆరోపణలు చేయడం రెండవది. ఈ పరిణామాలతోనే ప్రతిపక్షాలు ప్రజలకు దూరమయ్యాయి. ప్రజా మద్దతు లేని పార్టీలు అధికారం కోసం పాకులాడటం అవివేకం.
గత పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాపక్షాన నిలవాల్సింది పోయి ప్రజల పొట్టకొడుతూ రాజ్యమేలుతున్నది. నిత్యావసర వస్తువుల ధరలను పెంచుకుంటూ పోతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే స్థాయికి చేరుకున్నది. ఈ అంశాలపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ వారి మనోభావాలను ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారమే పరమావధిగా దేశాన్ని కాషాయీకరణ చేసే పనిలో నిమగ్నమై ఉంది మోదీ షా ద్వయం. పార్లమెంటులో తమ సంఖ్యాబలం ఉన్నదని విర్రవీగుతూ ప్రజామోదం లేని అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పలు సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించడం ద్వారా అవి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అందులో రైతు చట్టం ఒకటి. ఇది మోదీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. అయినా మోదీ ప్రభుత్వం మొండి విధానంతో ముందుకుసాగుతున్నది.
ఇప్పుడు తాజాగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుచేయాలని భావిస్తున్నది. ఇది అన్ని మతాల ప్రజల కోసం వ్యక్తిగత చట్టాల సాధారణ కోడ్‌ను కలిగి ఉండాలనే ఆలోచన అని కేంద్రం కొత్త నిర్వచనం ఇచ్చింది. అయితే వ్యక్తిగత చట్టంలో వారసత్వం, వివాహం, విడాకులు, పిల్లల సంరక్షణ, భరణం వంటి అంశాలున్నాయి. ప్రస్తుతం, భారతదేశ వ్యక్తిగత చట్టాలు చాలా సంక్లిష్టంగా, వైవిధ్యంగా ఉన్నాయి. ప్రస్తుతం అన్ని మతాలు వాటి సొంత నిర్దిష్ట నిబంధనలను అనుసరిస్తూ వస్తున్నాయి. ఒకవేళ యూసీసీ అమలుకు నోచుకుంటే ప్రజల సంస్కృతిపై దాడి చేసినట్టే. ఇది ముమ్మాటికీ దేశ ప్రజలను అవమానించడమే. దేశంలో విభిన్నవర్గాలు వారు తమ సంస్కృతులతో జీవనం కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలను విచ్ఛిన్నం చేసి వారి మధ్య వైరుధ్యాలను పెంచడానికి మోదీ సర్కారు కంకణం కట్టుకోవడం సిగ్గుచేటు. ఇలాంటి పరిణామాలపై తెలంగాణ సర్కార్ ముందుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నదని కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి హెచ్చరిక చేశారు. కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు మైనారిటీ వర్గాలతో పాటు పలు పార్టీలు పెద్దఎత్తున మద్దతు పలుకుతున్నాయి. ఇదే అంశంపై కేసీఆర్ సారథ్యంలో దేశ స్థాయిలో మరో ఉద్యమం జరుగనున్నది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాత్మకమైన పోరాటం ప్రజల పక్షమని సామాన్య ప్రజానీకం మద్దతు పలుకుతుంది.
బీజేపీ విధానాలు అలా ఉంటే.. బీజేపీ కంటే ముందు పదేండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అవినీతి బాగోతం ప్రజలకు తెలియంది కాదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసి 12 వందల మంది బలిదానాలకు ఆ పార్టీ కారణమైంది. దేశాన్ని పాలించమని అధికారమిస్తే ప్రజాస్వామ్యం పేరిట పాలనా పగ్గాలను గాలికి వదిలేసింది. లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసింది. ప్రధానంగా బొగ్గు గనుల కుంభకోణంలో ఏకంగా రూ.1.86 లక్షల కోట్లను కాంగ్రెస్, దాని మిత్రపక్షాల నాయకులు దోచుకున్నారు. తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్తును తీసివేసి కేవలం 3 గంటలే ఇస్తామని రైతు వ్యతిరేక నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారంలో లేనప్పుడే ప్రజా వ్యతిరేక విధానాలను బాహాటంగా వెలిబుచ్చుతున్నవారు, పొరపాటున గెలిస్తే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను కాదని రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అధికారం ఇచ్చారు.తత్ఫలితంగా కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కేసీఆర్ తీసుకున్న ప్రజా సంక్షేమ నిర్ణయాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. తెలంగాణలో నేడు ఏ మూలన చూసినా ప్రజా సంక్షేమం దాగి ఉన్నది. పుట్టిన పసిపాప నుంచి మొదలుకుంటే పండు ముసలి దాకా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు.
ఇది ఎన్నికల సమయం. అధికారం కోసం అనేక పార్టీలు తమ స్వార్థపూరిత రాజకీయాలతో వెంపర్లాడుతూనే ఉంటాయి. చిల్లర నాయకులు ప్రజలను మభ్యపెడుతూనే ఉంటారు. కాబట్టి చైతన్యవంతులైన తెలంగాణ ప్రజానీకం ప్రజా వ్యతిరేక పార్టీలను అధికారంలోకి రాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని నమ్ముకొని మరోసారి అధికారంలోకి రావాలని సంకల్పిస్తున్నది. ప్రజల కోసం పాటుపడే ప్రజా సర్కారుకు పట్టం కట్టి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టాలని, ఆ దిశగా ప్రజలు ఆదరిస్తారని ఆశిద్దాం.
(వ్యాసకర్త: మాజీ చైర్మన్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ)
మర్రి యాదవరెడ్డి
73372 22461