‘మా బిడ్డలు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. మా బిడ్డలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదిగి ఉన్నత స్థాయికి రావాలి’ అని బడుగుల తల్లిదండ్రులు గంపెడాశతో తమ బిడ్డలను గురుకుల స్కూళ్లకు పంపుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వరాష్ట్రం సాధించుకున్నాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 1,023 గురుకులాలను నెలకొల్పారు. అవి దేశంలోని నవోదయ పాఠశాలల కంటే ఎక్కువ సంఖ్యలో ఉండటం మరో విషయం.
అది 2016… అటు సైకిల్ షాప్‌లో పంచర్లు వేసుకుంటూ, ఇటు గురుకులంలో చదివే పిల్లవాడి దగ్గరికి వెళ్లి ‘నువ్వేం అవుదామనుకుంటున్నావు’ అని అడిగితే.. ‘నేను ఈ సూర్యాపేట కలెక్టర్ సురేంద్రమోహన్లా ఐఏఎస్ అవుతా’నని ఆ బడుగు బిడ్డ సమాధానం చెప్తే ఆనందపరవశం చెందాం. ఆ పిల్లాడే కాదు, చాలామంది బడుగుల విద్యార్థులు గురుకులాల్లో చదువుకొనే ఉన్నత చదువులకు వెళ్లారు. ఎవరెస్టు శిఖరాన్ని సైతం అవలీలగా అధిరోహించారు. నయా పైసా ఖర్చు లేకుండా తమ బిడ్డలు కార్పొరేట్ విద్యాలయాల్లో చదువుకుంటున్నారని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఫూలే ఆలోచనాదారిలో దార్శనిక దృష్టితో రాష్ట్రంలో వలె పెద్ద సంఖ్యలో గురుకులాల ఏర్పాటు దేశంలో ఎక్కడా జరగలేదు.
పీవీ నెలకొల్పిన గురుకులాలలో చదివిన పిల్లలే ఇప్పటి బుర్రా వెంకటేశం, సీఎస్ రామకృష్ణారావు. రాష్ట్రంలో ఇప్పుడున్న సగానికి పైగా గ్రూప్-1 ఆఫీసర్లు గురుకులాల నుంచి ఎదిగివచ్చినవారే.. వీరిని చూస్తే కేసీఆర్ నెలకొల్పిన 1,023 గురుకులాల నుంచి ఎంతమంది విద్యార్థులు సివిల్ సర్వెంట్లుగా వచ్చి తీరుతారోనని తెలంగాణ బడుగు సమాజం పరవశం చెందింది. గురుకులాలను సమర్థవంతంగా నిర్వహించి వాటి ప్రతిష్టను ఆర్ఎస్ ప్రవీణ్ పెంచారు. ఇక్కడి నుంచే ఉన్నత విద్యకు బలమైన బాటలుపడ్డాయి. గురుకులాలను చిదిమేసే పని నేటి పాలకులు చేస్తుంటే గుండె తల్లడిల్లుతున్నది. కళ్లల్ల నీళ్లు నిండుతున్నాయి. పదవులు వస్తయి, పోతయి. కానీ, గురుకులాలపైన విషంగక్కే ఎవ్వరినీ బడుగులు క్షమించరు.
అవును, తెలంగాణ సాయుధ పోరాటంలో తిరుగబడ్డ వీరులు దొర గడీలను కూల్చారు. ‘బాంచన్ దొర అనే బతుకులు మాకు వద్ద’ని 4 వేల మంది బడుగులు నేలకొరిగారు. నాటి నుంచి నేటి సాయుధ పోరాటాల్లో పాల్గొని నేలకొరిగిన వీరులంతా బడుగుబిడ్డల బంగారు భవిత కోసమేనన్నది సత్యం. అలాంటి బడుగు బిడ్డలకు గురుకులాల రూపంలో కార్పొరేట్ విద్య అందివస్తే బడుగులు మురిసిపోయారు. కానీ, నేడు విష ఆహారం పెట్టి బిడ్డల భవిష్యత్తును చిదుముతుంటే బడుగు తల్లిదండ్రుల గుండెలు మండుతున్నాయి? పిల్లలకు కలుషిత నీళ్లు, కలుషిత అన్నం పెట్టిన పాలకులను ఏమని నిలదీయాలి? తమ బతుకులు మార్చుతారనుకున్న కన్న బిడ్డలు శవాలై వాన చినుకుల్లా రాలిపోతుంటే బడుగుల తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోతున్నారు.
తెలంగాణ రాకముందు బీసీ పిల్లల ఉద్యమమంతా సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలపైనే జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాకారం తర్వాత గురుకులాలు రావటంతో బడుగుల బిడ్డలు ఊపిరి పీల్చుకున్నారు. గురుకులాలతో నాణ్యమైన విద్య లభిస్తుంది. కానీ, గత ఏడాదిన్నరగా గురుకులాల్లో విద్యార్థుల మరణమృదంగాలు తెలంగాణను తల్లడిల్లేలా చేశాయి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మళ్లీ పురుగులన్నం, నాసిరకం భోజనంతో ఫుడ్ పాయిజన్‌కు దారితీసే పరిస్థితులు వస్తాయన్న ఊహ కూడా లేదు. 20 నెలల్లో సుమారు 100 మంది చనిపోవటం కంటే మిం చిన విషాదం ఏముంటుంది? గురుకులాల్లో బిడ్డలకు మంచి భోజనం పెట్టండి, బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడాలని బడుగుల తల్లిదండ్రులు మొరపెట్టుకునే దశ మళ్లీ రావటం దారుణం.
అందుకే, గురుకులాల రక్షణ కోసం రాజకీయాలకతీతంగా బడుగులంతా ఏకం కావాలి. గురుకులాల్లోని బడుగుబిడ్డల రక్షణ కోసం పాలకులను నిలదీయాలి. ‘మా బిడ్డల్ని చంపే అధికారం మీకెవరిచ్చార’ని కోట్లాది గొంతుకలు ప్రశ్నించాలి. బడుగుల బిడ్డల ప్రాణాలను కాపాడటం కంటే ముఖ్యమైన పని ఈ ప్రభుత్వానికి ఏముంటుంది? కలుషిత ఆహారం పెట్టి వాళ్ల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న స్థితికి కారకులకు ఏ శిక్షలు వేయాలో న్యాయస్థానాలే నిర్ణయించాలి.
ఇంత దుర్మార్గాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులు సుమోటో కేసులుగా తీసుకొని నోరులేని బడుగుల బిడ్డల ప్రాణాలు కాపాడాలి. బడుగుల బిడ్డల చావులు చూస్తూ తెలంగాణ సృజనలోకం ఊరుకోదు. కింది కులాల బిడ్డల కోసం ఏర్పాటు చేసిన గురుకులాల్లో బిడ్డలకు నాసిరకమైన తిండి, కలుషిత ఆహారంతో విషం పెడుతుంటే సృజనకారులు చూస్తూ ఊరుకోరు. వెనుకబడిన కులాలు వెంటాడే కలాలవుతాయి. తెలంగాణ కవులు పదునెక్కిన కలాలై ప్రభావిస్తారు. ‘పల్లెటూరి పిల్లగాడా, పసులగాసే మొనగాడా’ అని పాట కట్టిన సుద్దాల హన్మంతుకు జవాబుదారీగా వెలిసిన గురుకులాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.
– (వ్యాసకర్త: రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు) జూలూరు గౌరీశంకర్