బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలను పరిశీలిస్తే.. రాజకీయ సుస్థిరత గత 20 ఏండ్లలో బలపడిందని స్పష్టమవుతున్నది. రాష్ట్ర విభజన తర్వాత రెండు దశాబ్దాల కిందట అంటే… 2005లో బీహార్ అసెంబ్లీకి ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ సాధారణ మెజారిటీ దక్కలేదు. అంతేకాదు, మెజారిటీ కూడగట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధాన రాజకీయపక్షాలు ముందుకురాలేదు.
గత పదకొండేండ్ల నుంచి ప్రతి రెండు, మూడేండ్లకు మిత్రపక్షాలను మార్చుకో వడాన్ని రాజకీయ ఎత్తుగడగా చేసుకున్నారు నితీశ్ కుమార్. అయితే, హిందూ జాతీయవాద పార్టీగా, మతతత్వ పార్టీగా పేరుమోసిన బీజేపీతో కాపురం చేయడం అంటే పెద్ద రాజకీయ సాహసమే.
ఈ ఎన్నికల్లో దివంగత నేత రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్‌జన్ శక్తి పార్టీ (ఎల్జేపీ) 29 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకొని, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ లేకుండా సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయాలని పట్టుబట్టడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఆ అసెంబ్లీ కొలువుదీరకుండానే రద్దయింది. ఫలితంగా ఆరు నెలల తర్వాత 2005, అక్టోబర్-నవంబర్‌లో జరిగిన 14వ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో ప్రధాన పక్షాలైన జనతాదళ్ (యూ), బీజేపీలకు మెజారిటీ సీట్లు (వరుసగా 88, 55) స్థానాలు దక్కాయి. మొత్తంమీద 2005 అక్టోబర్ నుంచి నితీశ్ పద్దెనిమిదేండ్ల మూడు నెలల కాలానికి పైగా అధికారంలో కొనసాగుతున్నారు.
బీహార్‌ను పాతికేండ్లుగా సంకీర్ణ ప్రభుత్వాలే పాలిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 11వ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 334 సీట్లకు గాను లాలూ పార్టీ అవిభక్త జనతాదళ్‌కు సాధారణ మెజారిటీకి అవసరమైన 167 స్థానాలు దక్కాయి. అప్పటినుంచి అంటే 2000 చివరలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ నిర్వహించిన ఏ ఎన్నికల్లోనూ ఏ ఒక్క రాజకీయపక్షానికీ సొంత మెజారిటీ రాలేదు. అయితే, డాక్టర్ రాంమనోహర్ లోహియా సోషలిస్టు వారసత్వ నేపథ్యం ఉన్న నితీశ్ 2005లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన రెండుసార్లు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే నుంచి (2014, 2022) బయటికొచ్చి మళ్లీ అందులో చేరి అధికారంలో కొనసాగడం బీహార్ రాజకీయాల్లో విశిష్ట పరిణామంగా చెప్పవచ్చు.
గత పదకొండేండ్ల నుంచి ప్రతి రెండు, మూడేండ్లకు మిత్రపక్షాలను మార్చుకోవడాన్ని రాజకీయ ఎత్తుగడగా చేసుకున్నారు నితీశ్ కుమార్. అయితే, హిందూ జాతీయవాద పార్టీగా, మతతత్వ పార్టీగా పేరుమోసిన బీజేపీతో కాపురం చేయడం అంటే పెద్ద రాజకీయ సాహసమే. వాజపేయి, నరేంద్ర మోదీ పాలనలో బీజేపీతో పొత్తు పెట్టుకొని బీహార్‌లో ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న నితీశ్ సోషలిస్టుగా వెనుకబడిన వర్గాల (ఓబీసీ) సాధికారత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. తన హయాంలో 2023లో బీహార్‌లో కులగణనను సమర్థంగా జరిపించారు.
అయితే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎక్కు వ కాలం సీఎం పదవిలో ఉన్న నేతగా తొలి ము ఖ్యమంత్రి శ్రీకృష్ణ సిన్హాది పాత రికార్డు. ఆయన ఈ పదవిలో కాంగ్రెస్ సీఎంగా దశాబ్దానికి పైగా కొనసాగారు. ఆయన రికార్డును నితీశ్ ఎప్పుడో అధిగమించారు. ఇప్పుడు 74 ఏండ్ల వయసులో నితీశ్ మరోసారి సీఎం పదవి కోసం 2025 అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి, ఎల్జేపీ (ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ తాను ఎన్డీయే కూటమిలో కొనసాగుతూనే రాబోయే ఎన్నికల్లో బీహార్‌లోని అన్ని సీట్లకు (243) తన అభ్యర్థులను నిలపడమే కాకుండా, తాను స్వయంగా ఒక జనరల్ సీటు నుంచి పోటీ చేస్తానని ఈ నెల 9న సంచలన ప్రకటన చేశారు.
ఎన్డీయే ప్రధాన పక్షాలు బీజేపీ, జేడీయూ తలా వంద సీట్లకు పోటీ చేస్తే తన పార్టీకి కనీసం 40 స్థానాలన్నా రావాలనే డిమాండ్‌ను చిరాగ్ ఈ విధంగా ప్రకటించారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. గత 20 ఏండ్లలో 18 ఏండ్ల మూడు నెలలకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ప్రజల్లో పాలక కూటమిపై వ్యతిరేకత నితీశ్ అంచనాలను దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నితీశ్ కుమార్‌కు నిజంగా ఒక అగ్నిపరీక్షేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-నాంచారయ్య మెరుగుమాల