Election Guarantees | ఐదు రాష్ర్టాలకు శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఇందులో మన రాష్ట్రం కూడా ఉన్నది. బాధ్యత కలిగిన పౌరులందరు తమ సుదీర్ఘమైన ఆలోచనతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయని నాయకుడిని ఎన్నుకోవాలి. అందుకిదే అనువైన సమయం. మనం ఓటుహక్కును వినియోగించుకునే క్రమంలో మన నిర్ణయాన్ని ప్రభావితం చేయటానికి అనేక రకాల ప్రలోభాలు మనముందు మెదులుతుంటాయి. ఎప్పుడో ఒకసారి కనపడే నేతలు ఈ నాలుగురోజులు ఎప్పుడూ కనపడతారు. ఎన్నో హామీలను గుప్పిస్తారు. నది లేకపోయినా బ్రిడ్జి నిర్మిస్తామని చెప్తారు. ఎందుకు అలా చెప్తారూ అంటే ఆ హామీలను నెరవేర్చే ఉద్దేశం ఉండదు కనుక. అందుకే దాన్ని ప్రలోభం అంటున్నాం. నెరవేర్చే ఉద్దేశం, నెరవేర్చే అవకాశం ఉన్న హామీలను ప్రలోభాలు అనకూడదు.
ఈ రోజు గట్టెక్కితే చాలు అనేదే ప్రలోభం అంటే. అందువల్ల అనేక ప్రలోభాలకు ప్రజలను గురి చేస్తుంటారు నాయకులు. ప్రజలు నిశితంగా గమనించాల్సింది హామీలు అమలు చేయదగినవా అనేది. ఇది చాలా ముఖ్యం. అమలు చేయదగిన హామీలను నమ్మవచ్చు. అలాంటి హామీలను నమ్మటానికి తాయిలాలు అవసరం లేదు. ప్రతి మనిషికీ విచక్షణ ఉంటుంది. ప్రతి మనిషికీ అర్థం అవుతుంది ఎవరు ఏం చెప్తున్నారు, వారి ఉద్దేశాలు ఏమిటి అనేది. గతంలో ఏం చెప్పారు, ఎంతమేరకు చేశారనేది ప్రతి మనిషీ బేరీజు వేసుకోగలడు. అయితే ప్రలోభాల ముందు మనిషి విచక్షణా జ్ఞానం బలహీనపడే ప్రమాదం ఉన్నది.
ఎన్నికల సమయంలో ముఖ్యంగా కులం, మతం, మందు, మనీ అనే నాలుగు ప్రలోభాలు ఓటర్లను వ్యక్తిగతంగా వెంటాడుతుంటాయి. వ్యవస్థపూర్వకంగా అలవికాని హామీలను గుప్పిస్తుంటారు. ఉచిత ప్రయాణమని, ఉచిత విద్యుత్తు అని, ఉచిత అది ఉచిత ఇది అని. ఈ ఉచితాల ఉచితానుచితాన్ని కాసేపు పక్కనపెడితే ఒక సాధారణ పౌరుడు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటాడనేది ఆలోచించాలి. ప్రజల కనీస అవసరాలు తీర్చాలి ప్రభుత్వం అనుకుంటాడు. ఈ కనీస అవసరాలు ఒక్కో మనిషికి ఒక్కో విధంగా ఉంటాయి. కొంతమంది అనుకునే కనీస అవసరాలు అభివృద్ధి జాబితాలోకి వస్తాయి, మరి కొంతమంది ఆశించే అవసరాలు సంక్షేమం జాబితాలోకి వస్తాయి. అయితే ఈ రెండింటినీ విడివిడిగా చూడరాదు. మొత్తం మీద ప్రజలు ప్రభుత్వం నుంచి ఆశించేది భవిషత్తుకు బాటలు వేసే చేయూతే కానీ ఈ పూటకు పబ్బం గడుపుకొనే సహాయం మాత్రం కాదు.
ప్రభుత్వం ప్రజలకు చేయూతనివ్వాలంటే దాని దగ్గర ఆర్థిక వనరులు ఉండాలి. ఆర్థిక వనరులు ఉండాలి, అంటే అభివృద్ధిని సాధించాలి. అంటే ఈ రెండూ కూడానూ ఒకదానికి ఇంకొకటి ముడిపడి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. వాహనం మీద బయటికి వెళ్లిన మనిషి క్షేమంగా తిరిగిరావాలంటే రోడ్లు బాగుండాలి. మంచి రోడ్లు అనేది అభివృద్ధికీ సంక్షేమానికి రెండిటికీ ముడిపడి ఉన్నది. అలాగే విద్య, ఆరోగ్యం, ఉపాధి గట్రా గట్రా. మౌలిక వసతులు కల్పించినప్పుడే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ప్రజలకు ఉద్యోగావకాశాలు, ప్రభుత్వానికి ఆదాయ వనరులు మెరుగవుతాయి. ఎప్పుడైతే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందో, ఎప్పుడైతే ప్రభుత్వం దగ్గర ఆర్థిక వనరులుంటాయో అప్పుడు వ్యక్తిగత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి వీలవుతుంది.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చే హామీలను జూసి మోసపోకూడదు. ఐదేండ్లు అధికారంలో ఉండి కూడా చెయ్యని పనిని, ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు హడావుడిగా చేస్తుంటారు. అలా చేసే పనుల్లో గానీ హామీల్లో గానీ చిత్తశుద్ధి ఉండదు. ఎన్నికల్లో గెలిస్తే ఆ హామీలు గాల్లో కలిసిపోతాయి. ఓడిపోతే చేతులు దులుపుకొంటారు మన నేతలు. రాజకీయ నేతలు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తే రాజనీతి నేతలు వచ్చేతరాల గురించి ఆలోచిస్తారు. దీన్ని విజ్ఞులైన ప్రజలు గమనించాలి. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అనేది ఎన్నో ఏండ్ల నుంచి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న అంశం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హఠాత్తుగా ఆ అంశాన్ని తెరమీదకు తెచ్చి మమ అనిపించి ఐదేండ్ల తర్వాత అమలు చేస్తామంటున్న నేతలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
ప్రజలకిచ్చే హామీలు సాధ్యం కావాలంటే నాయకత్వానికి ఒక దృఢచిత్తం, సంకల్ప బలం ఉండాలి. అందుకే నేతలు గుప్పించే హామీలు మభ్యపెట్టేవిగా ఉన్నాయా మార్పు తెచ్చేవిగా ఉన్నాయా అనేది మన విచక్షణతో ఆలోచించాలి. కేవలం ఉపన్యాసాలు విని ఒక నిర్ధారణకు రాకూడదు. సమయం, సందర్భం తగినవా, కాదా అన్న స్ఫూర్తితో ఆలోచించాలి. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చే వాగ్దానాల విషయంలో. ఎందుకంటే ఏ హామీలు ఇవ్వచ్చు, ఏ హామీలు ఇవ్వకూడదనే దాని మీద ఎటువంటి నియంత్రణా లేదు మన వ్యవస్థలో. ఇందాక అన్నట్టు నది లేకపోయినా బ్రిడ్జి నిర్మిస్తానంటే దాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. నాయకులు ఇచ్చే హామీలు మౌలిక వసతులు కల్పించేవిగా ఉన్నాయా, లేక పప్పుబెల్లాలు పంచేవిగా ఉన్నాయా అనేది చూడాలి.
నాయకులు ఇచ్చే హామీలు ఎన్నికల కోసమే ఇచ్చేవా లేక, వాటి అమలుకు చిత్తశుద్ధి ఉన్నదా అనేది కూడా ఆలోచించాలి. ఎన్నికల్లో నాయకులూ ఎన్నో హామీలు ఇస్తుంటారు. అవన్నీ అమలయినట్లయితే ఒక పేద దేశ ప్రజలుగా మనం ఉండేవాళ్లం కాదు నేడు. అమెరికాతో సమానంగా ఉండేవాళ్లం. భారతీయులకు విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తీస్తానన్న హామీ ఏమైంది? రైతు ఆదాయం 2022కి రెట్టింపు చేస్తానన్న హామీ ఏమైంది? 2022కి సొంత ఇల్లు హామీ ఏమైంది? 2022కి ప్రతి ఇంటికి విద్యుత్తు, తాగునీరు, శానిటేషన్ సదుపాయం కల్పిస్తామన్న హామీ ఏమైంది? 2022కి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లు చేరుకుంటుందన్న హామీ ఏమైంది? 2022కి బుల్లెట్ రైలు నడిపిస్తామన్న హామీ ఏమైంది? ఇవి ఉత్తుత్తి హామీలు!
ఇకపోతే ఉచితాలు ఇస్తామని చెప్తారు మన నాయకులు. ఉచితాలు ఎంతకాలంఇవ్వగలదు ఏ ప్రభుత్వమైనా? ప్రజలు ఎప్పుడూ ఉచితంగా వసతులు కల్పించమని అడగరు.కొన్ని సేవలు ఉచితంగా కల్పించటమనేది సంక్షేమానికి కట్టుబడి ఉన్న రాజ్యాంగంగా ప్రభుత్వాలు వాటంతట అవే ఏర్పాటు చేస్తుంటాయి.
ఉదాహరణకు ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలని కోరుకునేవారుంటారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన ఉచితంగా అందించాలని కూడా కోరుకుంటారు కొన్నివర్గాల వారు. మన దేశంలో ఉన్న విచిత్రం ఏమంటే ప్రాథమిక విద్యకు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తాం; అదే ఉన్నత విద్యకు ప్రభుత్వ వ్యవస్థల వైపు చూస్తాం. ఉదాహరణకు గవర్నమెంటు కాలేజీలో డాక్టరు కోర్స్, ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం పొందటం ప్రతిష్టాత్మకం. అదే ఎల్కేజీ దగ్గరి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రైవేటు బడుల్లో చదవటం కోరుకుంటాం. ప్రభుత్వ బడుల్లో పరిస్థితిని మెరుగుపరిచే కార్యక్రమాన్ని మధ్యతరగతుల వారు పెద్దగా అభినందించరు. ఎందుకంటే వాళ్ల పిల్లలు ఆ బడులకు పోరు గనుక. ఈ దమన నీతి నుంచి మనిషి బయటపడాలి. మెరుగైన వైద్యం, మెరుగైన విద్య మౌలిక వసతుల కల్పనలో భాగంగా, అభివృద్ధి కార్యక్రమంగానే చూడాలి. ఎక్కువ మంది ప్రజలు మెరుగైన రవాణా సౌకర్యం కావాలనుకుంటారు కానీ, డొక్కు బస్సుల్లో గుంతల రోడ్లలో ఉచిత ప్రయాణం కోరుకోరు. ఇట్లాంటి హామీలను ప్రజలే తిరస్కరించాలి. ఇక్కడే ఓటరు విజ్ఞత తెలిసేది.
ఇప్పుడు గనక మనం నోరు తెరవకపోతే వచ్చే ఐదేండ్లు ఐదు వేళ్లతో నోరు మూసుకోవాల్సిందే. ఇక్కడ ఏది కోరుకోవాలి? నోరెత్తి అడిగే స్వేచ్ఛా లేక నోరు మూసుకొని మౌనంగా ఉండే దౌర్భల్యమా? మనం స్వేచ్ఛను పరిరక్షించుకోవాలంటే మన ఓటును అమ్ముకోకూడదు. ప్రలోభం ఎంతటి బలమైనదైనా కూడా. ఓటుకు 500 ఇచ్చారనుకుందాం. అంటేఏడాదికి వంద. అదేనా మన ఓటు విలువ? అసలు మన ఓటుకు ఇంత అని విలువ కట్టగలమా?
కుళ్లిపోయిన కొబ్బరికాయను విసిరి అవతల పడేస్తాం. అభ్యర్థులను కూడా అలాగే చూడాలి. మంచి గుణగణాలు గలవారిని ఆదరించాలి. గతంలో వారు ఏ విధంగా ఉన్నారనేది చూడాలి. ‘ఒక మనిషి గుణం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడు. అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా నడుచుకుంటాడో అదే అతని గుణానికి నిదర్శనం’ అని జాన్.ఎఫ్.కెన్నెడి ఒక సందర్భంలో అన్నాడు. చాలా అద్భుతమైన మాట ఇది. మన నేతలు ఎన్నికల్లో చూపిన వినమ్రత విజయం తర్వాత ఉండదు. ప్రజలకు చేరువగా ఉండటమే అసలైన నాయకుడి లక్షణం.
మనకు ఆరోగ్యం బాగా లేకపోతే మంచి పేరున్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం గానీ మన కులం వాడి దగ్గరికి వెళ్లం కదా? అలాగే అభ్యర్థి గుణగణాలు చూడాలే కానీ కులం, మతం కాదు చూడవలసినది. మనం గనక ఓటును అమ్ముకున్నామంటే మనకు ప్రశ్నించే హక్కు ఉండదు. నాయకుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నిలదీసే స్వేచ్ఛ ఉండదు. అయితే ఇక్కడ చిక్కేమిటంటే మనం అడగకపోయినా మన చేతిలో పైసలు పెట్టి పోతుంటారు. అప్పుడే మన అసలు స్వరూపం బయటపడేది. పైసలు వద్దు అంటే ఎవరూ బలవంతం చెయ్యరు. ఈ వద్దూ అనే మాటను సంఘటితంగా అంటే దానికి గొప్ప బలం ఉంటుంది. గడ్డిపోచ ఒక్కటిగా ఉంటే బలహీనమైందిగానే మిగిలిపోతుంది. అదే నాలుగు గడ్డిపోచలను ఒకటిగా పెనవేస్తే బలమైన తాడవుతుంది. ఓటు కూడా అంతే. పది మంది సంఘటితమై ‘మీ ప్రలోభాలకు మేం లొంగం, మా అవసరాలేంటో గుర్తెరిగి నడుచుకోండి చాలు’ అంటే ఆ పది మందికి దక్కే గౌరవం అంతా ఇంతా కాదు. మనకు కావలసినది గౌరవమా? లేక కులానికో మతానికో లొంగిపోవటమా? మనం నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది. ‘రాజకీయం మన భవిష్యత్తును ప్రభావితం చేసేటట్లయితే, మన రాజకీయాన్ని మనం ప్రభావితం చెయ్యాలి’ అని అలనాటి రష్యా నాయకుడు లెనిన్ మహాశయుడు అన్నారు. మరి మన భవిష్యత్తును ప్రభావితం చేసేది రాజకీయమైతే, ఆ రాజకీయాన్ని మనం ప్రభావితం చెయ్యాలి కదా? దానికిదే గదా సరైన సమయం.
గుమ్మడిదల రంగారావు