కేసీఆర్ సర్కారు చేసిన అప్పుల గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కారు రూ.7.11 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని, ఈ అప్పుల వడ్డీలు చెల్లించేందుకే తమ ప్రభుత్వం నడ్డి విరుగుతున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలు నిజమా? అబద్ధమా? అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం.
ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2024 మార్చి 31 నాటికి తెలంగాణ అప్పులు (outstanding liabilities) రూ.3,89,673 కోట్లు మాత్రమే. రాష్ట్ర అభివృద్ధి రుణాలు (State Development Loans),ఉడాయ్ స్కీమ్, నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ (ఎన్ఎస్ఎస్ఎఫ్), నాబార్డ్, ఎల్ఐసీ, ఇతర జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, అంతర్గత రుణాలు, కేంద్ర రుణాలు ఇందులో ఉన్నాయి. అదనంగా ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన గ్యారెంటీల మొత్తం రూ.38,867.4 కోట్లుగా ఉంది.
ఆర్బీఐ డేటా ప్రకారం.. తెలంగాణ అప్పు-గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GSDP) నిష్పత్తి 26.2 శాతంగా ఉంది. దేశంలోని 28 రాష్ర్టాల్లో ఇందులో తెలంగాణ 24వ స్థానంలో ఉంది. అంటే తెలంగాణ అప్పుల భారం దేశంలో అత్యంత తక్కువ ఉన్న రాష్ర్టాల్లో ఒకటిగా ఉందని ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పు ఆరోపణలు అబద్ధమని డేటా వివరాలు తెలియజేస్తున్నవి. రాజకీయ లబ్ధి కోసం, బీఆర్ఎస్పై నిందలు వేసి సంక్షేమ పథకాల (ఉదాహరణకు రైతు రుణమాఫీ) అమల్లో జరుగుతున్న జాప్యాన్ని సమర్థించుకోవడానికి ముఖ్యమంత్రి ఈ ఆరోపణలు చేస్తున్నారు.
2024 మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.3,50,520.39 కోట్లు. ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ లోక్‌సభలో తెలిపింది. ఈ మొత్తంలో బహిరంగ మార్కెట్ రుణాలు రూ.3,14,545.68 కోట్లు, ఓవర్‌డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్ కింద రూ.999.62 కోట్లు, ప్రత్యేక సెక్యూరిటీల ద్వారా తీసుకున్న రుణం రూ.4,723.16 కోట్లుగా ఉన్నట్లు వివరించింది. కేంద్ర ప్రభుత్వ డేటా (ఆగస్టు 2025) ప్రకారం.. తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ సర్కారు నికర అప్పు రూ.2.86 లక్షల కోట్లు, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల్లో రూ.2.17 లక్షల కోట్ల రుణం తీసుకున్నది.
అన్ని డేటా వివరాలు గమనిస్తే కేసీఆర్ ఒక శిథిలమైన ఆర్థిక వ్యవస్థను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ నుంచి దానిని ఆర్థిక శక్తిగా మలిచిన దార్శనిక నాయకుడిగా నిలిచారు. దశాబ్దాల పోరాట ఫలితంగా పురుడుపోసుకున్న ఈ రాష్ర్టాన్ని ఆయన స్వల్పకాలిక జనాకర్షణ పథకాలకు బదులు దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రగతి పథాన నడిపించారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేసీఆర్ పాలనను అప్పుల ఆరోపణలతో నిందిస్తూ ఆయన వారసత్వాన్ని మసకబార్చే ప్రయత్నం చేస్తున్నది. వాస్తవానికి, కేసీఆర్ ఆ రుణాలను మౌలిక సదుపాయాలు, సంక్షేమం, ఆర్థిక వృద్ధిలో వ్యూహాత్మక పెట్టుబడులుగా పెట్టారు. అవి రాష్ర్టానికి భారీ ఆస్తులను సృష్టించాయి. కేసీఆర్ పాలన ఆర్థిక సంక్షోభం కాదు, బదులుగా తెలంగాణ శ్రేయస్సుకు బీజం వేసిన దూరదృష్టి గల నాయకత్వమని చెప్పవచ్చు.
రేవంత్ రెడ్డి చేస్తున్న రూ.7 లక్షల కోట్ల అప్పుల ఆరోపణను ఆర్బీఐ డేటాతో పోల్చి చూస్తే, 2014-15లో రూ.72,658 కోట్లుగా ఉన్న ప్రత్యక్ష అప్పు, 2023 మార్చి నాటికి రూ.3.52 లక్షల కోట్లకు పెరిగింది. అప్పు-జీఎస్డీపీ నిష్పత్తి 27 శాతం వద్ద స్థిరంగా ఉంది. ఇది దేశ సగటు కంటే తక్కువ, ఇతర రాష్ర్టాలతో పోల్చితే నిర్వహించదగినది. కాంగ్రెస్ ఆరోపణలు అబద్ధమని, తను చేసి రుణాలను కప్పిపుచ్చుకోవడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ ఆరోపణలు చేస్తున్నారని పైన పేర్కొన్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రజల అవసరం నుంచి కేసీఆర్ ఆర్థిక వ్యూహం ఉద్భవించింది. విభజన తర్వాత తక్కువ ఆస్తులతో ఆరంభమైన తెలంగాణ రాష్ట్రం నీటి కొరత, విద్యుత్ సమస్యలు, గ్రామీణ ఆర్థిక ఇబ్బందులతో సతమతమైంది. మిషన్ భగీరథ, 24 గంటల విద్యుత్ సరఫరా, రైతు బంధు, డబుల్ బెడ్రూం వంటి పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పన ద్వారా ఈ సమస్యలను కేసీఆర్ పరిష్కరించారు. ఈ కార్యక్రమాలు ద్వారా వచ్చిన ఫలితాలు అసాధారణమైనవి. తెలంగాణ తలసరి ఆదాయం 2014లో రూ.1.24 లక్షల నుంచి 2023 నాటికి రూ.3.5 లక్షలకు పెరిగింది. దేశ సగటును మించిపోయింది. హైదరాబాద్ మెట్రో, ఐటీ హబ్‌ల వంటి మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇవి ఉద్యోగాలు, పన్ను ఆదాయాన్ని సృష్టించాయి. ప్రైవేట్ రంగంలో లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి.
కేసీఆర్ రుణాలు ఆస్తుల సృష్టికి దారితీశాయి. కేసీఆర్ పాలనలో రూ.7.5 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించబడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 18 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి, వ్యవసాయ ఉత్పత్తిని పెంచింది. విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. పర్యాటక రంగంలో ఆదాయాన్ని సృష్టించింది. రాష్ట్ర జీఎస్డీపీ మూడింతలు పెరిగి రూ.15 లక్షల కోట్లకు చేరింది. వ్యవసాయం సంవత్సరానికి 5 శాతం వృద్ధి చెందింది. ఇవి కేసీఆర్ రుణాలు భారం కాదు, పెట్టుబడులని నిరూపిస్తాయి. దీనికి విరుద్ధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఆస్తుల సృష్టి జరగకపోవడంతో, రాష్ర్టానికి భారంగా మారుతాయి. కేసీఆర్ కాలంలో లేని ఆర్థిక సంక్షోభం గురించి చెప్పి రేవంత్‌రెడ్డి ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి కోసం ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు విధానాల వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఈ సొంత ఆర్థిక సవాళ్లను మరుగునపరచడం కోసమే కేసీఆర్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ సవాళ్లను కప్పిపుచ్చడానికి బీఆర్ఎస్ అప్పులను హైలైట్ చేయడం ద్వారా, తమ ప్రభుత్వం ఆర్థికంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నదనే భావనను సృష్టించాలని చూస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించడం ద్వారా కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, ఆయన ఘనతలను తక్కువ చేసి చూపడం, ప్రజల్లో వ్యతిరేక భావనలను రేకెత్తించడం, కాంగ్రెస్ ఇమేజ్ను బలోపేతం చేయడమే రేవంత్‌రెడ్డి ఆరోపణల వెనుక ఉన్న మర్మం.
కేసీఆర్ పాలన పారదర్శకత, ఆర్థిక నియమాలకు కట్టుబడి ఉంది. తెలంగాణ అప్పులు ఎక్కువయ్యాయని ఆర్బీఐ ఎన్నడూ హెచ్చరించలేదు. రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ బలంగా ఉండి తక్కువ వడ్డీ రుణాలను సాధించింది. ఇతర రాష్ర్టాల్లో ఆఫ్-బడ్జెట్ రుణాలను గ్యారెంటీలు, విజయవంతమైన పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాల కోసం ఉపయోగించారు. కానీ, కేసీఆర్ సంక్షేమ మోడల్ బడ్జెట్లో మాత్రం 70 శాతం నిధులను సామాజిక రంగాలకు కేటాయించి అసమానతలను తగ్గించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
అప్పులు అనే పదం వినగానే భయం కలుగుతుంది. కానీ, ఆర్థిక శాస్త్రంలో అప్పు ఎల్లప్పుడూ చెడ్డది కాదు. ఒక రాష్ట్రం లేదా దేశం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు, విద్య, వైద్యం, సాంకేతికత, పరిశ్రమలు వంటి రంగాల్లో పెట్టుబడులు అవసరం. ఈ పెట్టుబడులకు నిధులు సమకూర్చడానికి అప్పులు ఒక సాధనంగా ఉపయోగపడతాయి. అమెరికా, జపాన్ వంటి దేశాలు లక్షల కోట్ల డాలర్ల అప్పులు చేసినప్పటికీ, వాటిని సంపద సృష్టికి, అభివృద్ధికి ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలుగా నిలిచాయి. అప్పులు ఎప్పుడు శాపంగా మారుతాయంటే వృథాగా ఖర్చు చేసినప్పుడు. కానీ, అప్పులను పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రం వరంగా మారుతాయి.
రాష్ట్రం ఒక కుటుంబం లాంటిది. ఒక కుటుంబం తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల చదువుల కోసం అప్పు చేసినట్లే.. ఒక రాష్ట్రం కూడా తన ప్రజల జీవన ప్రమాణాలను ఉన్నతీకరించడానికి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అప్పులు చేయవలసి ఉంటుంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ అనేక అప్పులు చేసింది, ఇది నిజం. ఈ అప్పులను అప్పులపాలు అని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. కానీ, ఆ అప్పులతో సాధించిన అభివృద్ధిని చూస్తే భారమో, కాదో తెలుస్తుంది. తెలంగాణకు కేసీఆర్ రుణాలు వరంగా, రేవంత్ రెడ్డి రుణాలు శాపంగా మారాయి.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అమెరికాదే. ఈ దేశం కూడా లక్షల కోట్ల డాలర్ల అప్పులో ఉంది. అయినా అమెరికా అప్పుల పాలైందని ఎవరూ అనరు. ఎందుకంటే, ఆ అప్పులను అది దేశ ఆర్థిక వృద్ధికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆవిష్కరణలకు, పరిశోధనలకు వినియోగించింది. రోడ్లు, విమానాశ్రయాలు, టెక్నాలజీ హబ్‌లు, విద్యా సంస్థలు.. వంటివన్నీ అమెరికా అప్పుల ద్వారా సాధించిన సంపదలు. ఈ సంపద సృష్టి వల్ల ఆ దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలిచింది. అదే విధంగా తెలంగాణలో కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచింది.
అదే విధంగా, కేసీఆర్ సర్కారు తెలంగాణ కోసమే అప్పులు చేసింది. ఆ అప్పులతో రాష్ర్టానికి ఒక బలమైన పునాది ఏర్పడింది. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు రాష్ట్ర ప్రజల జీవనోపాధిని బలోపేతం చేశాయి. ఈ పథకాలు కేవలం ఖర్చులు కావు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన పెట్టుబడులు. ఈ అప్పులు రాష్ర్టాన్ని ఆగం చేయలేదు, బదులుగా ఒక స్వయం సమృద్ధ తెలంగాణకు బాటలు వేశాయి. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న రూ.2.17 లక్షల కోట్ల అప్పులను ఎక్కడ పెట్టుబడి పెట్టారనే విషయంపై స్పష్టత లేకపోవడం విచారకరం. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు లేవు, మిషన్ భగీరథ వంటి సంక్షేమ పథకాలు లేవు. రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీల వంటి హామీలు అమలు కావడం లేదు. ప్రజలు నిరాశలో మునిగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రుణాలను ఆస్తుల సృష్టికి బదులు రోజువారీ ఖర్చులకు వినియోగిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నది.
కేసీఆర్‌పై రూ.7 లక్షల కోట్ల అప్పు ఆరోపణలు చేస్తూ, వాస్తవాలను రేవంత్ వక్రీకరిస్తున్నారు. కేసీఆర్ పాలనలో మొత్తం ప్రత్యక్ష అప్పు రూ.3.52 లక్షల కోట్లు మాత్రమేనని, ఆఫ్-బడ్జెట్ రుణాలు కూడా దీర్ఘకాలిక ఆస్తుల సృష్టికి ఉపయోగించబడ్డాయని ఆర్బీఐ స్పష్టం చేస్తున్నది. కానీ, రేవంత్ అప్పులు ఎటువంటి గుర్తింపు లేని ఖర్చులుగా మారి, తెలంగాణ యువత, రైతుల ఆశలను నీరుగార్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చేందుకు కేసీఆర్‌ను నిందిస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నది. రేవంత్ ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చడంలో విఫలమై, కేసీఆర్‌ను నిందించడం ద్వారా తమ అసమర్థతను కప్పిపుచ్చుతున్నది. ఆరు గ్యారెంటీల అమలులో జాప్యం, పెట్టుబడులు తీసుకురావడంలో వైఫల్యాలు ప్రజలలో నిరాశను నింపాయి. కాంగ్రెస్ అప్పులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తున్నాయి. దీర్ఘకాలిక ఆస్తుల సృష్టికి దోహదం చేయడం లేదు. కాంగ్రెస్ హామీలు కేవలం ఎన్నికల ఆటవిడుపుగా మారా యి, ప్రజల ఆశలను చిదిమివేశాయి.
కేసీఆర్ సర్కారు రుణాలు తెలంగాణ గడ్డపై సంపద విత్తనాలు నాటాయి. ఆయన చేసిన అప్పు రైతు జీవనోపాధి, గ్రామం శ్రేయస్సు, యువత భవిష్యత్తు కోసం. కానీ, రేవంత్ అప్పులు రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. కేసీఆర్ ఒక నిర్మాత, తెలంగాణ స్వప్నాలను సాకారం చేసిన దార్శనికుడు. ఆయన వారసత్వం తెలంగాణ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. రేవంత్ ప్రభుత్వం ఈ
చరిత్రను మరిచి, తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నిందలు వేస్తున్నది.
కేసీఆర్ నాయకత్వం తెలంగాణను శక్తివంతమై న, స్వయం సమృద్ధ రాష్ట్రంగా మార్చింది. ఆయన రుణాలు ఆర్థిక లాభాలుగా మారాయి. రాష్ట్ర శ్రేయస్సును పెంచాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆరోపణలు కేవలం రాజకీయ నాటకం, తమ సొంత అసమర్థతలను కప్పిపుచ్చే ప్రయత్నం. కేసీఆర్ వారసత్వం శాశ్వతం. ఆయన తెలంగాణ ప్రజల కలలను నిజం చేసిన నిర్మాత.
(వ్యాసకర్త: రచయిత, రాజకీయ విశ్లేషకులు)
–మహేంద్ర తోటకూరి
97048 48648