మరొక్కసారి 1953-56 నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అప్పటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తయ్యాయి. తమకంటూ ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోలేని ఆ ప్రాంత నాయకత్వం ఎలా బతకాలా అని అల్లాడిపోయింది. రెండున్నరేండ్ల ముందు వరకు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా అక్కడి ఆదాయంతో ఇక్కడి ఆదాయాన్ని కలుపుకొని నెట్టుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత సొంతంగా పరిపాలించుకోవడం చేతకాలేదో, లేక మరే కారణమో తెలియదు కానీ.. రాజధానిని నిర్మించుకోకుండా మద్రాసులో కొన్ని కార్యాలయాలను ఉంచుకొని, కర్నూల్లో కొన్ని గుడారాలలో కార్యాలయాలతో కాలం వెల్లదీశారు. సరిగ్గా ఇప్పుడు అదే ఆంధ్ర రాష్ట్రం మరోసారి ఆంధ్రప్రదేశ్ పేరుతో ప్రత్యేకంగా ఏర్పడి పుష్కర కాలం గడిచినా నాటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నది.
1956కు ముందు సొంతరాష్ట్రంగా, సొంత ఆదాయం, మిగులు బడ్జెట్‌తో విలసిల్లిన తెలంగాణ.. ఇప్పుడు నిరంతర పోరాటం చేసి సంకెళ్లు తెంచుకొని మరోసారి తన కాళ్ల మీద తాను నిలబడటానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఏపీకి మాత్రం మళ్లీ అవే రోజులను ప్రతిబింబిస్తున్నది. అప్పుడు రెండున్నరేండ్లు.. ఇప్పడు పన్నెండేండ్లు. రాజధానిని సంపూర్ణంగా ఏర్పాటు చేసుకోలేదు. అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్తూనే ఉన్నారు. సచివాలయం, వివిధ శాఖల కార్యాలయాలు, అసెంబ్లీలు అన్నీ తాత్కాలికమేనని అంటున్నారు (కర్నూలు గుడారాల మాదిరిగా). ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు పన్నెండేండ్ల తర్వాత కూడా తెలంగాణలోనే నివాసముంటున్నారు. నాడు మద్రాసులో ఎట్లా ఉండేవారో.. ఇప్పుడూ అట్లాగే కదలకుండా మఠం వేసుకొని ఉండిపోయారు.
అప్పుడు ఒకరి తర్వాత ఒకరు విశాలాంధ్ర పాట అందుకున్నారు.. రాగాలు పోయారు. నాడు ‘హైదరాబాద్‌తో మనం వెళ్లి కలిస్తే.. మన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. దీన్ని సాధించే మార్గాలను అన్వేషించాలి’ అంటూ టంగుటూరి ప్రకాశం పంతులు మాట్లాడారు. ‘మనకు రాజధానికి కావాల్సిన వనరులున్న నగరం ఒక్కటి కూడా లేదు.. గత రెండు సంవత్సరాలలో మనం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఫజల్ అలీ కమిషన్ మాట విని మరో ఐదేండ్లు ఆగితే.. మనం తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కర్నూలు అసెంబ్లీలో నీలం సంజీవరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా మళ్లీ సరిగ్గా అవే తరహా స్వరాలు మొదలయ్యాయి. ఈసారి జాతీయ వాదం ముసుగులో తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలైంది. ఈ రకంగా మళ్లీ ఆంధ్ర స్వరాలు మరొక్కసారి తెలంగాణ గడ్డపై రెచ్చిపోతున్నాయంటేనే దాని వెనుక లోతైన కుట్ర వాసన గుప్పుమంటున్నది. తమ రాష్ర్టాన్ని తాము అభివృద్ధి చేసుకోలేక, మళ్లీ తెలంగాణను లేదా హైదరాబాద్‌ను లాక్కోవడానికి పన్నుతున్న పన్నాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున వలస పక్షి ఒకటి వచ్చి కావు కావుమని అరచిపోయింది. అంతకుముందు పది రోజులుగా తెలంగాణలో ఓ సీనియర్ జర్నలిస్ట్ చేసిన ఒక వ్యాఖ్యను పట్టుకొని మొత్తం తెలంగాణ వైపు రాజకీయాన్ని అనూహ్యంగా తిప్పేశారు. తెలంగాణ అస్తిత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణను వ్యతిరేకించిన రోశయ్య, తెలంగాణకు ద్రోహం చేసిన ఎన్టీఆర్ లాంటి నేతల విగ్రహాలను స్థాపించడం ద్వారా మళ్లీ తెలంగాణ గాయాలను రేపుతున్నారు. అదేమని ప్రశ్నించగానే తెలుగుజాతి పాట మళ్లీ మొదలు పెడుతున్నారు.
తెలంగాణేతర నాయకత్వానికి ఒక విచిత్రమైన లక్షణం ఉన్నట్టు కనిపిస్తుంది. మొదట్నుంచీ కూడా అక్కడి నాయకత్వ పోకడను గమనిస్తే అది సులువుగానే అర్థమవుతుంది. ఆ నాయకులు ఒక రకమైన సూపర్ సుపీరియర్ కాంప్లెక్సిటీతో ఉంటారు. సొంతంగా తమను తాము పరిపాలించుకోవడం చేతనైనట్టు కనిపించదు. ఆనాడైనా, ఈనాడైనా జాగ్రత్తగా గమనిస్తే వాళ్లు విఫల నేతలని మనకు అర్థమవుతుంది. తమ ప్రాంతంలో అభివృద్ధి ఎందుకు చేసుకోలేరో.. లేక చేతకాదో అర్థం కాదు. నాడు మద్రాసులో పెట్టుబడి పెట్టి, మద్రాసును మేమే అభివృద్ధి చేశామన్నారు. తర్వాత హైదరాబాద్ కలిస్తే చాలు మొర్రో అని వచ్చి కలిశారు. తీరా కలిశాక హైదరాబాద్ మా దయాదాక్షిణ్యాలపై బతుకుతుంది.. మేం వచ్చి పెట్టుబడులు పెడితేనే తెలంగాణ బతుకుతున్నారు. ఈ అనేవాళ్లే.. తమ సొంత ప్రాంతా ల్లో మాత్రం ఎందుకు ఇవే పెట్టుబడులు పెట్టరు? తమ ప్రాంతంలో సొంతంగా రెండు భవనాలు కట్టుకొని పరిపాలను ఎందుకు చేసుకోరు?
తెలంగాణ రావడానికి అడ్డం, నిలువు పడుకున్న నాయకుడు.. రాష్ట్రం వచ్చిన నాటి నుంచి కూడా తెలంగాణను విఫలం చేయడానికి కుట్రలు పన్నాడు. ప్రభుత్వాన్ని కూల్చడానికి పెద్ద ఎత్తున డబ్బులు కుమ్మరించాడు. విద్యుత్తు రాకుండా అడ్డుకున్నాడు. ఢిల్లీ పార్టీతో కుమ్మక్కై సైలెంట్‌గా సీలేరు కొట్టేశాడు. ఏడు మండలాలు ఎత్తుకుపోయాడు. ఇవన్నీ తీసుకొనిపోయి ఏదైనా తన ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేశాడా అంటే అదీ లేదు. హైదరాబాద్ చూరు పట్టుకొని వేళ్లాడుతూ.. అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నడు.
రాష్ట్ర విభజనను ఉద్దేశించి ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అని ఓ పెద్దమనిషి అన్నాడు. ఇంకొ నాయకుడు దేశ విభజనతో పోల్చాడు. మరో నాయకుడు వచ్చి మీ అయ్య జాగీరా అన్నాడు. వీటన్నింటి వెనుకా కచ్చితంగా కుట్ర ఉన్నది. తెలంగాణను, హైదరాబాద్‌ను తిరిగి లాక్కొనే బలమైన దురుద్దేశం ఉన్నట్టు అనిపిస్తున్నది. ఆంధ్రుల విగ్రహాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం తెలంగాణపై సాంస్కృతిక ఆధిపత్యానికి మరోసారి కుట్ర జరుగుతుందనడానికి నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ స్వీయ పాలనలో విఫలం కావడంతో అక్కడి నేతలు తిరిగి హైదరాబాద్ వైపు చూడటం మొదలైంది. ఏపీ పాలకులు తెలంగాణలోనే నివాసం ఉండటం, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు.. తూలనాడే మాటల వెనుక తీవ్రమైన కుట్రకోణాన్ని పసిగట్టకపోతే.. మరోసారి తెలంగాణను కోల్పోయే ప్రమాదమున్నది. ఎందుకంటే, ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ సభ్యుడే మరో జెండా పట్టుకొని తెలంగాణలో ముఖ్యనేతగా ఉన్నాడు. తెలంగాణ అంటే పడని పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఈ క్రమంలో ఎలాంటి దుస్సాహసానికైనా ఒడిగట్టే ప్రమాదం ఉన్నది. దీన్ని తెలంగాణ ప్రజలంతా ఒక్కటిగా అడ్డుకోవడమే తక్షణ కర్తవ్యం.
-కోవెల సంతోష్‌కుమార్