తెలంగాణ గవర్నర్ ఎవరు?’ అని ఓ జర్నలిస్ట్‌ను అడిగినా వెంటనే పేరు చెప్పడం కష్టం. ఈ వ్యాసం రాయడానికి ముందు నేను కూడా గవర్నర్ పేరు జిష్ణుదేవ్ వర్మ అని గూగుల్‌లో చూసి తెలుసుకున్నా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారపక్షం, ప్రతిపక్ష నాయకుల పేర్ల కన్నా గవర్నర్ తమిళిసై పేరు, ప్రతిపక్ష నాయకురాలిగా ఆమె ప్రభుత్వంపై చేసే విమర్శలకు మీడియాలో బాగా ప్రచారం లభించేది.
ఐటీ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్‌కుమార్ పేరును గవర్నర్ కోటా కింద బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేస్తే గవర్నర్ తమిళిసైకి శ్రవణ్‌లో రాజకీయ నాయకుడు కనిపించారు. సిఫారసును గవర్నర్ ఆమోదించలేదు. అదే ఖాళీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోదండరాం రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారు. కోదండరాం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటుచేసి దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా కోదండరాంలో రాజకీయ నాయకుడు కనిపించలేదు. బీజేపీకి నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే గవర్నర్ల వ్యవహారం ఒక రకంగా ఉంటుంది. నచ్చకపోతే ఇంకో రకంగా ఉంటుంది. అందుకు గవర్నర్‌గా తమిళిసై వ్యవహార శైలియే ప్రధాన కారణం.
నిజానికి బీజేపీ రాజకీయాల ప్రకారం రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికన్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని గవర్నర్ ఎక్కువ ఇబ్బంది పెడతారనుకుంటాం. కానీ, బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ నిర్ణయాలకు గవర్న ర్ అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ పేరు జర్నలిస్ట్‌లకు సైతం గుర్తులేనంత సాఫీగా సాగిపోతున్నది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల అనుబంధానికి ఇదో ఉదాహరణ. రాజకీయపక్షాల మధ్య ఒప్పందాలు, స్నేహాలు లిఖిత పూర్వకంగా ఉండవు. తమ తమ పార్టీల ప్రయోజనాల మేరకు పార్టీల మధ్య ఇలా అనుబంధాలు పెనవేసుకుంటాయి.
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్. దీనివల్ల అనివార్యంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య అనుబంధం ఏర్పడుతున్నది. ఒకవేళ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తాము ఉధృతంగా ఉద్యమించినా ఇప్పటికిప్పుడు మేం అధికారంలోకి రాం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మా ఉద్యమం వల్ల బీఆర్ఎస్కే లాభమనే భావన బీజేపీలో ఉండటం సహజం. పైకి ప్రకటించకపోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటిలో ఒక పార్టీ కోరుకోమంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడమే మేలని బీజేపీ కోరుకుంటుంది. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ బలహీనపడుతుంది, అప్పుడు ఆ స్థానాన్ని తాము తీసుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతుంది. అందుకే, రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు ఎన్ని ఉన్నా బీజేపీ మాత్రం ఇంకా బీఆర్ఎస్నే విమర్శిస్తున్నది. ‘కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో అడవులను నాశనం చేస్తున్నది’ అని హెచ్‌సీయూ వ్యవహారంలో ప్రధాని విమర్శిస్తే తెలంగాణలో మాత్రం ఏ ఒక్క బీజేపీ నాయకుడు నోరు మెదపలేదు. అంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ బద్ధ శత్రువులైనా ఈ రెండు పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరి పట్ల ఒకరు సానుకూల ధోరణితో ఉన్నారనేది సుస్పష్టం.
‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదం ఇచ్చిన పార్టీ బీజేపీ. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు చెప్పుకుంటున్న పార్టీ కాంగ్రెస్. దేశవ్యాప్తంగా ఈ రెండు పార్టీలు పరస్పరం ఆగర్భ శత్రువుగా భావిస్తాయి. కానీ, తెలంగాణలో మాత్రం వీటికి విడదీయరాని అనుబంధం ఉన్నది. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనం కోసమే పనిచేస్తాయి. ఏ రాజకీయ పార్టీ కూడా మరో పార్టీ ప్రయోజనం కోసం పనిచేయదు. బీజేపీ తమ రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెస్ పట్ల అనుకూల వైఖరితో ఉంటున్నది. అదేవిధంగా కాంగ్రెస్ సైతం తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ పట్ల సానుకూల వైఖరితో ఉంటున్నది. ఈ రెండు జాతీయ పార్టీల ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్.
ఈ మధ్య కేంద్రమంత్రి బండి సంజయ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌కు క్యాడర్ ఎక్కడుంది? బీఆర్ఎస్పై మనం పోరాడితే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాడు’ అని ప్రకటించారు. ఇందులో కొంత నిజం ఉన్నది. చివరికి బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవ తరగతి ప్రశ్న పత్రాన్ని లీక్ చేయించి ఉద్యమించారు. విచారణలో బండి సంజయ్ సెల్‌ఫోన్‌ను పోలీసులు అడిగితే పోయిందని చెప్పారు. ప్రభుత్వంపై పోరాడేందుకు విద్యార్థుల భవిష్యత్తును సైతం నాశనం చేసేందుకు పేపర్ లీక్ చేయించిన బండి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్న పత్రాలు లీక్ అయినా మౌనంగా ఉన్నారంటే బీజేపీ, కాంగ్రెస్ మైత్రిని అర్థం చేసుకోవచ్చు.
హెచ్‌సీయూ భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టి, రాత్రికి రాత్రి వంద ఎకరాల్లో చెట్లను నరికితే వన్యప్రాణులు మరణించడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయిం ది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపుతామని హెచ్చరించింది. ఇది మాట వరుసకు హెచ్చరిక కాదు, చెట్లు కూల్చిన వంద ఎకరాల్లో తిరిగి మొక్కలు నాటడం గురించి ప్రశ్నించి, లేకపోతే అక్కడే జైలు నిర్మించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపుతామని తాజాగా బుధవా రం సుప్రీం కోర్టు హెచ్చరించింది. సుప్రీం కోర్టు సైతం సీరియస్‌గా తీసుకున్న ఈ అంశాన్ని బీజేపీ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా బీజేపీ నాయకులు ఇంకా బీఆర్ఎస్ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉం దని భావిస్తూ… హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో సైతం బీఆర్ఎస్నే విమర్శిస్తున్నారు. ఈ భూముల వ్యవహారంలో బీజేపీ నాయకులు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా వాదిస్తున్నారు.
తమిళనాడులో బిల్లులు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని గవర్నర్ ముప్పు తిప్పలు పెడితే చివరికి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఒక్క తమిళనాడులోనే కాదు, కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీలో సైతం ఇదే పరిస్థితి. బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలు మినహాయించి మిగిలిన అన్ని రాష్ర్టాల్లో గవర్నర్లతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాయి. కానీ, తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితులున్నాయి. అంటే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల బంధం ఎంత దృఢంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
-బుద్దా మురళి