లోక్‌సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి ఇంత తీవ్రస్థాయిలో ఉండటం నిరాశను కలిగించేదే అయినా, కనీసం ఒక స్థాయిలో ముందుగా ఊహించనిదేమీ కాదు. లోక్‌సభ ఎన్నికలు స్థానిక అంశాలకు సంబంధించినవి కావని, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ మాత్రమేనని, అందువల్ల దేశాన్ని పాలించగల జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లలో దేనికో ఒకదానికి ఓటు వేయాలన్న ప్రచారం బాగా సాగింది. అది పట్టణ ప్రాంతాల్లోనే గాక గ్రామాల్లో కూడా తగినంత మందిని మెప్పించిన సూచనలు ముందునుంచీ కన్పించాయి.
అందుకు అదనంగా ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ, మరొకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు తెలంగాణలో పలుమార్లు చేసిన ప్రచారాలు ప్రభావం చూపాయి. బీఆర్ఎస్ కేంద్రంలో పాలించగల జాతీయ పార్టీ కాకపోయినా, జాతీయస్థాయిలో కాపాడవలసిన రాష్ట్ర ప్రయోజనాలు అనేకం ఉంటాయని, వాటికోసం గతంలో బీజేపీ, కాంగ్రెస్‌లు చేసింది స్వల్పం అయినందున అటువంటి కృషి కోసం ప్రజలు తమను ఎన్నుకోవాలని నచ్చజెప్పేందుకు బీఆర్ఎస్ నాయకత్వం గట్టి ప్రయత్నమే చేసింది. కానీ ఆ కీలకమైన వాదం ప్రజల మనసులలోకి సరిగా పోలేదని ఇప్పుడు ఫలితాలను బట్టి స్పష్టమవుతున్నది.
బీఆర్ఎస్కు గత 24 ఏండ్లలో జయాపజయాలు, ఇతర ఒడిదుడుకులు కొత్త కాదు. ప్రజలలో గల మౌలిక ఆకాంక్షలు, ఇతర పార్టీలు మరి వేటికీ లేని అవగాహన, స్పష్టత, పట్టుదలతో పార్టీ నాయకత్వం అన్నింటిని అధిగమిస్తూ ఇంతవరకు ప్రయాణించి వచ్చింది. ఆ ప్రయాణం ప్రస్తుత తాత్కాలిక సమస్యను సైతం ఎదుర్కొని ముందుకు సాగ గలదనటంలో సందేహం ఉండనక్కరలేదు.
బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి లోక్‌సభలో అసలు ప్రాతినిధ్యమన్నదే లేకుండాపోవటం ఇది మొదటిసారి. ప్రాంతీయ పార్టీకి లోక్‌సభ ఎందుకనే వాదనలను ఇతర పార్టీలు లోగడ కూడా ముందుకు తీసుకువచ్చినప్పటికీ ప్రజలు ఆమోదించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు, తర్వాత కూడా పార్టీ అభ్యర్థులను మంచి మెజారిటీతో ఎన్నుకున్నారు. నిజానికి మన ఫెడరల్ వ్యవస్థలో ప్రాంతీయ పార్టీలు పార్లమెంటుకు గెలిచే సంప్రదాయం మొదటినుంచీ ఉంది. ఈ 2024 ఎన్నికలలోనూ తమిళనాడు నుంచి బెంగాల్ వరకు ఇది బలంగా కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏదో ఒక ప్రాంతీయ పార్టీయే గత రెండుసార్లూ గెలుపొందింది. దానిని బట్టి, ప్రజలకు పార్లమెంటు ఎన్నికలంటే జాతీయ పార్టీలకు సంబంధించిన విషయం మాత్రమేనని, ప్రాంతీయ పార్టీలకు వాటితో నిమిత్తం అక్కరలేదనే అభిప్రాయమేమీ లేదని అర్థమవుతున్నది.
అందువల్ల బీఆర్ఎస్ చేయవలసింది స్వయంగా తన అనుభవాలను, దేశంలోని ఇతర ఫెడరలిస్టు పార్టీల అనుభవాలను విశ్లేషించుకుని, రాగల కాలంలో ప్రజల్లోకి ఆ సందేశాన్ని ఏ విధంగా మరొకమారు తీసుకువెళ్లగలమనే ఆలోచన చేయటమే. గతం ఎట్లున్నా ఈసారి గల పరిస్థితులను బట్టి విజయావకాశాలు తక్కువన్న అవగాహన పార్టీ నాయకత్వానికి ముందే ఉండినట్లు ఈ నెల 2న జరిగిన పార్టీ కార్యక్రమంలో అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ప్రసంగంలో సూచనప్రాయంగా తెలిసింది. కొన్ని సర్వేలు 11 స్థానాలని, కొన్ని ఒకటిరెండని అంటున్నాయని, చివరికి ఏమి జరిగినా విచారించనక్కరలేదని, తెలంగాణకు నిజమైన రక్ష బీఆర్ఎస్ మాత్రమే అయినందున మనం మన పని చేసుకుంటూ పోవాలని పార్టీ శ్రేణులకు చెప్పారాయన. అది నిజమే కూడా.
ప్రజలు ఈసారి ఈ విధంగా ఎందుకు ఓటు వేసినా, పార్టీ ఎంపీలు మొదట ప్రత్యేక రాష్ట్ర సాధనకు, తర్వాత రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు ఇతర పార్టీలతో పోలికైనా లేనివిధంగా పార్లమెంటు స్థాయిలో సాగించిన కృషి ఏమిటో ప్రజలకు తెలియనిది కాదు. అది వారికి మునుముందు తిరిగి గుర్తురాకమానదు కూడా. ఎందుకంటే, జాతీయపార్టీలు అనబడేవి ఎప్పుడు కూడా వివిధ ప్రాంతాలు, రాష్ర్టాల ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేయలేదు, ఇకముందు చేయవు కూడా. వాటికి గల అటువంటి సెంట్రలిస్టు, యూనిటరిస్టు స్వభావం కారణంగానే దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడి వర్ధిల్లుతున్నాయి. కనుక బీఆర్ఎస్ రోజు మళ్లీ వచ్చి తీరుతుంది.
బీఆర్ఎస్కు ప్రస్తుతం లోకసభలో సభ్యత్వం లేకపోవచ్చు గాని రాజ్యసభలో ఉందన్న విషయం మరిచిపోకూడదు. వారు చేయగల కృషిని బట్టి ఒక ప్రాంతీయ పార్టీ పాత్ర ఏమిటో, ఏ పార్టీ నిజ స్వభావమేమిటో ప్రజలకు మునుముందు అవగతమవుతుంది. కనుక ఇందులో పాఠాలు నేర్చుకొనవలసిందే తప్ప కుంగిపోవలసిందేమీ ఉండదు. మరొకస్థాయిలో పార్టీ నాయకత్వం ఇప్పటికే వివరమైన సమీక్షలు జరిపి నిర్ణయాలు తీసుకున్నదానికి అనుగుణంగా గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరిపి, శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ముందుకుపోయిన పక్షంలో పార్టీలో క్రమంగా ఆత్మవిశ్వాసం పెరిగి, ఈ లోక్‌సభ ఓటమి నష్టాలు మానసికంగా తొలగిపోగలవు. ఆ విధంగా స్థానిక సంస్థల ఎన్నిలకు సిద్ధం కావలసి ఉంటుంది. బీఆర్ఎస్కు గత 24 ఏండ్లలో జయాపజయాలు, ఇతర ఒడిదుడుకులు కొత్త కాదు. ప్రజలలో గల మౌలిక ఆకాంక్షలు, ఇతర పార్టీలు మరి వేటికీ లేని అవగాహన, స్పష్టత, పట్టుదలతో పార్టీ నాయకత్వం అన్నింటిని అధిగమిస్తూ ఇంతవరకు ప్రయాణించి వచ్చింది. ఆ ప్రయాణం ప్రస్తుత తాత్కాలిక సమస్యను సైతం ఎదుర్కొని ముందుకు సాగ గలదనటంలో సందేహం ఉండనక్కరలేదు.
ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఇతర అంశాలకు వస్తే, రాష్ట్రంలోని 17 స్థానాలలో ఒకటి ఎప్పటి వలెనే మజ్లిస్ పార్టీ గెలవగా, తక్కిన 16ను కాంగ్రెస్, బీజేపీలు చెరి 8 చొప్పున గెలవటం గమనించదగిన పరిణామం. ఇరువురు కూడా తమకు రెండంకెల స్థానాలు రాగలవని చేసిన ప్రకటనలు నెరవేరకపోవటం అట్లుంచితే, ఇందులో ముఖ్యంగా కనిపించేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా కేవలం ఎనిమిది గెలవటం. 14 గెలిచి రాహుల్‌ను ప్రధాని చేయాలన్నది వట్టి ప్రచారంగా మిగిలిపోయింది.
తమకు రాష్ట్రంలో సరికొత్త పోటీదారుగా పలువురు భావిస్తున్న బీజేపీ బలం గతం కన్న రెట్టింపై తమతో సమాన స్థాయికి చేరింది. లోక్‌సభ ఎన్నికలలో మోదీ అఖండ విజయం సాధిస్తారని, అప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టగలమని ఇక్కడి బీజేపీ నేతలు చేసిన హెచ్చరికలు, జాతీయస్థాయిలో మోదీ బలహీనపడినందున నెరవేరకపోవచ్చుగాని, అయినప్పటికీ రాష్ట్రస్థాయిలో గణనీయంగా బలపడిన బీజేపీ, ఇక 2029లో రాష్ర్టాధికారం తమదేనంటూ అందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఆ ఒత్తిడి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై, రాష్ట్ర కాంగ్రెస్‌పై తప్పక ఉంటుంది.
హామీల అమలులో, సుపరిపాలనలో ప్రభుత్వం విఫలమయ్యే కొద్దీ ఒకవైపు బీఆర్ఎస్, మరొకవైపు బీజేపీల నుంచి ఒత్తిడి పెరుగుతూ పోగలదు. ఇందులో గమనించవలసిన మరొక ముఖ్య విషయం, కాంగ్రెస్‌తో పాటు బీజేపీకి కూడా పెద్ద మెజారిటీలు రావటం. మోదీ అనుకూల ఓటుతో పాటు, రేవంత్ పాలన పట్ల ఏర్పడిన నెగెటివ్ ఓటు బీఆర్ఎస్కు బదులు ఎక్కువగా బీజేపీకి మళ్లటం అందుకు ఒక కారణం. పోతే, రెండు పార్టీలు కూడా తమ బలమైన అభ్యర్థులను బీఆర్ఎస్ నుంచే తీసుకోవటం తెలిసిందే.
పోతే, బీఆర్ఎస్కు సంబంధించి ఈ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత జాగ్రత్తగా సమీక్షించవలసిన ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఒకటి, అభివృద్ధి, సంక్షేమాల నిర్వచనాలు, వాటి సమతులనాలు ఏమిటో తమ ఆలోచనలు తాము చేయటంతో పాటు ప్రజల దృక్కోణాలను కూడా తెలుసుకొని వ్యవహరించటం. చేసిన కృషిని ఆధునిక కమ్యూనికేషన్ల యుగానికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు, ప్రజలలోకి నిజమైన వారధిగా మార్చి రెండు వైపుల నుంచి కమ్యూనికేషన్లు సాగిస్తూ, అవసరాన్ని బట్టి సవరణలు చేసుకోవటం, మెరుగులు దిద్దుకోవటం. ఏ చిన్న సామాజిక వర్గాన్ని, ఆర్థికవర్గాన్ని, భౌగోళిక వర్గాన్ని, ఇతర వర్గాలను కూడా విస్మరించక అన్నింటి గురించి అధ్యయనాలు చేస్తూ, వాటిని తమ వెంట తీసుకువెళ్లేందుకు వినయపూర్వకంగా ప్రజాస్వామిక కృషి జరపటం. ఇందులో ఏది కూడా కొత్తగా చెప్తున్నది గాని, పార్టీ నాయకత్వానికి తెలియనిది గాని కాదు. కావలసింది ఆచరణ. ఎన్నికలతో నిమిత్తం లేని నిరంతర ఆచరణ. ఏ క్లిష్ట స్థితి కూడా పునరుజ్జీవనానికి అతీతమైనది కాదు.
టంకశాల అశోక్