తెలంగాణ పల్లెలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నగారాతో పాటే నయవంచక కాంగ్రెస్ సర్కారుపై పల్లెలు సమరశంఖం పూరించాయి. నమ్మించి నట్టేట ముంచిన హస్తం పార్టీని బొందపెట్టాలనే దండోరాలు ఊరూరా వినిపిస్తున్నాయి. దురహంకారానికి, దుర్మార్గ పాలనకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీని మట్టుపెట్టడానికి గ్రామాలన్నీ తమ వజ్రాయుధాలను (ఓట్లు) నూరుతున్నాయి. ఏ నోట విన్నా ఒక్కటే మాట వినిపిస్తున్నది. అదేమంటే, సకలజనులను గోస పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరి కట్టాలని. స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక పదేండ్లు ప్రతిపక్షంలోనే కూర్చున్న కాంగ్రెస్ పార్టీ ‘అధికార’మనే ఆకలితో నకనకలాడింది. ఆ ఆకలిని తీర్చుకునేందుకు గత అసెంబ్లీ ఎన్నికల వేళ దొంగ వాగ్దానాలెన్నో చేసింది.
మాయమాటలెన్నో చెప్పింది. ఆరు గ్యారెంటీల కార్డును గడప గడపకు పంచిపెట్టింది. తన నైజానికి సరిగ్గా సరిపోయేలా ‘420’ హామీలను తెలంగాణవ్యాప్తంగా గుమ్మరించింది. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు ప్రదర్శించి, ప్రజలను మాయజేసి, మర్మం జేసి అధికారంలోకి వచ్చింది. పదేండ్లపాటు అధికారానికి మొహం వాచిపోయిన హస్తం పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక.. ఓట్లేసి ఆదరించిన ప్రజల పట్ల భస్మాసుర హస్తంగా మారింది. కుంభకర్ణుడిలా తీరని ఆకలి మీదున్న కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కాక ప్రజలనే పీక్కుతినడం మొదలుపెట్టింది. పొలం, పుట్రా.. చెట్టు, చేమ.. పుట్ట, గుట్ట.. గొడ్డు, గోదా.. పిల్లా జెల్లా.. కొండ, కోన.. పల్లె, పట్నం.. చిన్నా పెద్దా.. అన్న తేడా లేకుండా దేన్నీ వదల్లేదు, ఎవర్నీ విడిచిపెట్టలేదు. ఉద్యోగులు-నిరుద్యోగులు, యువత-విద్యార్థులు, రైతులు-శ్రామికులు, ఆర్టీసీ కార్మికులు-ఆటోడ్రైవర్లు.. ఇలా ఏ వర్గమూ కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేదు.
ముఖ్యంగా రేవంత్ పాలనలో రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఇక పల్లెల కష్టాలు చెప్పనలవి కానివి. తాగునీళ్లు రావు, సాగునీళ్లు ఇవ్వరు. నీళ్లుంటే, ఎరువులుండవు. ఊళ్లల్లో కనీసం పండుగ పూట అయినా వీధి దీపాలకు దిక్కు లేదు. చెత్త తీసే పరిస్థితి అంతకన్నా లేదు. గ్రామ పంచాయతీల ఎన్నికల పంచాయితీ మధ్య ట్రాక్టర్లలో డీజిల్ పోసే నాథుడే కరువయ్యాడు. పింఛన్ పెంచలే, తులం బంగారం ఇవ్వలే, ఆడబిడ్డలకు రూ.2500 అసలే ఇవ్వలే. చివరికి గ్రామ పంచాయతీల్లో పెన్ను కూడా కొనలేని దుస్థితి. అందుకే ఎరువుల్లేక ఎర్రబడ్డ పంటలెక్క పల్లెలన్నీ ఎర్రబడ్డయి. కాంగ్రెస్ సర్కార్‌పై దండయాత్ర చేసేందుకు దండులా కదులుతున్నయి. ఇన్నాళ్లు అదను కోసం వేచి చూసినయి. ఇప్పుడా ముహూర్తం రానే వచ్చింది. కాంగ్రెస్ పార్టీని పీఠంపై కూర్చోబెట్టిన పల్లెలు నేడు ఆ పీఠాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు సిద్ధమయ్యాయి. సమరశంఖం పూరించాయి. ఇక విజయనాదం చేయడమే తరువాయి.
– చాడ సృజన్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు-యూకే