మధ్యభారత అటవీ ప్రాంతాలు 29 రకాల విలువైన ఖనిజాలకు, కోట్ల రూపాయల విలువైన సంపదకు పుట్టినిల్లుగా ఉన్నాయి. అది మన దేశ ప్రజలందరి సంపద. దానిపై ప్రభుత్వాలకే కాదు, అందరికీ అధికారం ఉంటుంది. కానీ, ప్రభుత్వాలు మాత్రం తమకు మాత్రమే అధికారం ఉన్నట్టు భావిస్తాయి. ఆదివాసీలకు దానిపై ఎంత హక్కు ఉంటుందో, అంతే హక్కు మనకూ ఉంటుంది. వారు పోరాడుతూ ప్రాణత్యాగం చేస్తున్నా, నాగరికత తెలిసినవారిగా మనం భయపడుతున్నాం.కానీ, ఇది సరికాదు, మనం ఆదివాసీల పక్షాన మాట్లాడుదాం. వారిపై జరుగుతున్న ‘ఆపరేషన్ కగార్’ను నిలువరించేందుకు మనవంతు బాధ్యత తీసుకుందాం.
ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక సంక్షోభాలకు పరిష్కారంగా మనలాంటి మూడవ ప్రపంచ దేశాల్లో ఉన్న విలువైన ఖనిజ సంపద సామ్రాజ్యవాదుల దృష్టిలో పడింది. సామ్రాజ్యవాదం అంటేనే పెట్టుబడిదారీ అత్యున్నత దశ. ఎంత ప్రజాస్వామిక దేశమైనప్పటికీ కంపెనీల ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా, దేశ అభివృద్ధిగా ప్రచారం చేస్తూ పాలకులు కీర్తిస్తున్నారు. వాస్తవం మాత్రం అది కాదు. మన వనరులను కంపెనీలు దోపిడీ చేయకుండా అవసరం మేరకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం వెలికితీస్తే ఆదివాసుల ప్రయోజనాలకు, జీవితాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉంటుంది. కానీ, ప్రభుత్వాలు మాత్రం ఆయుధాలతో ఆదివాసులను అణచివేస్తున్నాయి. అందుకే రెండు దశాబ్దాలుగా వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి వనరులను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి మావోయిస్టులు అండగా నిలబడుతున్నారు. దీంతో నిరాయుధ ఆదివాసీలపై 2005 నుంచి పరోక్షంగా, 2024 నుంచి ‘ఆపరేషన్ కగార్’ పేరుతో శత్రుదేశంతో పోరాడినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నది.
కగార్ కారణంగా ఆదివాసీ గ్రామాలన్నీ పోలీసు క్యాంపులుగా మారిపోయాయి. 14 వేల నుంచి 20 వేల పారామిలటరీ బలగాలు చుట్టుముడుతున్నాయి. 2024, జనవరి నుంచి మొదలైన ఈ ఆపరేషన్‌లో ఆరేండ్ల పాప మొదలుకొని 60 ఏండ్ల వృద్ధులను సైతం విడిచిపెట్టడం లేదు. ప్రభుత్వం మాత్రం నక్సలైట్ల నుం చి గ్రామస్థులను కాపాడుతున్నామని, వారి అభివృద్ధికి, వారి భద్రతకు కృషి చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. అయితే, ప్రభుత్వం వెనుక బడా కంపెనీలు ఉన్నాయన్న ఎత్తుగడను అర్థం చేసుకున్న ఆదివాసీలు మూడేండ్లుగా క్యాంపులకు వ్యతిరేకంగా తమ హక్కుల కోసం గాంధేయ పద్ధతిలో18 చోట్ల ఆందోళన తెలుపుతున్నారు. చివరికి ఇలాంటి శాంతి పోరాటాలపైనా కాల్పులు జరిపి (సిలింగేర్) నలుగురిని హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా ప్రచారం చేసిన ఘనత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానిది. చివరికి ఆరు నెలల పాప మంగ్లా హత్యను కూడా వక్రీకరించారు. గతంలో ఆదివాసీ హక్కుల కార్యకర్త, టీచర్ సోనిసోరి భర్తను అక్రమ కేసుల్లో ఇరికించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో స్టేషన్లోనే చనిపోయాడు.
ఆదివాసీ ఉద్యమాలను అణచివేతతో నిలవరించలేమనే కదా.. కొమురంభీం పోరాట కాలంలో నిజాం ప్రభుత్వం ‘హైమన్‌డార్ఫ్’తో ఒక సామాజిక శాస్త్రవేత్తను ఆదివాసీ జీవితాలపై పరిశోధన చేయించి వారి హక్కులను కాపాడే ప్రయత్నం చేసింది. కానీ నిజాం పాలనను పూర్తిగా వ్యతిరేకించే బీజేపీ ప్రభుత్వం తాను చేస్తున్నదేమిటి? ఒకవైపు మతోన్మాద హింస, మరొకవైపు బడా కంపెనీల కోసం ఆదివాసీల హననం. ఇది కచ్చితంగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు కొనసాగించే అణచివేత పాలనే తప్ప ప్రజాస్వామిక పరిపాలన కాదు. బస్తర్ జిల్లాలో ప్రస్తుతం 300 క్యాంపులు పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఆరులేన్ల రహదారిని నిర్మించడం వెనకున్న కారణం మైనింగే తప్ప.. ఆదివాసీల అభివృద్ధి కాదు. ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం పొందాలంటే రాజ్యాంగ హక్కులను సక్రమంగా అమలు చేస్తే చాలు. అలా కాకుండా ముందుకెళ్తే దేశంలోని విలువైన సహజ వనరులు బడా కంపెనీల చేతుల్లోకి వెళ్తాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కగార్ హత్యాకాండలో, క్యాంపులు నెలకొల్పడంలో భాగం కావొద్దని, ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన చేయాలని కోరుతున్నాం. ఆదివాసుల హననానికి, ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా గొంతెత్తడానికి ప్రజలందరూ కలిసి రావాల్సిందిగా పౌరహక్కుల సంఘం పిలుపునిస్తున్నది.
(వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి, పౌరహక్కుల సంఘం)
-ఎన్.నారాయణరావు