నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఆద్యుడు, ఇంజినీరింగ్ లోకానికి పూజ్యుడు. యావత్ భారతదేశం గర్వించదగిన ఇంజినీర్ దిగ్గజాల్లో ఆయన కూడా ఒకరు. సర్ ఆర్థర్ కాటన్, కేఎల్ రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి దిగ్గజాల సరసన నిలిచిన గొప్ప ఇంజినీర్ మన తెలంగాణలో పుట్టడం మనకు గర్వకారణం.
సాగునీటి రంగ పితామహుడిగా పేరుగాంచిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మీర్ వాయిజ్ అలీ దంపతులకు 1877, జూలై 11న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు మీర్ మహ్మద్ అలీ. అయితే, వివిధ ప్రాజెక్టుల ఆయన చూపిన అసాధారణ ప్రతిభను మెచ్చుకున్న నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ అతనికి అలీ నవాజ్‌జంగ్ బిరుదుతో సత్కరించారు. అప్పటినుంచి ఆయన పేరు నవాజ్ జంగ్గా స్థిరపడిపోయింది.
అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో అలీ నవాజ్ జంగ్ ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. అనంతరం నిజాం కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించారు. 1896లో ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో ఇంగ్లండ్‌లోని ప్రఖ్యా త కూపర్ హిల్ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. 1899లో చదువు పూర్తిచేసుకున్న ఆయన హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. అదే ఏడాది పీడబ్ల్యూడీ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన అనతికాలంలోనే దేశం గర్వించదగిన ఇంజినీర్లలో ఒకరిగా ఎదిగారు. 30 ఏండ్ల తన ఉద్యోగ ప్రస్థానంలో హైదరాబాద్, గుల్బర్గా, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఆయన ఎంతగానో కృషిచేశారు.
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, పోచారం, నిజాంసాగర్, వైరా, పాలేరు, కడెం లాంటి అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అంతేకాదు, మూసీ, చంద్రసాగర్, రాజోలిబండ, పోచంపాడ్, నందికొండ, సరళా సాగర్, భీమా, దేవనూర్, పెన్‌గంగా, ఇచ్చంపల్లి, లోయర్ మానేర్, పూర్ణా (మహారాష్ట్ర) లాంటి అనేక ప్రాజెక్టులను ప్రతిపాదించారు.
నవాజ్ అలీ జంగ్ బహదూర్ హైదరాబాద్ నగర రూపశిల్పిగా పేరొందారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి పాటుపడ్డారు. తద్వారా ఆ కాలంలోనే అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ కలిగిన నగరంగా హైదరాబాద్‌కు ప్రపంచఖ్యాతి తీసుకొచ్చారు. తన అమోఘమైన ప్రతిభకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించిన అలీ నవాజ్ జంగ్ అనేక సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, వంతెనలు, భవనాలను నిర్మించారు. హైదరాబాద్ నగరానికి దుఃఖదాయినిగా మారిన మూసీ వరదలను నియంత్రించి, ఎంతోమంది ప్రాణాలను, కోట్ల రూపాయల ఆస్తులను కాపాడిన మహనీయుడు అలీ నవాజ్ జంగ్.
1908లో వచ్చిన మూసీ వరదలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయి. ఆ వరదల్లో చాలామంది మరణించారు. దీంతో అప్పటి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ భవిష్యత్తులో వరదలు రాకుండా నియంత్రించే బాధ్యతను ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. ఆయన తన సహాయకుడిగా అలీ నవాజ్ జంగ్‌ను నియమించుకున్నారు. వారిద్దరూ తమ ప్రతిభతో హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను నిర్మించారు. నాడు వరద నియంత్రణ కోసం నిర్మించిన జంట జలాశయాలే ఇప్పటికీ హైదరాబాద్ మహా నగరానికి తాగునీటిని అందిస్తున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రణాళికా సంఘం సభ్యుడిగా కూడా సేవలందించిన అలీని ఉమ్మడి పాలకులు తీవ్ర నిర్ల క్ష్యం చేశారు. అయితే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో ఇంజినీర్స్ డే రోజున మోక్షగుం డం విశ్వేశ్వరయ్యతో పాటు అలీని స్మరించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రా ంతం కోసం అహర్నిశలు శ్రమించిన ఆయన సేవలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపైనే ఉన్నది.
-తాళ్లపల్లి యాదగిరిగౌడ్
99497 89939