అరువై ఏండ్ల ప్రజా ఆకాంక్షలకు, వందలాది మంది యువకుల ఆత్మ బలిదానాలకు ప్రతిఫలమే తెలంగాణ. దశాబ్ద కాలానికి పైగా అలుపెరుగని పోరాటం చేసి, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరి సలపకుండా రాజకీయంగా ఉద్యమం చేసిన కేసీఆర్ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. ఇది ఎవ్వరూ కాదనలేని చారిత్రక సత్యం.
Telangana | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర సహకారం కొరవడటం, రాష్ట్రంలో విద్యుత్తు కొరత, సాగు, తాగునీటి సమస్య, క్రాప్ హాలీడేలు, ఏపీ-తెలంగాణ పంపకాలు.. ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ పదేండ్లలోనే అనేక సవాళ్లను ఎదుర్కొని వ్యూహాత్మకంగా, ప్రాధాన్యక్రమంలో సమస్యలకు శాశ్వ త పరిష్కారం చూపుతూ పునర్నిర్మాణం దిశగా సాగుతూ తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపించా రు. కేంద్ర గణాంకాల సాక్షిగా సంక్షేమంలో, అభివృద్ధిలో దేశానికే స్ఫూర్తినిచ్చేలా ముందుకు సాగించారు. తలసరి రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలవడమే అందుకు నిదర్శనం.
కానీ, దురదృష్టం కొద్దీ ప్రజాపాలన పేరిట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల్లోనే తన అసమర్థ పాలనతో రాష్ర్టాన్ని 20 ఏండ్లు వెనక్కినెట్టింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న కడగండ్లను మళ్లోసారి తెలంగాణ ప్రజల కండ్లముందు ఉంచింది. తెలంగాణకు వెన్నెముక లాంటి హైదరాబాద్‌ను గత పదేండ్లలో విశ్వనగరంగా అభివృద్ధి చేసుకున్నాం. అనేక సం స్కరణలను తీసుకొచ్చాం. కరోనా కాలాన్ని సైతం లెక్కజేయకుండా కోట్ల రూపాయల పెట్టుబడులు వరదలా వచ్చిపడ్డాయి. అనేక అంతర్జాతీయ సం స్థలు తమ వ్యాపార విస్తరణ కోసం హైదరాబాద్‌ను 2వ గమ్యస్థానం గా ఎంచుకున్నాయి.
కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కొత్త పెట్టుబడుల మాట పక్కనపెడితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్థలు కూడా పక్క రాష్ర్టాలకు పారిపోతున్నాయి. కేన్స్ టెక్నాలజీ సంస్థ ఇప్ప టికే గుజరాత్‌కు వెళ్లిపోయింది. కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించింది. అమర రాజా కంపెనీ తరలిపోయేందుకు సిద్ధమవుతు న్నది. ఈ పరిస్థితి పోవాలంటే పెట్టుబడుల విషయంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం తమ వైఖరి ఏమిటో విధానపరంగా తెలియజేయా లి. కనీసం గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్ర పురోగతి కుంటుపడుతుంది.
గత పదేండ్లలో అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడ్డ తెలంగాణ ఇప్పుడు పక్క రాష్ట్రంతో పోటీపడుతామని చెప్పే దుస్థితి ఏర్పడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే తెలంగాణ ఇప్పుడు కనీ సం టాప్ 10లో కూడా చోటు సంపాదించుకోలేకపోతున్నది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ అప్పుల కుప్పయిందని చెప్తుండటం హేయనీయం. ఆయన వ్యాఖ్యలు రాష్ర్టానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. గత ప్రభుత్వం సాధించిన ప్రగతిని తొక్కిపెట్టి రాష్ట్రం దివాళా తీసిందని దివాళాకోరు రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు? ఇది రాష్ట్ర ప్రజలనే కాదు, రాష్ట్ర పురోగమనాన్ని కూడా తప్పుదోవ పట్టించడమే.
రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, మహాలక్ష్మి అమ లు వంటి అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం మీద నింద లు వేస్తున్నది. బట్టకాల్చి మీద వేసే ఇలాంటి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలి. ప్రజల దృష్టిని మరల్చే ఇలాంటి పనులకు బదులు ఒక సంస్థనైనా తీసుకురావాలి.
అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు, పాలకులు చేసిన అభివృద్ధి పనులు శాశ్వతంగా ఉండిపోతాయి. ప్రజలు కాంగ్రెస్‌కు పాలనాపగ్గాలు అప్పగించింది గత పాలకుల స్మృతులను చెరిపివేయడం కోసం కాదు, వీలైతే తెలంగాణ ప్రజల కోసం మరిన్ని మంచి పనులు చేయమని. కక్షసాధింపు రాజకీయాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి రాజకీయాలకు స్వస్తిపలికి గత పదేండ్ల తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని కొనసాగించండి. తెలంగాణ ప్రజలకు ఒక భరోసాను కల్పించండి. మీ నుంచి తెలంగాణ సమాజం ఆశిస్తున్నది ఇదే. ఇంతకుమించి ఇంకేం కాదు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
డాక్టర్
కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి