సోన్, అక్టోబర్ 17: మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక స్వాలంబనే లక్ష్యంగా గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా అమలు చేస్తున్న ‘స్త్రీనిధి’ చేయూతనిస్తున్నది. మహిళలు సైతం స్వశక్తితో ఎదిగేలా ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నది. తమ కాళ్లపై తాము నిలబడి, కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేలా స్వల్ప వడ్డీతో అధిక ప్రయోజనం కలిగిస్తున్నది. నిర్మల్ మండలంలోని పలు స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళల ఆర్థిక విజయంపై ప్రత్యేక కథనం..
స్త్రీనిధి ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు తీసుకుంటున్న మహిళలు.. గ్రామీణ ప్రాంతంలో కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టుకొని ఆర్థిక స్వాలంబన సాధిస్తున్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. నిర్మల్ మండలంలోని మొత్తం 28 గ్రామ సంఘాలకు స్త్రీనిధి ద్వారా ఈ ఏడాది రుణ ప్రణాళికకుగాను రూ.582.73కోట్లు అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. కాగా, ఇప్పటివరకు రూ.371.93 కోట్ల రుణాలు (64శాతం) అందించారు. నిర్మల్ మండలంలోని అనంతపేట్, భాగ్యనగర్, మేడిపెల్లి, ఎల్లపెల్లి, ఎల్లారెడ్డిపేట్, చిట్యాల్, కౌట్ల(కే), ముజ్గి, తాంశ, డ్యాంగాపూర్, తల్వేద, లంగ్డాపూర్, అక్కాపూర్, రాణాపూర్, ముఠాపూర్, రత్నాపూర్‌కాండ్లీ, కొండాపూర్, న్యూపోచంపాడ్, వెంగ్వాపేట్ తదితర గ్రామాల్లో 28 మహిళా సంఘాలకు రుణాలను అందించారు.
రుణాలతో ఆర్థిక ప్రయోజనం..
స్త్రీనిధి ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను అందించడంతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాలకు బ్యాం క్ లింకేజీ ద్వారా ప్రభుత్వం రుణాలు అందించింది. కాగా, వాటిని సక్రమంగా వినియోగించుకొని సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించడం, రికార్డులను నిర్వహించడం వల్ల మహిళా సంఘాలకు బ్యాంకులు ఎన్ని రుణాలైనా ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఈ స్త్రీనిధి ద్వారా వారు కోరుకున్న ప్రదేశంలోనే వ్యాపార విస్తరణకు రుణాలు అందిస్తున్నారు. మహిళలు బ్యూటీపార్లర్లు, కిరాణా దుకాణాలు, వాటర్ ప్లాంట్లు, కుటీర పరిశ్రమలు, ఇస్తార్ల తయారీ, పిండి గిర్ని, జిరాక్స్ సెంటర్లు, బట్టల షాపులు, టైలరింగ్, కుట్టు మిషన్, తదితర వాటిలో ఎంపిక చేసుకొని ఉపాధి పొందుతున్నారు.
వాటర్ప్లాంట్తో ఉపాధి..
స్త్రీనిధి రుణం ద్వారా వాటర్‌ప్లాంట్ పెట్టాను. గ్రామంలో వాటర్‌ప్లాంట్ నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో ఉన్నప్పుడు రుణం ఎక్కడ లభిస్తుందోనని ఆలోచించాను. ఆ సమయంలో స్త్రీనిధి బ్యాంకు వారు స్వయం ఉపాధి మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నారని తెలిసి దరఖాస్తు చేసుకున్నా. తక్కువ వడ్డీకే రుణం మంజూరైంది. దీంతో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నా. ఇప్పుడు దీనిద్వారా నేను ఆదాయంతో పాటు ఉపాధి పొందుతున్నా. నెలనెలా వాయిదా పద్ధతిలో సక్రమంగా చెల్లిస్తూ సంతోషంగా ఉన్నా.
– శకుంతల, భాగ్యనగర్, నిర్మల్ మండలం
బ్యూటీ పార్లర్‌తో ఉపాధి..
మాది నిర్మల్ మండలంలోని చిట్యాల్ గ్రామం. నిర్మల్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ్యూటీపార్లర్, కుట్టు మిషన్ శిక్షణ లేకపోవడంతో మా ఊరి వారంతా నిర్మల్‌కు వెళ్లి, ఈ సదుపాయం పొందేవారు. మా గ్రామంలోనే ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో మొదట బ్యూటీషియన్ కోర్సు నేర్చుకొని స్త్రీనిధి రుణం ద్వారా బ్యూటీపార్లర్‌తో పాటు కుట్టు శిక్షణ, బ్యాంగిల్స్ స్టోర్ వంటి వాటిని ఏర్పాటు చేశా. నెలకు రూ.25వేల వరకు ఆదాయం వస్తున్నది. అందులో ఖర్చులు రూ.10వేలు పోను నెలకు రూ.15 వేల వరకు మిగులుతుండడంతో మా కుటుంబానికి అవసరానికి ఉపయోగపడుతున్నాయి. – శ్రీలేఖ, చిట్యాల్, నిర్మల్ మండలం
సద్వినియోగం చేసుకోవాలి..
నిర్మల్ మండలంలో ఇప్పటివరకు 3,472 మంది సభ్యులకు రుణాలను మంజూరు చేశాం. ఇంకా కొత్తగా ఏర్పడిన గ్రూపులకు సైతం మరిన్ని రుణాలు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. వీటిని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి. స్త్రీనిధి రుణాలను స్వల్ప వడ్డీకే అందిస్తున్నాం. మహిళలకు భారం లేకుండా నెలసరి వాయిదాలను చెల్లించవచ్చు. – ఎండీ రియాజ్, స్త్రీనిధి మహిళా బ్యాంక్ మేనేజర్