గ్లోబల్ ైక్లెమేట్ రిస్క్ ఇండెస్క్ 2021 ప్రకారం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రభావితమయ్యే మొదటి 10 దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2100 నాటికి భారత్ తన జీడీపీలో 3-10 శాతం వరకు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, వాతావరణ మార్పుల కారణంగా 2040 నాటికి భారత పేదరిక సూచీ 3.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ‘ది కాస్ట్స్ ఆఫ్ ైక్లెమేట్ ఛేంజ్ ఇన్ ఇండియా’ పేరిట వాతావరణ సంబంధిత నష్టాలు, అసమానత, పేదరికం పెరిగే అవకాశం తదితర అంశాలపై లండన్‌కు చెందిన ఓవర్సీస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయన నివేదికను 2021 జూన్‌లో వెలువరించింది. అయితే ఈ విపత్కర పరిస్థితులకు కారణం సంపన్న కుటుంబాలే కావడం గమనార్హం.
Global Warming | గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు ప్రధానంగా కారణమవుతున్న సంపన్న కుటుంబాల జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చి ఉద్గారాలను తగ్గించవచ్చు. అదే సమయంలో, సమాజంలోని పేద, అణగారినవర్గాలను ఆదుకోవడం ద్వారా వాతావరణ మార్పుల పర్యవసానాల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు ప్రయత్నించవచ్చు. అయితే వీటిని చేపట్టేటప్పుడు యావత్ సమాజాన్ని కలుపుకొని వెళ్లాలి.
రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమనిటీ అండ్ నేచర్ అధ్యయనం ప్రకారం.. మన దేశంలో పేద కుటుంబాలతో పోలిస్తే 20 శాతం సంపన్న కుటుంబాలు, ఏడు రెట్లు అధిక కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. రోజుకు 1.9 డాలర్ల కంటే తక్కువ ఖర్చు చేసే కుటుంబాలను ఇందుకు ఎంచుకున్నారు. మన దేశంలోని ప్రతి వ్యక్తి ఏడాదికి విడుదల చేసే సగటు కార్బన్ ఉద్గారాలు 0.56 టన్నులు. ఇందులో పేద ప్రజల తలసరి 0.19 టన్ను కాగా.. సంపన్నుల్లో 1.32 టన్నులుగా ఉంది. 2013లో నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్వో) నుంచి ఇండియా స్పెండ్ సేకరించిన డాటా ప్రకారం.. ఆహారం, విద్యుత్తు వాడకం ఇందుకు ప్రధాన కారకాలు. సామాజిక, ఆర్థిక సమూహాల్లో ఎక్కువ ఉద్గారాలకు ఇవే కారణం. సొంత వాహనాలు కలిగి ఉండటం, తృణధాన్యాలు కానటువంటి ఆహారం తదితర అంశాలు సంపన్న కుటుంబాలు ఎక్కువ ఉద్గారాలను విడుదల చేయడానికి కారకాలని ఈ అధ్యయనం తేల్చింది.
ఒకవైపు ఆధునిక సాంకేతికత, సేవలతో అభివృద్ధి చెందుతున్న సమాజానికి.. మరోవైపు పేదరికం, పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలు, సామాజిక బహిష్కరణ, వనరుల క్షీణతల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమాజానికి దారితీసే గణనీయమైన ఆర్థిక వృద్ధికి మధ్య వైరుధ్యం మన సమాజంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. వివిధ సామాజిక సమూహాల మధ్య జీవన శైలి భావనలు కూడా విభిన్నంగా పుట్టుకొస్తున్నాయి. అంటే, వాతావరణ మార్పుల పట్ల అవగాహన, అవసరమైన చర్యలు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ వాస్తవాన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి.
ప్రస్తుతం మన తెలంగాణలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలు వరద ప్రభావిత జిల్లాలుగా గుర్తించారు. 1 డిగ్రీ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఈ విపరీత పరిణామాలు జరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల సంభవంచే వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా అతిభారీ వర్షాలు, వరదలు, తుఫానులకు కారణమవుతున్నది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల జీవితాలు అతలాకుతలమవడంతో పాటు జీవనోపాధి, ఆస్తులకు నష్టం జరుగుతున్నది. ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోకుండా లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేదలు వీటివల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.
ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల 29 మంది చనిపోయినట్టు తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. అంతేకాదు, రూ.5,400 కోట్ల విలువైన ఆస్తుల నష్టం కూడా జరిగినట్టు వెల్లడించింది. ప్రైవేట్, సామాజిక ఆస్తులకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది. కానీ, వాటిని ఇందులో చేర్చలేదు.
ముఖ్యంగా శిలాజ ఇంధనాల వినియోగం వల్ల వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. ఈ వాతావరణ మార్పుల కారణంగా సంభవించే ప్రమాదాల దృష్ట్యా శక్తి వినియోగంలో ప్రాథమిక మార్పు అత్యవసరం. ఇది తక్కువ ఉద్గార సమాజానికి దారితీస్తుంది.
శక్తి, ఆహార ఉత్పత్తి, మొబిలిటీ, గృహ ఇంధన వినియోగం తదితర అంశాల్లో భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. సహేతుకమైన పరిష్కారం కోసం సాంకేతిక చర్యలు, విధానపరమైన సాధనాలు కచ్చితంగా అవసరం. నిబంధనలు, నియమాలు, చర్యలు, సర్దుబాట్లు అనేవి రాజకీయ, పరిపాలనా వ్యవస్థల్లోనే కాదు, సమాజంలో, కుటుంబాల్లో కూడా ఏకకాలంలో జరగాలి.
మరో మాటలో చెప్పాలంటే.. ఈ సవాళ్లను ఎదుర్కొని స్థిరత్వం వైపు పయనించేందుకు మనకు కావలసింది విధానాలు, సాంకేతికత, జీవనశైలి, పౌర సమాజంతో పాటు వ్యవస్థలో మార్పు. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు ప్రధానంగా కారణమవుతున్న సంపన్న కుటుంబాల జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చి ఉద్గారాలను తగ్గించవచ్చు. అదే సమయంలో, సమాజంలోని పేద, అణగారినవర్గాలను ఆదుకోవడం ద్వారా వాతావరణ మార్పుల పర్యవసానాల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు ప్రయత్నించవచ్చు. అయితే వీటిని చేపట్టేటప్పుడు యావత్ సమాజాన్ని కలుపుకొని వెళ్లాలి. సంపన్నులతో పోలిస్తే తమ ప్రమేయం తక్కువగా ఉన్నప్పటికీ గ్లోబల్ వార్మింగ్ సామాన్యులను ఎక్కువగా బాధిస్తున్నది. అందువల్ల ఈ చర్యల పర్యవసానాలు భిన్నంగా ఉంటాయి.
ఏదేమైనప్పటికీ, ఈ వ్యూహాలు సమాజంలోని వివిధ వర్గాలకు ఆకర్షణీయమైన మంచి జీవితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా చేపడితే మాత్రం అవి చాలావరకు విఫలమవుతాయి. అయితే దీనికి ప్రజల నుంచి రాజకీయ మద్దతు లేకపోవడం మరో ప్రతికూలాంశం. బహుశా మన ముందున్న అతిపెద్ద సవాలు ఇదే!
(వ్యాసకర్త: మాజీ ఎమ్మెల్యే, వ్యవసాయ, వాతావరణ నిపుణుడు)
చెన్నమనేని రమేశ్