డిటెన్షన్ విధానం అంటే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన, సమానమైన విద్య అందించడంలో భాగమేనా? ఒక్కసారి ఆలోచించాలి. 2009 విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ కేంద్రం ఇప్పటివరకు అమలులో ఉన్న నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ, 5, 8 తరగతుల్లో విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని తీసుకువచ్చింది. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 16 ప్రకారం బడిలో ప్రవేశం పొందిన బాలలను ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు బడి నుంచి తొలగించకూడదు. సెక్షన్ 30 ప్రకారం ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేవరకు పిల్లలు బోర్డు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు.
నో డిటెన్షన్: 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులను ఫెయిల్ చేయడం కానీ, స్కూల్ నుంచి బహిష్కరించడం కానీ చేయకూడదు. ఇదే ఇప్పటివరకు కొనసాగుతున్న నో డిటెన్షన్ విధానం. విద్యార్థులు ఒకటి నుంచి 8వ తరగతి వరకు పూర్తి చేసుకునే వరకు ఆటోమెటిక్‌గా పై తరగతులకు ప్రమోట్ అవుతారు. వీరికి పరీక్షలు నిర్వహించినప్పటికీ గ్రేడ్స్ ఇచ్చి పై తరగతులకు ప్రమోట్ చేస్తారు. ఎవరినీ ఫెయిల్ చేయరు. అదే నో డిటెన్షన్ పాలసీ. కానీ ప్రస్తుతం దీనిని రద్దు చేయడం వల్ల 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి. వారు ఉత్తీర్ణులు కాకుంటే తిరిగి రెండు నెలల్లో పరీక్షలు నిర్వహించాలి. అప్పుడు ఉత్తీర్ణులు అయితేనే పై తరగతికి ప్రమోట్ అవుతారు. కాకుంటే వారు అదే తరగతులు తిరిగి చదవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సైనిక పాఠశాలలతో కలిపి దేశవ్యాప్తంగా 3 వేల విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిటెన్షన్ విధానం అమల్లోకి రానున్నది. దీనిని తిరోగమన చర్యగా చెప్పొచ్చు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు బడికి దూరమయ్యే ప్రమాదం ఉన్నది. తిరిగి అదే తరగతి చదవాల్సి రావడం వల్ల వారిలో న్యూనతాభావం ఏర్పడే అవకాశం ఉన్నది. బాల కార్మికులు పెరిగే ప్రమాదం ఉన్నది.
పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టాలి. విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకురావాలి. పరీక్ష విధానంలో సంస్కరణలు తీసుకురావాలి. నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించాలి. విద్యార్థులకు మౌలిక వసతులు, అభ్యసనకు అనువైన ఆహ్లాదకర వాతావరణం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు, తరగతి గదులు, కనీస సౌకర్యాలు కల్పించడానికి కృషి చేయాలి. పాఠశాల విద్య రాష్ర్ట జాబితాలోని అంశం కాబట్టి నోడిటెన్షన్ విధానాన్ని రద్దు చేసే విషయంలో ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. నో డిటెన్షన్ విధానం రద్దు చేయడం అంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయడమే. ఈ విధానంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
-నామాల ఆజాద్
9000301621