గుండె నిండా ఆత్మవిశ్వాసం, గురిపెట్టిన బాణాల్లాంటి చూపులు, మంత్రముగ్ధుల్ని చేసే మాటలు, మాట ఇస్తే తప్పని కమిట్మెంట్, కమిటైతే కాలాన్ని ధిక్కరించి, కల్లోలాన్ని అధిగమించి గమ్యాన్ని చేరే సాహసం, ఎత్తుగడల్లో కొత్త పోకడలు, మేధస్సులో మేరుశిఖరం, హృదయం కరుణ రసామృతం, నిత్య అధ్యయనశీలి, ఉద్యమ ధీశాలి… వీటన్నింటి మేలు కలయికతో మూర్తీభవించిన మానవతామూర్తి కేసీఆర్.
ప్రపంచ ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమం ప్రత్యేకమైనది. ప్రజాభీష్టం, మద్దతు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఉద్యమం న్యాయబద్ధమైనప్పటికీ, ఉద్యమానికి అనేక అవరోధాలు ఉన్న సందర్భంలో, ఉద్యమ నాయకత్వం వహించిన కేసీఆర్‌ది ఒక విలక్షణమైన, ధీరోదాత్తమైన వ్యక్తిత్వం కావడం వల్లనే అంత్యదశ వరకు కొనసాగిన కుట్రలను అంతమొందించి ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చగలిగారు. లౌల్యానికి లొంగేవాడైనా, భయపడి పారిపోయేవాడైనా ఉద్యమం మధ్యనే పుట్టి మునిగిపోయేది. నాయకత్వం స్థానంలో ఉన్న వ్యక్తి సామర్థ్యం, వ్యక్తిత్వం, సాహసమే జయాపజయాలను నిర్ణయించడం అనేక ఉద్యమాల్లో చూశాం. లెక్కలేనన్ని ఒడిదొడుకుల్ని దాటుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆయన ఎత్తుగడలు, పోరాటపటిమ, సంచలనాత్మక నిర్ణయాలు వెరసి ఒక పరిణత రాజకీయ చతురత కీలకంగా పనిచేసిందని చెప్పవచ్చు.
కేసీఆర్ నిరంతర ఆశావాది. నిరాశను కలలో కూడా దరిచేరనీయరు. తన అనుచరుల్లో కూడా నిరంతరం ఆశావహ దృక్పథాన్ని నింపుతూ భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలిగిస్తూ ప్రేరణ అందిస్తుంటారు. పిల్లలను కాపాడుకొనే తల్లి కోడి వలె తన క్యాడర్‌ను కాపాడుకుంటారు. డబ్బు సంపాదించడానికైతే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని, అందుకు అనేక ఇతర మార్గాలున్నాయని, ప్రజాప్రతినిధిగా జనంచేత ఎన్నుకోబడి, సేవ చేసే భాగ్యాన్ని పొందడం గొప్ప అదృష్టమని తన క్యాడర్లో నైతికతను ప్రబోధించడం, నాయకుడిగా కేసీఆర్‌లో ఉన్న కొత్త కోణం!
కేసీఆర్ గొప్ప వ్యూహకర్త. ఉద్యమం ముగిసి రాష్ట్రాన్ని సాధించుకున్న వెంటనే తమ పార్టీ ఉద్యమ నేపథ్యం స్థానంలో ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుందని ప్రకటించిన సాహసి. తాను సాధించిన తెలంగాణను, తన కలలకు అనుగుణంగా బంగారు తెలంగాణగా రూపొందించాలంటే రాజకీయంగా బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. రాజకీయ సుస్థిరత లేకుండా, రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని భావించారు. అందుకు శత్రువును చావుదెబ్బ కొట్టే వ్యూహాలతో ఇతర క్యాడర్‌ను పార్టీలోకి ఆహ్వానించడం, తన విధానం అమలుకు కావలసిన సంపూర్ణ మద్దతు కోసం సంఖ్యాబలాన్ని పెంచుకోవడం సమకాలీన రాజకీయ నిర్ణయాలకు దర్పణం పడుతుంది.
తెలంగాణ సుస్థిరతకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న చంద్రబాబు, అతని అనుచర వలసవాద తొత్తుల కుట్రలను గమనించిన పిదపనే కేసీఆర్ ఈ గడ్డపై ఇంకా ఆంధ్రా పార్టీల అవసరం ఉందా? అని ప్రశ్నిస్తూ, శత్రు శేషం లేకుండా చేయడమే తన లక్ష్యంగా బహిరంగ యుద్ధాన్ని ప్రకటించారు. ఇది కొందరు మేధావులని చెప్పుకొనేవారికి నచ్చకపోవచ్చు. ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించవచ్చు. కానీ, చైనాలో విప్లవం విజయవంతమైన పిదప, బలమైన చైనాగా రూపొందించడానికి విప్లవానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని సైతం తమతో చేర్చుకున్నారు మావో. మేధావులు విమర్శించినా, ఆ నిర్ణయం సఫలమై అజేయమైన శక్తిగా చైనా ఆవిష్కృతమైంది. తెలంగాణ కూడా కొత్తగా ఊపిరి పోసుకున్న రాష్ట్రంగా, బాలారిష్టాలను ఎదుర్కొనే బేలగా కాకుండా, భారతదేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా నిలపాలన్న ఆకాంక్షతో పార్టీని బలోపేతం చేశారు కేసీఆర్. అందుకోసం కలిసివచ్చే రాజకీయ శక్తులను కలుపుకొంటూ, కలిసిరాని తెలంగాణ వ్యతిరేక శక్తులను ఏకాకులను చేస్తూ సాగిపోయారు.
అభివృద్ధి కాముకుడు కేసీఆర్. ఆయన అభివృద్ధి నమూనాలు సోషలిస్టిక్ అప్రోచ్‌తో కూడుకున్నవి. సామాజిక అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఆయన స్వయంగా రూపకల్పన చేసి, ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రత్యేక ఇండస్ట్రియల్ పాలసీ, నిరంతరాయ విద్యుత్తు, కేజీ టు పీజీ గురుకులాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, పింఛన్ల పెంపు, బీడీ కార్మికుల పింఛన్లు లాంటి పథకాలు, మెడికల్ కళాశాలలు, కాళేశ్వరం లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు.. విధ్వంసమైన తెలంగాణను విముక్తి వైపు పరుగులు తీయించాయి.
కేసీఆర్‌లో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే.. ఎవరు ఆయన వద్దకు వచ్చినా ఆత్మీయంగా రిసీవ్ చేసుకోవడం, వారు చెప్పిన విషయాలు ఓపికగా వినడం, దానిలో ఉపయోగకరమైన విషయం ఏమున్నా గొప్పగా ప్రశంసిస్తూ ఇతరుల వద్ద ప్రస్తావించడం. అట్లా ఉద్యమకాలం నుంచి మొదలుకొని ఈనాటి వరకు అనేకులు ఆయనతో ఇంటరాక్ట్ అవుతుంటారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎందరో ఫేస్బుక్లో వ్యక్తపరిచిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా, ఒంటరి పోరుకు సిద్ధపడటం చూస్తే ప్రజాభిప్రాయానికి, శ్రేయోభిలాషుల అభిప్రాయాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తారో అర్థమవుతుంది. ఉద్యమంలో కలిసి నడిచిన వారినెందరినో సలహాదారులుగా నియమించుకొని, వారిని పాలనలో భాగస్వాములను చేసి, విలువైన సలహాలు ఏమున్నా వాటిని ఆచరణలోకి తీసుకురావడం ఆయన ఆలోచనల సారళ్యతకు నిదర్శనం.
కేసీఆర్ గొప్ప మోటివేటర్! తాను చేపట్టబోయే ఏ కార్యక్రమాన్నైనా తన వాళ్ల మధ్య అత్యంత ప్రతిభావంతంగా ప్రవేశపెట్టి, దానిపట్ల అమితమైన ఆసక్తిని రేకెత్తించి, దానిలో భాగస్వాములం కాకుంటే ఏమి కోల్పోతామోనన్న ఉత్కంఠను రేకెత్తించి, దానిని విజయవంతం చేసి, అందరిని భాగస్వాములను చేసే నైపుణ్యం ఆయనకు ఉంది. ఉద్యమ సందర్భంలో రాజీనామాలు, సడక్ బంద్, వంటావార్పు, తెలంగాణ సంబురాలు, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు మొదలగు ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలతో పాటు రాష్ర్టం ఏర్పడిన తర్వాత, ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల ఓరియంటేషన్ క్లాసుల వరకు ప్రతి కార్యక్రమాన్ని ముందుగా విస్తృత చర్చకు తెరలేపి, అందరిని మోటివేట్ చేసి, చివరకు ఘనవిజయం సాధించేలా చేస్తారు.
గొప్ప మానవతావాది కేసీఆర్!
దళిత, గిరిజనులు, బడుగు బలహీనవర్గాల పట్ల ఆయనకు ఎనలేని మమకారం. అరవై ఏండ్ల సీమాంధ్ర పాలకుల వివక్షాపూరిత విధానాల ఫలితంగా అనేక తరాలు అంతులేని పేదరికంలో మగ్గిన పరిస్థితులను కండ్లారా చూసిన పిదప, తన ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం ఆ వర్గాల అభివృద్ధేనని స్థిరీకరించుకున్నారు. పథకాల రూపకల్పన, నిధుల కేటాయింపుల్లో వారి అభ్యున్నతికి సింహభాగం కేటాయించారు. అనేక సమస్యలతో తనను వ్యక్తిగతంగా కలిసే వారి పట్ల కూడా కడు దయార్ద్ర హృదయంతో స్పందిస్తారు కేసీఆర్.
ఒక్కసారి ఆయనను కలిసి, సాన్నిహిత్యంలో గడిపినవాళ్లు ఎప్పటికీ ఆయన ప్రేమానురాగాలను మరచిపోలేరు. ఆయనను విమర్శించడానికి పూనుకోరు. ఈ విషయాన్ని అనేకులు గతంలో చెప్పారు. ఈ మధ్యనే కేసీఆర్‌ను కలిసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా నాతో ఈ విషయాన్ని గొప్పగా ప్రస్తావించారు. ఉత్పత్తి శక్తులతో పాటు, సేవారంగంలో ఉన్న వారిపట్ల అపారమైన ప్రేమ ను, మానవీయతను ప్రదర్శిస్తారు. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇచ్చే సమయంలో, వారికి కడుపు నిండా ప్రయోజనం ఉండాలని వ్యాఖ్యానిస్తూ ఫిట్మెంట్ ప్రకటించడం ఆయనలో దాగి ఉన్న మానవీయ కోణానికి నిదర్శనం.
కేసీఆర్ గొప్ప చదువరి. విషయ గ్రాహకుడు. వేలాది పుస్తకాలు చదివిన జ్ఞానంతో ప్రతి విషయం పట్ల సాధికారతను సాధించగలిగారు. తెలంగాణ భాష, సంస్కృతి సాహిత్యం, కళల పట్ల అవగాహన మాత్రమే కాకుండా అవ్యాజమైన ప్రేమ కూడా ఉంది. తెలంగాణ ఉద్యమ సాఫల్యతలో ప్రజలకు ఆయనను చేరువ చేసింది భాష మీద ఆయనకున్న పట్టు. అంతేకాకుండా తెలంగాణ భావజాల వ్యాప్తిలో కీలక భూమిక పోషించిన కవులు, కళాకారుల పట్ల ఎనలేని గౌరవం, ప్రేమ. ఏ ప్రభుత్వం కనీసం ఆలోచనైనా చేయజాలని కళాకారులకు ఉద్యోగాల కల్పన.. వారి పట్ల గల ప్రత్యేక ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ఆంధ్రా పాలకుల పాలనలో విధ్వంసమైన తెలంగాణ భాష సంస్కృతుల వునరుద్ధరణ కోసం అనేక చర్యలు తీసుకున్నారంటే వాటి పట్ల ఆయనకు గల మక్కువ, ప్రాధాన్యాన్ని మనం గమనించివచ్చు.
కేసీఆర్ నిరాడంబరుడు, గొప్ప హాస్యచతురుడు. ఆయన ఆహార్యంతో పాటు మిగతా జీవనశైలి ఎంతో నిరాడంబరంగా ఉంటుంది. ఇంట్లో కుటుంబసభ్యుల మధ్యన, సన్నిహితుల మధ్యన, అధికారులతో చర్చల సందర్భంలో ఆత్మీయంగా, అనునయంగా ఉంటారు. ముఖ్యమంత్రినన్న డాబు, దర్పం ఏనాడూ కనిపించదు. విధి నిర్వహణ, నిజాయతీ, సమయపాలనల పట్ల ఎంత కఠినంగా ఉంటారో, దిశానిర్దేశం చేసే సమయంలో అంత సానుకూలంగా వ్యవహరిస్తారు. చాలామందికి తెలియని ఆయనలోని మరో కోణం హాస్యచతురత. అనేక సందర్భాల్లో కడుపునిండా, గలగలా ఆహ్లాదకరంగా నవ్వడంలో ఆయన్ని మించినవారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన వ్యక్తిత్వంలో దాగిన భిన్న కోణాలను గమనిస్తే ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. ఆయనతో గడపడమే ఓ అధ్యయనం. ఆయనతో మాట్లాడటమే ఒక జ్ఞానం. ఆయన సాన్నిహిత్యం అమ్మ ఒడిలాంటి సాంత్వనా కేంద్రం. ఆయనతో కలిసి నడవడమంటే మహోన్నత తెలంగాణ చరిత్రలో ఒక పుటగా మిగిలిపోవడం!
14 ఏండ్లుగా ఉద్యమ కేంద్రమైనవాడు, ప్రజల కష్టాలు చూసి కన్నీటిబొట్లు రాల్చినవాడు, వలస దోపిడీపై కత్తిదూసినవాడు, కాలాన్ని మార్చే కర్తవ్యాన్ని నిర్దేశించుకున్నవాడు, ఉడుకు నెత్తురుల చైతన్యాన్ని రగిలించినవాడు, ఉద్యమ శక్తుల్ని ఏకం చేసినవాడు, అంపశయ్యనెక్కి ఆశయాన్ని సజీవంగా నిలిపినవాడు, మరణం అంచుల దాకా వెళ్లి మన తెలంగాణ సాధించినవాడు, గడపగడపలో ఉద్యమ హారతులందుకున్నవాడు, గమ్యాన్ని ముద్దాడి ఘనకీర్తిని మూటగట్టుకున్నవాడు, ఉద్యమాలకే ఓనమాలు దిద్దినవాడు, పాలనకే పాఠాలు నేర్పినవాడు, పోరాటయోధుడే పాలకుడై ప్రజల కలలు పండించినవాడు కేసీఆర్.
అందుకే ఈ 25 ఏండ్ల కాలాన్ని సమీక్షించుకోవడం, సంబురాలు చేసుకోవడంతో పాటు, సాధకుడి ఔన్నత్యాన్ని, త్యాగాన్ని, సామర్థ్యాన్ని గుర్తుచేసుకోవడం మన బాధ్యత. కేసీఆర్ దార్శనికత, నిబద్ధత, నిత్య పరిశ్రమపైనే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్నది కాలం నిరూపిస్తున్న కఠోర సత్యం! తెలంగాణ సమాజం ఆయన ఆలోచనలకు ఆసరాగా నిలవాలి. నాయకత్వాన్ని బలపరచాలి. పది కాలాలు పచ్చగా ఉండాలని నిండు దీవెనలు ఇవ్వాలి! కేసీఆర్ క్షేమంగా ఉన్నంత కాలం తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ కీర్తి అజరామరమై వర్ధిల్లుతుంది.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
నారదాసు లక్ష్మణ్‌రావు 9849059562