భారతదేశంలో ప్రతి అరగంటకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రోజుకు 2 వేల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఇతర రంగాలకు వలస వెళ్తున్నారు. మిగతావారు కూడా లాభాలు వస్తున్నాయని వ్యవసాయం చేయడం లేదు. ఉన్న ఊరును, కన్నతల్లిని, భార్యాపిల్లలను వదిలిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్లలేక తప్పని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఆదాయ భద్రత లేని ఏకైక రంగం వ్యవసాయ రంగం. పెట్టుబడులు కూడా రాక, కుటుంబాన్ని పోషించుకోలేక, తెచ్చిన అ ప్పులు తీర్చే మార్గం లేక పంటపొలాల్లోనే రైతులు ఉరికొయ్యలను ముద్దాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు రాష్ట్రంలో 435 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆదర్శ గ్రామం. ఈ గ్రామంలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మామిండ్ల కనకరాజు వయసు 27 సంవత్సరాలు. ఉన్న ఎకరా అసైన్డ్ భూమిలో నాలుగు బోర్లు వేస్తే ఒక్కటి మాత్రమే కొన్ని నీళ్లు పోస్తున్నది. ఆ బోర్లో మోటర్ పడిపోయి రాకపోవడంతో నెల రోజుల క్రితం కొత్త బోర్ వేసేందుకు రూ. 5 లక్షలు అప్పు చేశాడు. చివరికి అప్పు తీర్చే మార్గం లేక ఫిబ్రవరి 9న రాత్రి 11 గంటలకు పొలం వద్ద గడ్డిమందు తాగాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 16న రాత్రి 12 గంటలకు మృతి చెందాడు. కనకరాజు పేరు మీద పట్టా లేకపోవడంతో రైతు బీమా వర్తించదు. కనకరాజుకు భార్య రేణుక (23) ఆరేండ్ల కొడుకు భానుప్రసాద్, మూడేండ్ల బిడ్డ ప్రియాతోపాటు వృద్ధులైన తల్లిదండ్రులున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం, గిరిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దళిత రైతు బండారి రవీందర్ (30). ఉన్న ఎకరా పొలంతోపాటు రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంటలు సరిగా పండక రూ. 6 లక్షలు అప్పు చేశాడు. అవి తీర్చే మార్గం కానరాక ఫిబ్రవరి 10న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రవీందర్‌కు భార్య అనిత, ముగ్గురు కుమార్తెలు స్నేహిత (6), లౌక్యశ్రీ (4), రిషిక (2) ఉన్నారు. రెండు నెలల క్రితం రవీందర్ తండ్రి మల్లయ్య సైతం ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో రెండు నెలల వ్యవధిలో తండ్రీకొడుకులు ఆత్మహత్య చేసుకోవడంతో ఊరంతా శోకసంద్రంలో మునిగింది. కుటుంబానికి మగదిక్కు లేకుండా పోయింది.
జనగామ జిల్లా, నర్మెట మండల కేంద్రానికి చెందిన ముక్కెర బాలరాజు (35). అప్పుల బాధతో ఫిబ్రవరి 11న సొంత వరిపొలంలో ఉరివేసుకున్నాడు. ఆయన భార్య భాగ్య, ఇద్దరు బిడ్డలు నవ్య (ఇంటర్), దివ్య (7వ తరగతి) ఉన్నారు. తనకు వారసత్వంగా వచ్చిన రెండెకరాల భూమితో పాటు తమ్ముడు పరుశరాములు నుంచి రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తి, మిర్చి పంటలు వేశాడు. ఫిబ్రవరి మొదటి వారంలో ఉన్న రెండు బోర్లు ఎండిపోవడం, హుస్నాబాద్ అంగడిలో రూ.1.5 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆవు మూడు రోజులకే చనిపోవడం, వారం రోజుల్లో రెండు లేగదూడలు కూడా మృత్యువాత పడటం, మరోవైపు పంటలు ఎండిపోవడంతో చేసిన రూ. 8 లక్షల అప్పులు ఎలా తీర్చాలన్న ఆవేదనతో ఫిబ్రవరి 11న ఉదయం 6 గంటలకు పాలు పిండుకొస్తానని బావి వద్దకు వెళ్లి ఉరివేసుకున్నాడు. ఉదయం 8 గంటలైనా భర్త ఇంటికి రాకపోవడంతో భార్య భాగ్య ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి బావి వద్దకు వెళ్లి చూస్తే కొట్టంలో భర్త ఉరివేసుకుని కనిపించాడు.
రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో ఇవి కొన్ని మాత్రమే. మన దేశంలో సుమారు 63 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయినా, ఇప్పటికీ సరైన వ్యవసాయ విధానం లేకపోవడం ప్రభుత్వాల చిత్తశుద్ధికి నిదర్శనం. 1995 నుంచి 2022 వరకు దేశవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికలు చెప్తున్నాయి. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో పదేండ్లలో 16,494 మంది రైతులు చనిపోయినట్టు ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొన్నది. 2004లో 2,030 మంది, 2005లో 1,802, 2006లో 1,932 మంది, 2007లో 1,071, 2008లో 1,575 మంది, 2009లో 1213, 2010లో 1,536 మంది, 2011లో 1,316 మంది, 2012లో 1,576 మంది, 2013లో 2,014 మంది, 2014లో 449 మంది రైతులు కలిపి మొత్తం 16,494 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. 2014 జూన్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కేవరకు 6,703 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాదిలోనే ఏకంగా 436 మంది రైతులు నేలకొరిగారు. ఈ గణాంకాలను బట్టి ఉమ్మడి ఏపీలో పెరిగిన రైతు ఆత్మహత్యలు.. ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ హయాంలో తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తున్నది. మళ్లీ కాంగ్రెస్ పాలన రాగానే అన్నదాతలు సమస్యల వలయంలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటికి ఇంతటితో ఫుల్స్టాప్ పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
– (వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)
పులి రాజు 99083 83567