భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయ్యాయని ఘనంగా సంబురాలు జరుపుకుంటున్నాం. కానీ, ఈ రోజుకు కూడా దేశ ప్రజలకు కనీస అవసరాలైన తాగు, సాగునీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలు లేని తీరు కండ్ల ఎదుట కనబడుతున్నది. దేశానికి కనీస మౌలిక వసతులు కల్పించలేకపోవడం వల్ల దేశ ప్రగతి రోజు రోజుకూ మందగిస్తున్నది. దేశ పురోగతికి చోదకశక్తిగా ఉన్నటువంటి యువత ఈరోజు అవకాశాలు లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నది.
తరతరాలుగా చరిత్రకారులు చెప్తున్నట్టు దేశంలో అపారమైన అద్భుత వనరు లు ఎన్నో దేశానికి ఉన్నాయి. జల సంపద, అట వీ సంపద, భూగర్భంలో ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నాయి. అయితే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు పాలకుల వైఫల్యం వల్ల ప్రజలు నేటికీ కనీస అవసరాలకు నోచుకోలేదు. భారతదేశంలో నీటి లభ్యత అనేది దేశ ప్రజల అవసరాలకు మించి ఉన్నది. ఏటా దాదాపు లక్షా నలభై వేల టీఎంసీల వర్షపాతం సంభవిస్తున్నది. ఇందులో ఆవిరైన, భూమిలో ఇంకిపోయిన సగం నీటిని తీసేస్తే ఇంకా దాదా పు 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. కానీ గత ప్రభుత్వాల పాలన వల్ల 20 వేల టీఎంసీల నీళ్లను మాత్రమే వాడుకొని మిగతా 50 వేల టీఎంసీలను అనవసరంగా సముద్రంలో కలిపి ఉప్పునీటిగా మారుస్తున్నాం. ఇందులో నుంచి కనీసం 20 వేల టీఎంసీలను మళ్లించి రైతుకు అందిస్తే దాదాపు 41 కోట్ల ఎకరాల్లో సాగుకు నీరును అందించవచ్చు.
స్వయంగా కేంద్ర ప్రభుత్వమే దాదాపు 50 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుందని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన నివేదిక. అంటే దేశంలో ఎక్కడచూసినా తాగు, సాగునీరు లేని కష్టాలకు కారణం కేంద్ర ప్రభుత్వమే అని అర్థం అవుతున్నది. స్వాతంత్య్రం వచ్చాక తొలినాళ్లలో ప్రాజెక్టుల అవసరాలకు అడుగులు పడ్డాయి. అలా బాక్రానంగల్, నాగార్జునసాగర్ లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల సాగు, తాగునీటికి ఎప్పు డూ ఇబ్బందే. పారుతున్న జీవనదులను సాగునీరుగా మలుపుకోకపోవడం వల్ల వ్యవసాయానికి సమయానికి నీరందక, పంటలు పండక రైతులు నష్టపోయి అప్పుల పాలయ్యారు. అప్పుల భారం పెరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పాపానికి కారకులు ముమ్మాటికీ దేశాన్ని పాలించిన పాలకులే. నేటికీ దేశానికి ఒక నీటి విధానమంటూ లేకపోవడం విచారకరం.
ఈ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో దేశాన్ని సమూలంగా మారుస్తానంటూ అడుగులు వేస్తున్నారు. దేశానికి ఒక విధివిధానం, లక్ష్యం అంటూ ఉండాలని, అప్పుడే దేశం ముందడుగు వేస్తుందనేది ఆయన ఆలోచన. కండ్లముందే వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్న తీరును ప్రజలకు వివరించడం ద్వారా నీటి అవసరాన్ని, దేశానికి ఉండాల్సిన లక్ష్యాన్ని వివరిస్తున్న తీరు అమోఘం. ప్రకృతి ఇచ్చిన జల సంపదను సంపూర్ణంగా సోయిపెట్టి ఎలా వాడుకోవాలో కేసీఆర్ తెలంగాణలో చేసి చూపెట్టారు. అదే పద్ధతి దేశమంతా అమలు చేయాలన్నది ఆయ న ఆలోచన. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను దేశమంతా కట్టి రైతన్నల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ను విస్తరిస్తున్నారు. విద్యుత్తు విషయంలోనూ దేశానికి ఒక విధానం లేదు. ఇప్పటికీ విద్యుత్తు సౌకర్యం లేని గ్రామా లున్నాయంటే అతిశయోక్తి కాదు.
కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే హెల్ప్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉన్నది. ఈ బొగ్గుతో 125 సంవత్సరాల పాటు దేశ ప్రజలకు ఏ కొరత లేకుండా నాణ్యమైన విద్యుత్తును ఇవ్వచ్చు. కానీ కేంద్రప్రభుత్వ లోపాల వల్ల దేశం చీకటి వెతలను అనుభవిస్తున్నది.
అందుబాటులో ఉన్న 361 బిలియన్ టన్ను ల బొగ్గును వాడితే దేశ ప్రజలకు, రైతులతోపాటు అన్నిరంగాలకు 24 గంటల కరెంటును ఉచితంగా 150 సంవత్సరాల పాటు ఇవ్వవ చ్చు అన్నది కేసీఆర్ చెప్తున్న మాట. తెలంగాణలో కరెంటు సమస్యను పరిష్కరించిన అనుభవంతో దేశంలోనూ వ్యవసాయం, ఇతర రం గాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు ను సరఫరా చేసేవిధంగా నూతన విద్యుత్తు విధానాన్ని బీఆర్ఎస్ అమల్లోకి తీసుకువస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కేంద్రంలో ఇన్నేండ్లుగా పాలించిన ప్రభుత్వాలు ఎన్నడూ కూడా రైతుకు అండగా నిలబడలేదు. దేశంలో రైతులు పంట పెట్టుబడి నుంచి పంట కొనుగోలు దాకా అష్టకష్టాలను ఎదుర్కొంటున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే అన్నింటా అడుగడుగునా అండగా నిలుస్తుంది. ఈ విధానం దేశమంతా రావాలన్నదే కేసీఆర్ సంకల్పం. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏటా పదివేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అలాగే రైతుబీమా ద్వారా రూ.5 లక్షలను అందజేస్తున్నది.
స్వతంత్ర భారతంలో దళితుల అభ్యున్నతి కోసం ఏ ప్రభుత్వాలు కూడా ఏ రకమైన, ప్రభు త్వ పాలసీలని, కార్యాచరణను రూపొందించ లేదు. దళితవర్గాలు సమూలంగా అభివృద్ధి చెం దాలంటే ఒక విప్లవాత్మకమైన ప్రయత్నం జరగాలనే ఆలోచనలో భాగమే తెలంగాణ దళిత బంధు పథకం. ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలను అందిస్తున్నది. ఇలా ఎన్నో పథకాలతో తెలంగాణను దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలిపిన కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుం కట్టారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగా ల్లో విఫలమైంది. ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఉద్రిక్తతలను రెచ్చగొట్టి పబ్బం గడిపే దుర్మార్గమైన ఎత్తుగడతో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది. మతోన్మాద శక్తులను బలపరుస్తూ అంతర్గత ఐక్యతను విచ్ఛిన్నం చేయాలన్నదే బీజేపీ లక్ష్యం.
బీజేపీ పాలనలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రమాదం ఏర్పడ్డది. మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్న అనాగరిక, అరాచక సంస్కృతిని రూపుమాపేందుకు మత సామరస్యాన్ని, ప్రశాంతతను పటిష్ట పరిచేందుకు బీఆర్ఎస్ దేశం వైపు అడుగులు వేస్తున్నది. గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ పురోగమించాలి.
జీ రాజేష్ నాయక్
96035 79115