1980వ దశకంలోనే మన దేశ పత్తి రైతుల జీవితాల్లో ఒక మౌన విషాదం మొలకెత్తింది. ఉష్ణోగ్రతలు, పంట పెట్టుబడులు, అప్పులు అమాంతం పెరిగిపోవడం, మార్కెట్లో ధరల తగ్గుదల లాంటివన్నీ కలగలిసి పత్తి రైతుల మానసికస్థితిని చీకట్లోకి నెట్టివేశాయి. 1988 నాటికి ఈ అస్థిరత మరింత ఘోరరూపం దాల్చి, పత్తి రైతుల జీవితాల్లో ఆత్మహత్య కూడా ఒక భాగంగా మార్చివేసింది. ఆ తర్వాతి దశాబ్దంలో తెలంగాణ, విదర్భ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య సామాజిక విషాదంగా విస్తరించి, భారత వ్యవసాయ రంగాన్నే కుదిపివేసే స్థాయికి చేరుకున్నది.
మన దేశంలో పత్తి రైతుల ఆత్మహత్యలకు ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. అయితే, 1990 మధ్యకాలంలో జాతీయస్థాయిలో అధికారికంగా పత్తి రైతుల బలవన్మరణాలను ఒక సంక్షోభంగా గుర్తించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)1995 నుంచి ప్రత్యేకంగా రైతుల ఆత్మహత్యల గణాంకాలను నమోదు చేసింది. 1995-2018 మధ్యకాలంలో సుమారు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే రోజుకు సగటున 48 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఉమ్మడి ఏపీలో 1996 తర్వాత రైతుల ఆత్మహత్యలు తీవ్రమయ్యాయి. 1996-2004 మధ్యకాలంలో కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు వీటిని ప్రత్యేకంగా విశ్లేషించాయి. తెలంగాణ ప్రాంతంలో పత్తి రైతుల ఆత్మహత్యలు మాత్రం 1997-98 సంవత్సరాల్లో జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఓ అధ్యయనం ప్రకారం.. 1997 అక్టోబర్ నుంచి 1998 మే వరకు ఏపీలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో అత్యధికులు తెలంగాణ ప్రాంతానికి చెందినవారే.
ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 1998లో పత్తి రైతుల ఆత్మహత్యలు 18 శాతం పెరిగాయి. ఆ తర్వాత 2001 వరకు ఏటా 16 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంక్షోభం పుట్టుకకు దీన్ని మొదటి దశగా చూడొచ్చు. అయితే, 1995 తర్వాతే గణాంకాలపరంగా స్పష్టత వచ్చింది.
1995-2013 మధ్యకాలంలో ఏపీలో 36,358 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే అంచనా ఉంది. వీరిలో సుమారు 60 శాతం మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారేనని రైతు సంఘాలు, వ్యవసాయ శాస్త్రవేత్తల నివేదికలు సూచిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో పత్తి ఒక ప్రధాన వాణిజ్య పంట. నాడు తెలంగాణ రైతులు వర్షాధార వ్యవసాయం చేసేవారు. బోలెడు పెట్టుబడి అవసరం. మార్కెట్లో ధరల ఊగిసలాట, అప్పుల బాధలు ఈ ప్రాంత రైతులను అస్థిరత్వానికి గురిచేశాయి. పత్తి రైతుల ఆత్మహత్యకు సామాజిక, ఆర్థికాంశాలే కారణమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. అప్పులు, వర్షాభావం లేదా అకాల వర్షాలు, మార్కెట్లో ధరలు పడిపోవడం, కనీస మద్దతు ధర అమలు కాకపోవడం, బీమా వ్యవస్థలో లోపాలు, సేద్య సాంకేతికత అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు రైతును మానసికంగా ఆత్మహత్య వైపునకు ప్రేరేపిస్తున్నాయని ఎన్నో విశ్లేషణలు చెప్తున్నాయి.
పత్తి రైతుల ప్రధాన సమస్యలను పరిశీలిస్తే, ధరల అస్థిరత మనకు మొదట కనిపిస్తుంది. తెలంగాణలోని ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో పత్తి రైతులపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. సర్వేలో పాల్గొన్న రైతుల్లో దాదాపు 96 శాతం మంది ధరల్లో స్థిరత్వం లేకపోవడం తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు. ప్రభుత్వాలు హామీ ఇచ్చే కనీస మద్దతు ధర స్థిరంగా అమలు కాకపోవడం, డిమాండ్ లేని సంవత్సరాల్లో ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ, ఆలస్యంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోళ్లలో అలసత్వం తదితర అంశాలు తమ పాలిట శాపాలుగా మారుతున్నాయని రైతులు చెప్పారు.
తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్రం ఏర్పాటుకు ముందే పత్తి రైతుల సమస్యలపై పలు కమిటీలు నివేదికలిచ్చాయి. వరుసగా కరువు సంవత్సరాలు, వరుస సీజన్లలో ఆశించిన ఎంఎస్పీ రాకపోవడం, కరెంట్ ఛార్జీల పెంపు, ఎరువుల సబ్సిడీ తగ్గింపు, స్థిరమైన పంట కొనుగోలు విధానం లేకపోవడం వంటి అంశాలు పత్తి రైతులను ఎక్కువగా ప్రభావితం చేశాయని ఆ నివేదిక సారాంశం.
పత్తి సాగులో పెట్టుబడితో పాటు రిస్క్ కూడా ఎక్కువే. ఒకవేళ పంట నష్టపోతే అప్పులు తీర్చే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం లేకపోవడం మరో ప్రధాన సమస్య. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి రైతులే కాదు, ఇతర పంటలు సాగుచేసే రైతులూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎన్సీఆర్బీ ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 4,690 మంది రైతులు కాగా, 6,096 మంది వ్యవసాయ కూలీలు. అంటే పత్తి, వరి, గోధుమ, చెరుకు, కూరగాయలు సాగు చేసే రైతులనూ ఈ సంక్షోభం వదలలేదని దీన్నిబట్టి అర్థమవుతున్నది. మార్కెట్లో ధరల అస్థిరత రైతుల ప్రణాళికలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. పెట్టుబడులు అన్ని పంటల్లోనూ పెరిగిపోతున్నాయి. ఎరువులు, పురుగుమందులు, డీజిల్, విద్యుత్ ఛార్జీల పెంపు, కూలీ రేట్లు భారీగా పెరిగాయి. హరిత విప్లవం కాలంలో ప్రారంభమైన అధిక ఇన్పుట్ విధానం ఇప్పుడు చిన్నతరహా రైతులకూ భారంగా మారింది.
ఇక రుణాల విషయానికి వస్తే, రుణ మంజూరు వ్యవస్థలోని అసమానతలూ పత్తి రైతుకు నష్టం చేకూరుస్తున్నాయి. షెడ్యూల్డ్ బ్యాంకులు, సహకార సంస్థలు చిన్న, సన్నకారు రైతులకు తగినంతగా రుణాలు ఇవ్వడం లేదు. దీంతో వారు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఆ అప్పును తిరిగి కట్టలేని స్థితిలో భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లి, చివరికి రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రుణభారం, వరుసగా పంటనష్టాలు, కుటుంబంపై తమ వల్ల పడుతున్న మానసిక, ఆర్థిక ఒత్తిడి రైతుల ఆత్మహత్యకు ప్రధాన కారణాలని విదర్భ ప్రాంతంలో జరిగిన మానసిక, సామాజిక అధ్యయనాల్లో తేలింది. ఇటీవల ఒడిశాలో ఓ రైతు ఐదెకరాల్లో వరి, పత్తి సాగు చేసి, వర్షాభావం వల్ల పంట నష్టపోయాడు. సుమారు రెండు లక్షల అప్పులను తీర్చే మార్గం లేక పురుగుమందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఇది ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలను పరిశీలిస్తే ఇవే కారణాలు కనిపిస్తాయి.
రైతుల సామాజిక రక్షణ వ్యవస్థ కూడా చాలా బలహీనంగా ఉంది. పంట బీమా పథకాలు కాగితం మీద బాగున్నా, క్షేత్రస్థాయిలో క్లెయిమ్ సెటిల్మెంట్ ఆలస్యం కావడం, అర్హత నియమాలు, సర్వే లోపాలు వంటి కారణాలతో రైతులకు అసలైన రక్షణ లభించడం లేదు. రైతు పంట నష్టపోయినప్పుడు రక్షణగా బీమా నిలిస్తే, ఆత్మహత్యలు తగ్గుతాయి.
ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలపై చర్చ కేవలం భావోద్వేగస్థాయిలోనే ఆగిపోకూడదు. కచ్చితమైన ఎంఎస్పీ అమలు, సమర్థవంతమైన పంట బీమా, వాతావరణానికి సున్నితంగా స్పందించే సాగు పద్ధతులు, రుణాల మంజూరులో అసమానతల తొలగింపు, రైతు కుటుంబానికి ఆరోగ్య, విద్య, వృద్ధాప్య భద్రత తదితర సంక్షేమ, అభివృద్ధి పథకాలను వెంటనే అమల్లోకి తీసుకురావాలి. అప్పుడే ఈ సంక్షోభాన్ని అదుపులోకి తీసుకురావచ్చు. ప్రతి ఇంటి కథగానే రైతు ఆత్మహత్య ఇంకా కొనసాగుతున్నది. భారతదేశం నిజమైన వ్యవసాయ దేశమని చెప్పుకోవాలంటే, ఈ కథకు ముగింపు పలికే రాజకీయ సంకల్పం, పాలనలో పారదర్శకత, శాస్త్రీయ దృక్పథం, సామాజిక న్యాయం అవసరం.
– (వ్యాసకర్త: పీఆర్వో, కాకతీయ విశ్వవిద్యాలయం)
డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి