గతేడాది చివరన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపిస్తామని, 25 ఎకరాల విస్తీర్ణంలో మినీ ఎడ్యుకేషనల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఇందుకు రూ.500 కోట్లు కేటాయించి పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.
యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరో కొత్త విద్యాసంస్థను ప్రారంభించడానికి శంకుస్థాపన చేసింది. ఈ సంస్థ పరిశ్రమలు, ఐటీ సంస్థలకు అనువైన నిపుణులను అందించనున్నదని సీఎం రేవంత్ ప్రకటించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరు తో క్రీడా యూనివర్సిటీని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఈ వర్సిటీ ద్వారా వచ్చే ఒలింపిక్స్‌లో భారత్‌కు పెద్ద సంఖ్యలో పథకాలు వచ్చేలా క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంచే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తున్నది.
నిజానికి రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలున్నాయి. వాటిలో 28 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త విద్యాసంస్థల అవసరం ఉన్నదా? పాత పాఠశాలల్లోనే అధునాతన వసతులు కల్పించి, ఉపాధ్యాయులను నియమించి విద్యను పటిష్ఠం చేస్తే సరిపోతుంది కదా? అనే చర్చ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్త సంస్థల వైపే మొగ్గు చూపుతున్నది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడం, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడం, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించడం వంటి చర్యలు తీసుకోకుండా, యూనివర్సిటీ స్థాపించి తద్వారా క్రీడా నైపుణ్యాలను పెంచుతామనడం ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిన చందంగా ఉన్నది. రాష్ట్రంలో 52 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో క్రీడా సౌకర్యాలను పెంచేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. క్రీడా మైదానాల్లేని అపార్ట్మెంట్లలో, క్రీడా ఉపాధ్యాయుల్లేని ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల క్రీడా నైపుణ్యాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయో ఆలోచించాలి. పీఎంశ్రీ పేరుతో కేంద్రం దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలకు నిధులు ప్రత్యేకంగా మంజూరు చేస్తూ మిగతా పాఠశాలలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు తగ్గించింది. అంతేకాదు, గిరిజన ప్రాంతాల్లో అప్పటికే ఉన్న గిరిజన పాఠశాలలకు అదనపు కేటాయింపులు చేస్తూ వాటిని అభివృద్ధి చేయాల్సిన కేంద్రం ఏకలవ్య పాఠశాల పేరుతో కొత్తగా పాఠశాలను ప్రారంభించింది. కస్తూర్బా గాంధీ విద్యాలయం (కేజీబీవీ) పేరుతో డ్రాపౌట్ బాలికల కోసం శాశ్వత భవనాలతో మండలానికో పాఠశాలను ప్రారంభించింది. తర్వాతి కాలంలో రెగ్యులర్ బాలికలను కూడా చేర్చుకుంటూ పోవడంతో అది మరో గురుకులంగా మారిపోయింది. అందులో పనిచేసే మహిళా ఉపాధ్యాయులకు కాంట్రాక్టు పద్ధతిలో తక్కువ వేతనాలు ఇస్తూ, చట్టబద్ధంగా వెట్టిచాకిరి చేయిస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత గాని, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు గాని లేవు.
రాష్ట్రంలోని 11 విశ్వ విద్యాలయాలకు ఈసారి రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు రూ.500 కోట్లు మాత్రమే! మొత్తం వర్సిటీల్లో 1800 బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీసీ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి! 5 వేల లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు బోధన సిబ్బంది లేని కారణంగా ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో చేరడానికి వెనుకంజ వేస్తున్నారు. వారు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. జాతీయస్థాయి ర్యాంకుల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు బాగా వెనుకబడ్డాయి. వందేండ్లకు పైగా చరిత్ర ఉన్న ఓయూ, సాంకేతిక విద్యలో రాష్ర్టానికే తలమానికంగా నిలిచే జేఎన్టీయూ ర్యాంకులు పడిపోయాయి. ఈ సంస్థల్లోని ప్రవేశాలు, కోర్సుల్లో నాణ్యత, ప్లేస్‌మెంట్స్, ఆర్థిక వనరులు, పరిశోధనకు వెచ్చించే నిధులు, లైబ్రరీ, కొత్త ప్రయోగశాలల ఏర్పాటు, వర్క్‌షాప్‌ల నిర్వహణ ప్రామాణికంగా తీసుకొని ర్యాంకులను నిర్ధారిస్తారు. ఇవన్నీ గమనిస్తే విద్యారంగానికి బడ్జెట్లో నిధుల కోత వల్ల ప్రమాణాలు క్షీణిస్తున్నాయని అర్థమవుతున్నది. ఈసారి కేంద్ర బడ్జెట్లో కూడా యూజీసీకి 60.99 శాతం బడ్జెట్‌ను తగ్గించింది. దీని ప్రభావంతో మన వర్సిటీలకు వచ్చే గ్రాంట్లలో పెద్ద ఎత్తున కోత పడనున్నది. ఈ పరిస్థితులన్నీ విశ్లేషించి విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిన కొత్త ప్రభుత్వం కొత్త విద్యాసంస్థల స్థాపనకు మొగ్గు చూపడం శోచనీయం.
ఇదిట్లా ఉంటే ఏటా లక్ష మంది విద్యార్థులు ఇంజినీరింగ్ డిగ్రీలు పొందుతుండగా 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. వీరికి నైపుణ్యాలు నేర్పించి సొంత అంకురసంస్థలు స్థాపించడానికి అవసరమైన కోర్సులను అందించేందుకు యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం స్థాపించనున్నారు. విద్యార్థుల నైపుణ్యాల లేమికి నిధులు, అధ్యాపకుల కొరత కారణమైతే, దాన్ని వదిలేసి, కొత్తగా నైపుణ్యాల కోసం వర్సిటీలను స్థాపించడం ఎందుకో అంతుచిక్కడం లేదు. ఇదంతా ప్రైవేటు భాగస్వామ్యంతోనే జరుగుతుంది. వారికి కావలసిన మానవ వనరులను ప్రభుత్వ సహాయంతో వారే సమకూర్చుకొని, వారి పరిశ్రమల్లో ఉద్యోగులుగా చేర్చుకుంటారు. అంటే, మన విశ్వవిద్యాలయాలు సమాజ అవసరాలకు కావలసిన మానవ వనరులను తయారుచేసే లక్ష్యాన్ని వదిలేసి, సామాజిక అవసరాలతో సంబంధం లేకుండా పనిచేయనున్నాయన్న మాట. అంటే ప్రభుత్వాలు కార్పొరేట్, పెట్టుబడిదారుల అవసరాలకనుగుణంగా మన విద్యార్థులను రూపొందించే విధానాలకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నదన్నమాట.