Telangana | తెలంగాణలో దసరా తర్వాత సంక్రాంతి అతిపెద్ద పండుగ. ఎవుసంపై ఆధారపడే రైతన్నలకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకం. సమైక్య పాలనలో 60 ఏండ్ల పాటు కరువుతో సావాసం చేస్తూ ఆకలితో అలమటించిన మన అన్నదాతలు.. గడిచిన తొమ్మిన్నరేండ్లు కేసీఆర్ హయాంలో స్వర్ణయుగాన్ని చూశారు. స్వరాష్ట్రంలో ఉద్యమనేత సంకల్పంతో బీడు భూముల్లోనూ రతనాలు పండాయి.
24 గంటల ఉచిత విద్యుత్తు, పుష్కలంగా సాగునీరు అందడంతో సంక్రాంతిని సంబురంగా జరుపుకొన్నారు. కానీ, ఈ సంక్రాంతికి మాత్రం రైతుల ఇండ్లల్లో సంబురం కనిపిస్తలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ సర్కార్ లేకుండా జరుగుతున్న మొదటి పండుగ ఇది. కేసీఆర్ సర్కార్‌తో పాటే రైతుల జీవితాల్లో సంబురాలు మాయమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు లేక, రైతుబంధు అందక కర్షకులు కష్టాలు పడుతున్నారు. ‘బాపు’ లెక్కన రైతులకు పెద్దదిక్కు కేసీఆర్ అండను కోల్పోయిన రైతులు దిగాలుగా ఉన్నారు.
యాసంగి సీజన్‌కు సంబంధించి నవంబర్‌లో విడుదల కావాల్సిన 12 విడత రైతుబంధు నిధులు కాంగ్రెస్ నిర్వాకం వల్ల ఆగిపోయాయి. ఎన్నికల కోడ్ పేరిట ఆ పార్టీ ఫిర్యాదుల కారణంగానే రైతుబంధుకు ఆటంకం ఏర్పడింది. తాము అధికారంలోకి రాగానే రైతుభరోసా పేరిట అంతకుమించి పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ చివరికి చేతులెత్తేసింది. అధికారం చేపట్టి 40 రోజులైనా ఇప్పటికీ పెట్టుబడి సాయం అందించలేదు.
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో సంక్రాంతి పండుగ సంబురంగా ఉండేది. సంక్రాంతి శోభకు మన తెలంగాణ పెద్ద బాపు కేసీఆర్ అందించే ‘రైతుబంధు’ పండుగ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగేవి. పల్లెలన్నీ పండుగ వాతావరణంలో కోలాహలంగా కనిపించేవి. దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకాన్ని తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ. కాళేశ్వరం ద్వారా తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారింది. తద్వారా పచ్చని సిరుల పంటలు పండుతున్నాయి.
అరువై ఏండ్ల ఉమ్మడి రాష్ట్ర పాలనలో రైతు బతుకు ఎట్లుండే. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు. గత తొమ్మిదిన్నరేండ్ల పాటు రైతుబంధు పండుగతో సంక్రాంతి సంబురం అంబరాన్ని అంటేది.
తెలంగాణ బిడ్డల బాగు కోసం ఆనాడు సీఎం కేసీఆర్ ఒక తండ్రిలాగ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. రాష్ట్రం తెచ్చిన ఉద్యమ నాయకుడే పరిపాలకుడిగా, బాపులా రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ప్రగతి పథంలో ముందుకు నడిపించారు. కేసీఆర్ బాపు నాయకత్వంలో తెలంగాణ ఎవుసం పండుగలా ఉండేది. ఆయన రైతన్నకు వెన్నెముకగా నిలిచారు.
నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ రైతుబంధు నగదు అందించలేదు. తూతూమంత్రంగా 30 శాతంలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు వేశారు. ఇంకా 70 శాతం మంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ అప్పోసొప్పో చేసి ఇప్పటికే కొంతమంది రైతులు బోరు బావుల కింద వరినాట్లు వేశారు. సాగునీరు లేక, పెట్టుబడి సాయం అందక.. గతంలో కంటే ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంట సీజన్లో సమయానికి టింగ్ టింగ్ మని ఖాతాల్లో నగదు జమ అవుతుండె. 11 విడతల్లో కేసీఆర్ సర్కార్ క్రమం తప్పకుండా రైతుబంధు నిధులను విడుదల చేసి రైతన్నలను ఆదుకున్నది. గత వానకాలం సీజన్ నాటికి రూ.72 వేల కోట్లను రైతుబంధు పేరిట రైతులకు అందించింది. గతేడాది జూన్‌లో వానకాలానికి సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద 65 లక్షల మంది రైతులకు రూ.7,508 కోట్లను అందించి రైతు సంక్షేమంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నది. ఈ విధంగా రైతుబంధు విషయంలో కేసీఆర్ సర్కార్ రైతులను ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు. సమయానికి నగదు అందించి ఆదుకున్నది.
యాసంగి సీజన్‌కు సంబంధించి నవంబర్‌లో విడుదల కావాల్సిన 12 విడత రైతుబంధు నిధులు కాంగ్రెస్ నిర్వాకం వల్ల ఆగిపోయాయి. ఎన్నికల కోడ్ పేరిట ఆ పార్టీ ఫిర్యాదుల కారణంగానే రైతుబంధుకు ఆటంకం ఏర్పడింది. తాము అధికారంలోకి రాగానే రైతుభరోసా పేరిట అంతకుమించి పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ చివరికి చేతులెత్తేసింది. అధికారం చేపట్టి 40 రోజులైనా ఇప్పటికీ పెట్టుబడి సాయం అందించలేదు. ‘అంతకుమించి’ సంగతి దేవుడెరుగు.. కనీసం గతంలో కేసీఆర్ సర్కార్ అందించిన విధంగా ఎకరానికి సీజన్‌కు ఐదువేలు అయినా ఇచ్చే దిక్కులేదు. రైతుబంధు నగదును సమయానికి ఇవ్వకుండా దాదాపు 70 లక్షల మంది రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. పండుగపూట పస్తులు ఉంచుతున్నది.
రైతు సంక్షేమం పట్ల కేసీఆర్‌కు ఉన్న అంకితభావం మరెవ్వరికీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా, ఆర్థికపరంగా ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ అన్నదాతలకు ఏ ఇబ్బందీ రానివ్వలేదు. కష్టం అనే మాట రైతుల దరి చేరకుండా తొమ్మిదిన్నరేండ్ల పాటు కంటికి రెప్పలా కాచుకున్నారు. రైతుల పక్షాన నిలబడ్డారు. ఎవుసం పండుగలా, రైతు సంతోషంగా ఉండేందుకు అన్నదాతకు గత కేసీఆర్ ప్రభుత్వం అందించిన వరం రైతుబంధు. దీంతో పాటు రైతుకు ధీమాగా కేసీఆర్ ప్రభుత్వం రైతు బీమా తీసుకొచ్చింది. దీని ద్వారా 83,216 మంది రైతు కుటుంబాలకు రూ.4,161 కోట్ల పరిహారం అందించారు.
కేసీఆర్ ముందుచూపు వల్లనే రాష్ట్రంలో పంటల దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. తెలంగాణ సీఎంగా ఆయన పనితీరుకు పెరిగిన సాగు విస్తీర్ణం, పంట దిగుబడి నిదర్శనం. ఇదే కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతున్నది. రూ.28,473 కోట్లతో విద్యుత్తు రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించారు.
సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందించిన ఘనత మన కేసీఆర్‌ది. నిరంతర వెలుగుల కారణంగా మన తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణగా విలసిల్లింది. గు నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందించారు. కాళేశ్వరం ద్వారా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ నీళ్లను యాసంగి పంటలకు అందిస్తే కనీసం నాలుగైదు లక్షల ఎకరాలు పారుతుంది. కానీ, ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. అటు కృష్ణా బేసిన్ కింద క్రాప్ హాలిడే ప్రకటించారు.
ఈ దేశంలో మన కేసీఆర్ ఒక్కరే రైతుల కోసం, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు. దేశానికి దిక్సూచి. ఆయన రైతు బిడ్డ, ఎవుసం అంటే ఆయనకు ప్రాణం. రైతు అంటే ప్రేమ. ఎవుసం కోసం, రైతు కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి కేసీఆర్. రైతు బాగు కోసం నిత్యం తపించే తత్వం ఆయనది. రైతు కోసం ఎంతకైనా కొట్లాడుతారు. ఎవరితోనైనా ఢీ కొట్టడానికి సిద్ధమవుతారు. రైతు కంట కన్నీళ్లు చూస్తే చలించే మనసు ఆయనది.
ఈ సంక్రాంతి పండుగ సమయంలో రైతులు దిగాలుగా ఉన్నారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. గత తొమ్మిదిన్నరేండ్ల పాటు కేసీఆర్ పాలనలో తెలంగాణలో పండుగ వాతావరణం కోలాహలంగా ఉండేది. కానీ, ఈ సంక్రాంతి పండుగ వెలవెలబోతున్నది. ఎవుసం పండుగలా, రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం పచ్చగా ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా రైతులకు అండగా నిలవాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చి, సాగుకు సాయం చేయాలి.
జై రైతన్న.. జై తెలంగాణ..
చిటుకుల మైసారెడ్డి
94905 24724