తప్పులు చేసి వాటిని కప్పి పుచ్చుకోవటం ఆధునిక కాలంలో ఒక ఫ్యాషనైపోయింది. సహజంగా ఇలాంటి పోకడలను మనం తెరపైనే చూస్తుంటాం. కానీ, దురదృష్టవశాత్తు ఇప్పుడు మన తెలంగాణలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, పడుతున్న ఆపసోపాలు అచ్చం అలాగే ఉన్నాయి.
రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడానికి కాంగ్రెస్ అలవికాని హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరు గ్యారంటీల పేరిట లెక్కలేనన్ని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని వంద రోజుల్లోనే అమలుచేస్తామని ప్రజలను మభ్యపెట్టింది. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కింది. అయితే మొదలు 2023, డిసెంబర్ 9న ‘రుణమాఫీ’ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయింది. ఆ తర్వాత రుణమాఫీ అమలు తేదీలు మారుస్తూ వచ్చింది. ఆఖరికి మూడు విడుతల్లో రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఏ మాత్రం నెరవేర్చుకోలేకపోయింది. ‘రుణమాఫీ’ తూతూ మంత్రంగా అమలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రైతులు ఆగ్రహానికి గురయ్యారు. రోడ్లపై ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ, శవయాత్రల రూపేణా ఆందోళనలు చేశారు. వీటన్నింటిని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ‘హైడ్రా’జకీయానికి తెరలేపింది.
అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆహ్వానించదగిన పరిణామం. కానీ, ఇందులోనూ రాజకీయ కోణానికి తెర దీయటమే ఆక్షేపణీయం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, నాయకులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవటం ‘హైడ్రా’ వెనుక ఉన్న కుట్ర కోణాన్ని తెలియజేస్తున్నది. కాంగ్రెస్ తమ పార్టీలో చేరాలంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి నికార్సయిన నాయకులను బెదిరింపులకు గురిచేసింది. లొంగకపోవడంతో ఆస్తుల ధ్వంసంతోనైనా పార్టీలో చేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ హైడ్రామాకు తెరదీసింది. అసలు హైదరాబాద్‌లో చెరువులు మాయమవ్వటానికి కారకులెవరు? ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిందెవరు? సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్, టీడీపీలు కాదా? నాడు ఇష్టానుసారం చెరువులపై నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి నేడు నీతులు వల్లిస్తే జనం నమ్ముతారనుకోవటం హాస్యాస్పదం కాదా? కూల్చివేతలను సక్రమంగా అమలుచేస్తే 50 శాతం హైదరాబాద్ కనుమరుగవుతుంది. ఇది సాధ్యమా? ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేనె తెట్టెను కదుపుతున్నాడనే చెప్పవచ్చు. చెరువుల్లో నిర్మాణాలు చేసినవారు అత్యధిక శాతం కాంగ్రెస్, టీడీపీ నేతలే. వీళ్ల నిర్మాణాలను కూల్చివేసే సాహసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? అంటే చేయదనే చెప్పాలి. ఏదో నాలుగు రోజులు హడావుడి చేసి సల్లపడకపోతే అదే సంతోషం. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి సోదరుడి ఫామ్‌హౌజ్‌లు సైతం చెరువుల ఆవరణల్లోనే ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందా? అలాకాకుండా ప్రత్యర్థులను మాత్రమే టార్గెట్ చేస్తుందా? నిజంగా పారదర్శకంగా చేపడితే మాత్రం తప్పకుండా ప్రజలు స్వాగతిస్తారు, స్వాగతించాలి కూడా. కానీ, కక్ష సాధింపుల కోసమే ‘హైడ్రా’ను వాడుకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
రాష్ట్ర ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నారు. డెంగ్యూ స్తైర విహారం చేస్తున్నది. చికున్ గున్యా కేసులు రోజురోజుకు అమాంతం పెరుగుతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు లేక, మంచాలు దొరకక మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో ఇంత తతంగం జరుగుతున్నా ఏలికలు మాత్రం కనీసం ఒక సమీక్ష జరిపిన పాపాన పోలేదు. ఇక సంక్షేమ గురుకులాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. విద్యార్థులు పాము కాట్లకు గురవుతున్నారు. కలుషిత ఆహారంతో విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారు. మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు శాంతిభద్రతల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరూపిస్తున్నాయి.
ఇలా.. రాష్ట్రంలో సమస్యలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ ఘటనలు మీడియా కంట పడకుండా ‘హైడ్రా’ పేరిట కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నది. అందులో భాగంగానే ఈ మళ్లింపు రాజకీయాలు. అయితే, కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల హస్తం ఉన్నదంటూ వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ‘హైడ్రా’మాకు పుల్‌స్టాప్ పడుతుందనే చర్చ ప్రజల్లో ఇప్పటికే మొదలైంది. ఆ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ దిశగా అడుగులు వేస్తారో చూడాల్సి ఉన్నది. ఈ మళ్లింపు రాజకీయాలను ప్రజలు గమనించడం లేదని కాంగ్రెస్ నాయకులు భ్రమ పడుతున్నారు. కానీ, తెలంగాణ ప్రజలు తెలివైనోళ్లు. ఏకంగా కాంగ్రెస్ పార్టీనే డైవర్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయే.
-తెలంగాణ విజయ్
94919 98702