పలు జాతీయ సర్వేలు, గ్లోబల్ ర్యాంకింగుల్లో బెస్ట్ సిటీగా మన భాగ్యనగరం నిలవడం అభినందనీయం. నివాసయోగ్యమైన, పనికి అనువైన దేశంలోని 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ టాప్‌లో ఉన్నది. ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. ఈ విషయం హాలీడేఫై.కామ్ అనే వెబ్సైట్ సర్వేలో వెల్లడైంది. పర్యాటకుల హాలీ డే స్పాట్‌గా, భిన్న రాష్ర్టాల సంస్కృతుల కలబోతగా భాగ్యనగరాన్ని ఆ వెబ్సైట్ ప్రశంసించింది.
ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక ‘మింట్’ మన దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాలను తీసుకొని పది అంశాల ఆధారంగా సర్వే చేపట్టగా హైదరాబాద్ అత్యంత నివాసయోగ్య నగరమని తేలింది. పనిదినాల్లో రోడ్లపై ప్రయాణానికి పట్టే సమయం, ప్రజా రవాణా సదుపాయం, కొత్తగా వచ్చే వలసలు, అన్ని కులాలు, మతాలు కలిసి నివసించే వైవిధ్యం, అందుబాటులో ఇండ్లు, ఆహార సదుపాయాలు, పాఠశాలలు, వైద్యశాలలు వంటి మౌలిక సదుపాయాలు, పచ్చదనం, పరిశుభ్రమైన గాలి వంటి అంశాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నది.
రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు (Rome was not built in a day) అనేది నానుడి. హైదరాబాద్ కూడా నంబర్‌వన్ స్థాయికి ఒక్క రోజునే ఎదగలేదు. దీనివెనుక సీఎం కేసీఆర్ కఠోర శ్రమ ఉన్నదనేది కాదనలేని నిజం. ముందుచూపుతో ఆయన భాగ్యనగర నిర్మాణానికి బలమైన పునాదులు వేశారు. అందుకే ఇప్పుడు అనేక నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ టాప్‌గా నిలిచింది.
ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు పదేండ్లలో నాటి ప్రభుత్వం హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ.22 వేల కోట్ల పైచిలుకు ఖర్చుపెట్టింది. అదే తెలంగాణ ప్రభు త్వం తొమ్మిదేండ్లలో ఏకంగా రూ.88 వేల కోట్లు వెచ్చింది. అభివృద్ధికి కోసం భారీస్థాయిలో నిధులు ఖర్చుచేసింది కాబట్టే అంతర్జాతీయ సంస్థలకు పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్ ఎదిగింది. ఐటీ ఎగుమతుల్లో 2022లో దేశవ్యాప్తంగా 17.20 శాతం వృద్ధి రేటు ఉంటే, తెలంగాణలో 26.14 శాతం నమోదైంది. 2023లో హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు రూ.3 లక్షల కోట్లు దాటనున్నది. తెలంగాణ ఏర్పడేనాటికి హైదరాబాద్‌లో 10 లోపే ఫ్లైఓవర్లు, ఆర్వోబీలున్నాయి. గత తొమ్మిదేండ్లలో 47 ప్రాజెక్టులు చేపట్టారు. ఐదేండ్లలోనే 20 ఫ్లై ఓవర్లు సహా 25 ప్రాజెక్టులు పూర్తిచేశారు.
కోకాపేటలో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో గరిష్ఠంగా ఎకరం ధర రూ.100 కోట్లు పలికింది. హైదరాబాద్ భూముల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకొనేందుకు ఇదో ఉదాహరణ. రియల్ పెట్టుబడులతోపాటు ఆఫీస్ స్పేస్‌లోనూ దేశంలోని ఇతర మెట్రో నగరాలను దాటేసి హైదరాబాద్ ముందంజలో ఉన్నది. ప్రపంచ సంపన్న నగరాల్లోనూ హైదరాబాద్ చోటు దక్కించుకున్నది. భారత్ నుంచి ఐదు నగరాల్లో ఇందుకు చోటు సంపాదించగా, అందులో మన హైదరాబాద్ కూడా ఉండటం గర్వకారణం. అమెరికాలోని న్యూయార్క్ నగరం 3,40,000 మంది డాలర్ మిలియనీర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా నిలిచింది.
భారతదేశంలో అత్యంత ఎత్తయిన భవనాలున్న నగరంగా ముంబై తర్వాత హైదరాబాద్ నిలిచింది. గతంలో 10-15 అంతస్థులుంటే మహా గొప్ప. కానీ ఇప్పుడు ఏకంగా 58 అంతస్థుల భవనాలు దర్శనం ఇస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో రహదారిపై మొదటి పొడవైన 2.62 కిలోమీటర్ల ఉక్కు వంతెన హైదరాబాద్‌లోనే వీఎస్టీ నుంచి ఇందిరాపార్కు వరకు ఎస్ఆర్డీపీలో 36వ ప్రాజెక్టుగా నిర్మించారు. భూముల్లో, సమైక్య జీవనవిధానంలో, చవకైన వైద్య వనరుల్లోనూ హైదరాబాద్ మేటిగా నిలిచింది. భాగ్యనగరం బంగారు నగరంగా మారడం వెనుక ఉన్న మేధాశక్తి కేసీఆర్! వ్యూహకర్త కేసీఆర్! దీన్ని ఎలా కాదంటారు? ఎవరు కాదనగలరు?
లట్టుపల్లి విక్రమ్
97015 87979