తెలంగాణలో 1946లో ఉవ్వెత్తున లేచిన దోపిడీ వ్యతిరేక ఉద్యమజ్వాల ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ఉద్యమానికి కమ్యూనిస్టులు అండగా నిలిచారు. ఈ ఉద్యమానికి ‘తెలంగాణా రైతాంగ పోరాటం’ అనే పేరూ ఉంది. ఈ తెలంగాణ పోరాటంలోని వ్యథాత్మక గాథలను ఆంధ్రాప్రాంతంలోని కవులు ఎందరో కవిత్వంగా మలిచారు. వాటిలో కవి ఆవంత్స సోమసుందర్ ‘వజ్రాయుధం’ (1949), కవి ఆరుద్ర ‘త్వమేవాహమ్’ (1949) మొదలైనవి ఉన్నాయి. ప్రాంతేతరులైన ఈ కవులు ఆనాటి తెలంగాణ ప్రజల బాధలనూ, కన్నీళ్లనూ, పోరాట పటిమను చూసి స్పందించి, తమ కవిత్వంలో పలవరించారు. వచన కవితోద్యమ నాయకుడిగా వచన కవితా ప్రచారకుడిగా, తెలుగు వాల్ట్ విట్మన్గా అభ్యుదయ కవితకు, వచన కవితకు పర్యాయపదంగా నిలిచిన కవిగా పేరుపొందిన కుందుర్తి ఆంజనేయులును కూడా ఈ తెలంగాణ పోరాటం (1946-51) కదిలించింది. వచన కవితా ప్రక్రియలో తొలిసారిగా ‘తెలంగాణ’ పోరాట కథను మహాకావ్యంగా రాయడానికి ఆయన పూనుకున్నారు.
ప్రముఖ కవులు కవికోకిల గుర్రం జాషువా, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణల శిష్యుడైన కుందుర్తి పద్యాన్నీ అతి సున్నితంగానూ ప్రౌఢంగానూ రాయగలిగేవారు. తాను రాసే కవిత్వం సామాన్య ప్రజలకు చేరాలని ఏ ఛందోబంధాలు లేని స్వేచ్ఛామార్గమైన వచన కవితా ప్రక్రియనే తన వాహికగా ఎంచుకున్నారు. 1941 నుంచి 1982లో చనిపోయే వరకూ వచన కవితాభివృద్ధికే అంకితమయ్యారు. ‘రచన పూలతోటలో/ ఛందస్సు మొక్కలు నాటను / భావనలో సామాన్యుని/ జీవిత వలయాలు దాటను’ అని శపథం చేశారు. ‘పాతకాలం పద్యమైతే/ వర్తమానం వచన గేయం’ అంటూ ఆధునిక కవిత్వానికి లక్షణకారుడిగా లక్షణం చెప్పారు.
‘తెలుగులో వచన కవితను ఓ మలుపు తిప్పిన మహాకవి కుందుర్తి. సంప్రదాయాన్ని బాగా జీర్ణించుకొని ప్రయోగశీలతను అలవరచుకున్న పురోగామి కవి ఆయన. అందువల్లనే ఛందస్సు నుంచీ, గ్రాంథిక పదబంధాల నుంచీ విడిపోయారు.. కవిత్వ భాషను మాట్లాడుకునే భాషకు దగ్గరగా తీసుకువచ్చాడు’ అంటూ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, అభ్యుదయ కవి సి.నారాయణరెడ్డి అన్న మాటలు అక్షర సత్యాలు. ఆకాశంలో విహరించే కవిత్వాన్ని భూమార్గం పట్టిస్తానన్న శ్రీశ్రీ మాటలను నిజం చేసిన కవి కుందుర్తి.
సోమసుందర్, ఆరుద్రల లాగే 1949లోనే కవి కుందుర్తి ‘తెలంగాణ’ పేరిట తెలంగాణ పోరాట కథను మహా భారతంలో 18 పర్వాలుండగా 18 భాగాలుగా వచన కవితలో బృహత్కావ్య రచనకు పూనుకున్నారు. 1953లో ఈ కావ్యాన్ని పూర్తిచేశారు. ఆంధ్రుల తొలి రాజధాని కర్నూలులో 1956లో ప్రభుత్వ సమాచార శాఖలో ఉద్యోగంలో చేరి, ఆ సంవత్సరం డిసెంబర్ నెలలో ‘తెలంగాణ’ వచన మహాకావ్యాన్ని ప్రకటించారు.
ఆసియాలోనే పెద్ద ఉద్యమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ పోరాటంపై కుందుర్తి వచన కవితలో మహాకావ్యం రాస్తూ.. మహా భారతం పోలికతో ఇందులో – ‘ప్రస్తావన’, ‘రాయచూర్’, ‘బహిష్కార’, ‘అజ్ఞాత’, ‘మానభంగ’, ‘గృహదహన’, ‘ప్రతిఘటన’, ‘దిగ్విజయ’, ‘భూమిదాన’, ‘న్యాయదాన’, ‘రజాకార’, ‘దురాగత’, ‘దండయాత్ర’, ‘ఉప సంహారం’ అంటూ 18 భాగాలుగా విభజించి రాశారు.
‘కాలాన్ని కొలిచేందుకు గడియారాలెందుకు? / క్యాలెండర్లు, పంచాంగాలూ, కేవలం వృథా కదా/ ఆ కాలప్రజ చదివిన కష్టకావ్య సంపుటాలు/ సామాన్యుల బాధలు, జీవితాల గాథలు చాలు’ (ప్రస్తావనం) అంటారు. ‘పర రాజులు నిలదొక్కుకునేందుకు బలంగా/ చేసిన సహకారానికి ఒక జానెడు నేల ప్రతిఫలంగా/ గడించిన సింహాసనమది’ అంటూ నైజాం ప్రభుత్వం సింహాసనం గురించి యథార్థం చెప్తారు.
‘స్వార్థం కట్టిన గులకరాళ్లే / వంతెనే ఆలంబనగా/ సామాన్యుల బతుకు/ బాటకొక లంబంగా/ ప్రగాఢ కాంక్షలతో / ప్రతి నిమిషం బతుకు మీద ఆంక్షలతో / పరిపాలన సాగింది’ అంటూ ఆనాటి పాలన గురించి వివరిస్తారు. నైజాం సంస్థానమైన తెలంగాణ ప్రాంతంలో జమీందారుల, దేశ్ముఖుల దురాగతాలతో ప్రభువుపైనా, ఆనాటి పాలకుపైనా కోపాగ్ని జ్వాలలతో ప్రజలు చైతన్యవంతులైనారనీ, ‘ఈ మూడు శతాబ్దాలు మీటిన పరిపాలన వీణల/ పలికినై అపశబ్దాల పరంపరల బాణులు/ క్రమక్రమాగత చైతన్య ధనుష్పాణులు/ ప్రజలు నేడు’ అంటూ కుందుర్తి నైజాం సంస్థానంలో మారిన ప్రజల తీరును వర్ణించారు. ‘ప్రసవించి నశిస్తుంది గెల వేసిన అరటి తరువు/ ప్రగతి శిశువు జననంతో అధర్మానికిక కరువు/ పుడమితల్లికిటీవలనే మలి చూలు నెల తప్పింది’ అంటూ కుందుర్తి తెలంగాణ పోరాటానికి బీజావాపమైందని చెప్తారు. ప్రతి పల్లె హృదయంలోనూ ఒక దాక్కున్న ఉదయం ఉందంటూ, ప్రతి పల్లె రహస్య జీవితంలో ఇప్పుడు రాత్రి పాఠశాల ఉందంటూ, తిరణాలలో మారుపడిన కుర్రాడు తెలుసుకున్న దారి ‘సంఘం’ అంటారు. ‘సంఘం సూర్యుడు చాచిన/ శతసహస్త్ర కిరణాల దీర్ఘ బాహువులు/ పోలీసు ఠాణాన్ని/ దేశముఖుల దివాణాల్ని వాటేసుకున్నై’ అంటూ సంఘ కార్యకలాపాలు ప్రజోద్యమంగా ఎట్లా విస్తరిస్తాయో కుందుర్తి వర్ణించారు.
తెలంగాణ పోరాటంలో ప్రాణం కోల్పోయిన తొలివీరుడు దొడ్డి కొమురయ్య పేరును ప్రస్తావిస్తూ… ‘ఆ పైన ఎంతమం ది అమరయ్యలు, అమాయకులు కరిగారో’ అని కుందుర్తి బాధను వ్యక్తం చేశారు ‘గుడిసె ముందు అధికారి యువతిని చెరిచాడు/ ఎవరూ అక్కడ ఉండకూడదని అరిచాడు/ పదహారేండ్ల మానవతి శీలాన్ని కరిచాడు/ ఆ అమ్మాయి అవమానంతో గుడిసెలోకి పోయింది/ ఆ అమ్మాయి ఉదయం ఆరు గంటలకు చచ్చిపోయింది’ అని ఒక దుర్ఘటనను ఆనాటి పాలకుల ఆగడాలకు ఉదాహరణగా చెప్పారు.
‘వారం రోజుల ముందు వట్టి పిరికి గుండె/ నేడు ముప్పేట మలచిన దారపు కండె / ప్రాణం పెళ్లాలకు దాసులైన ఒకరిద్దరు పోను/ మిగిలినవారు జితేంద్రియలు’ అని తెలంగాణ పోరాటం చేయడానికి నడుం కట్టిన యువ వీరులను ప్రశంసించారు. ఊరి వెలుపల పెదకాపు తోపులో విరగ్గాసిన కొడవళ్ల చింతలు ప్రజలు కోసుకోవచ్చు’ అని ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పునూ తెలియజేశారు. ‘మతానికి నవాబు పెట్టిన ముద్దు పేరు/ ఆనాటి రజాకారు’ అంటూ వీళ్లే గ్రామాలను కుంపటిలా మండించారనీ పాపాన్ని పండించారనీ అంటారు. ‘రజాకార్లు కట్టుచీరలు ఊడబీకారు/ ఆనాటి (సంఘ) ప్రతిఘటన/ రథచక్రాలు కూరుకుపోయిన/ కర్ణుని అస్త్రవిద్యలా / సమయానికి చాల్లేదు’ అని హృదయ విదారక సంఘటనను కుందుర్తి ఇందులో చెప్పారు.
‘పోలీసు చర్యకూ యుద్ధానికీ అదో రకం తేడా ఉంది/ ఒకటి మన బాహుదర్ప ప్రదర్శనం/ రెండోది పశుత్వ ప్రదర్శనం’ అంటూ పోలీసు చర్యను (1948) కుందుర్తి సమర్థించడం గమనార్హం. పోలీసు చర్య తర్వాత ‘అడివంతా అల్లకల్లోలం చేసిన / మత్తగజం లొంగింది / ఒక జాతి ప్రతిష్ఠావాహిని / గట్లు త్రెంచుకు పొంగింది/ నవాబు తల నేలకు వంగింది’ అంటూ ఇందులో కుందుర్తి నిజాం ఏ విధంగా లొంగిపోయాడో వర్ణించారు. ‘భారీ స్వయంవరంలో కాలంకాంత నిజాన్నే వరిస్తుంది.. ఉల్లాసాల విరజాజుల పూలమాల బతుకు కంఠంలో ధరిస్తుంది అని, జీవితం భయాన్ని ధిక్కరిస్తుందనీ, బాధలను అధఃకరిస్తుంది అని తెలంగాణ పోరాటం సాధించిన విజయాన్ని వివరిస్తారు.
‘బహుశా ఇదే మొదలనుకుంటాను/ గేయాలు తెచ్చిన కొత్త తెలుగు/ ఆధునిక యుగంలో ఒక పూర్ణకావ్యంగా / బతుకును వర్ణించడం’ అని కుందుర్తి తన ఈ ‘తెలంగాణ వచన కవితా కథాకావ్య విశిష్టతను చెప్తూ ‘ఈ నేల ఎవరిది? కోటి ప్రజల సొత్తు కదా/ కొందరు వద్దంటే ఒప్పుకొని చరిత్రా!/ ముందుకు పదా!’ అంటూ కవి కుందుర్తి తెలంగాణ కావ్యాన్ని ముగించారు.
ప్రజల నోళ్లలో నానే పలుకులతో, పదబంధాలతో సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా సామాన్యుడి భాషలో కుందుర్తి ఈ కావ్యాన్ని రాశారు. అయితే ‘అధర్మం తుంచేసి ధర్మ ప్రతిష్ఠాపన’ కోసం ఈ కవి కుందుర్తి చెప్పడం ఈ కావ్యంలో పెద్దలోపం అని ఒక విమర్శ ఉంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే.. కుందుర్తి వీరసామ్యవాది కారు. రాజకీయ సిద్ధాంత భేదాలతో నిమిత్తం లేకుండా ప్రజల అభిప్రాయానికి విలువ ఇచ్చే తత్వం ఆయనది. నిరంకుశ పాలన అంతరించాలని ప్రజలు కోరుకున్నారు. గనుక ఆ నిజాం నవాబును లొంగదీసింది పోలీసు చర్య గనుక, ప్రజలందరికీ మేలు చేసేదే గనుక కుందుర్తి పోలీసు చర్యను ధర్మ ప్రతిష్ఠాపన కోసం అని అన్నారు. ఏదేమైనా- తెలంగాణ పోరాట కథను అవగాహనతో చిత్రించిన తొలి వచన కవితా మహాకావ్యం కుందుర్తి ‘తెలంగాణ’ ఒక్కటే అని చెప్పవచ్చు.
(వ్యాసకర్త: కుందుర్తి సమగ్ర సాహిత్యంపై డాక్టరేట్ పొందిన పరిశోధకుడు)
– ‘రఘువర్మ’, టీ. లక్ష్మీనారాయణ
92900 93933