కర్ణాటకలో బీజేపీ ఓటమి, కాంగ్రెస్ పార్టీ గెలుపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో సరికొత్త అంశాలపై చర్చకు దారి తీశాయి. బీజేపీ విషయంలో రెండు స్పష్టమైన అంశాలనూ ఎత్తి చూపించాయి. అందులో బీజేపీ భావోద్వేగపు ఎజెండానే కాంగ్రస్ పార్టీ కొనసాగించిన అంశం ఒకటి. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం మొదలుకొని కౌంటింగ్ జరిగే చివరి నిమిషం వరకు దైవ నామ స్మరణలతో ఆ రాష్ట్రం మారుమోగింది. తామూ గుళ్లకు వెళ్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో మరీ ప్రచారం చేసుకున్నారు కాంగ్రెస్ నాయకులు.
సహజంగానే కర్ణాటకలో మఠాలు, పీఠాధిపతులు, స్వామీజీల సంఖ్య ఎక్కువ. అలాంటి రాష్ట్రంలో భక్తికి కాస్త ఎక్కువగానే చోటు ఉంటుంది. ఈ మూలాలనే గట్టిగా పట్టుకొని బీజేపీ ముందుకు సాగగా అనూహ్యంగా కాంగ్రెస్ సైతం గుళ్ళు, గోపురాలు అంటూ తిరగటం, హిందూ దేవుళ్లు అందులో ప్రధానంగా బజరంగ్ బలి ఏ ఒక్కరి సొంతం కాడు…ఆయన అందరివాడు అని చెప్పే ప్రయత్నం చేయడం స్పష్టంగా కనిపించింది. ఆంజనేయ స్వామినే అంతా నమ్ముకున్నట్టు కన్పించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు దేశ రాజ్యంగ పీఠిక గురించి మాట్లాడిన ప్రతిసారి హిందూ అంశాన్ని జోడించి బీజేపీ నాయకులు మాటలతో దండయాత్ర చేసే వారు. అంతే కాదు హనుమాన్ చాలీసాను చదివి నిరసనలు వ్యక్తం చేసేవారు. ఆ విధంగా తాము యావత్ దేశంలోని హిందూదేవుళ్లకు, భక్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా భావించారు. అయినప్పటికీ కాంగ్రెస్ సంక్షేమ ఎజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి కర్ణాటకలో విజయం సాధించింది.
పార్టీలు గెలుపోటములు సహజమే. కానీ బీజేపీ అలాకాదు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా హిందూత్వమే తన ఎజెండాగా చేసుకున్నది. ఇతర పార్టీల నాయకులు సైతం ఇన్నాళ్లు తామూ దేవుళ్లకు మొక్కుతున్నా.. తమలో హిందూ కోణం బలంగా ఉన్నా…బయటకు కనిపించనీయలేదు. ఇప్పుడు అనివార్యంగా… రాజ్యంగాన్ని, రాజ్యాంగ ఆత్మను ప్రతిఫలింపజేస్తూనే హిందూ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ప్రధాన జాతీయపార్టీయే కర్ణాటక ఎన్నికల పుణ్యమా అని హనుమాన్ చాలీసా జపిస్తూ ముందుకు పోతున్న పరిస్థితుల్లో ఇదే తోవలో ఇతర పార్టీలు కూడా వెళ్తే ఇక దేశ రాజకీయాల్లో ఏం మిగులుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. మరోవైపు, మతపరమైన భావోద్వేగాలకు తావులేని రాజకీయాలు తెరపైకి బలంగా వచ్చే సూచనలూ కన్పిస్తున్నాయి. ఇవన్నీ బీజేపీకి ముందు ముందు ఇబ్బందులు కలిగించే విషయాలే.
తెలంగాణ సీఎం కేసీఆర్ యజ్ఞాలు, యాగాలు చేశారు. వాటిలో ప్రజలను భాగస్వాములను చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు ప్రతీ సందర్భంలోనూ తనకున్న దైవభక్తిని లోకానికి చాటి చెప్పారు. యాదాద్రి నిర్మాణమూ ఇందుకు మంచి నిదర్శనం. యాదగిరిగుట్టలో ఒక అద్భుత మందిరాన్ని పునర్ నిర్మించారు. మరోపక్క వేములవాడ రాజన్న, భద్రాద్రి రామయ్య, కొండగట్టు అంజన్న దేవాలయాల పునరుద్ధరణకు కోట్లాది రూపాయలు కేటాయించి హైందవ సమాజం పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటి చెప్పారు. అందువల్లనే తెలంగాణలో ఎవరెన్ని చెప్పినా అభివృద్ధి…దైవభక్తి ఈ రెండింటికీ ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. దాంతోపాటు భారత రాజ్యంగ ఆత్మను పాలనలో, విధానాల్లో ప్రతిఫలించేలా చేశారు. కనుకనే తిరుగులేని నాయకునిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. రాజ్యంగం పౌరులకు ప్రసాదించిన అన్ని రకాల హక్కులను రక్షించే విధంగా తెలంగాణాలో పాలన సాగుతున్నది. అందుకే ఇక్కడ బీజేపీ భావోద్వేగాల ఎజెండా ప్రభావం చూపించలేని స్థాయికి చేరుకుంది.
ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపైనా, భారత రాజకీయాలపైనా ఉంటుందనే చర్చ కూడా జోరుగా సాగుతున్నది. మొదట తెలంగాణ విషయాన్నే తీసుకుంటే… ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావం ఇక్కడ ఉండదు. పక్క పక్కనే ఉన్నప్పటికీ కూడా అది సాధ్యం కాదు. ఇక్కడ కుల, మత ప్రాతిపాదికన రాజకీయాలు లేవు. ఉండవు. వాటికి స్థానం లేదు. పైగా ప్రజల మౌలిక సమస్యలను ఈ ప్రభుత్వం అడ్రస్ చేసింది. చేస్తున్నది. ప్రజాలోచనలకు దగ్గరగా ఇక్కడి పాలన ఉన్నది. కనుక ఆ ప్రభావం ఉండే అవకాశమే లేదు.
దక్షిణాదిలో బీజేపీ విస్తరణ కర్ణాటక ఫలితాలతో తేలిపోయింది. ఉత్తరాది పార్టీగా తనపై ఉన్న ముద్రను చెరిపేసుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద అడ్డుకట్ట పడినైట్లెంది. దక్షిణాదిలో ఉన్న ఒక్క రాష్ట్రం కూడా బీజేపీ ఖాతాలో నుంచి చేజారిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో రాష్ర్టాల్లో తాము విస్తరిస్తామని ఇన్నాళ్లు చాలా ఆశలు పెట్టుకున్నారు కమల నాథులు. అవన్నీ తలకిందులయ్యాయి. కర్ణాటకలో ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడ బీజేపీ చాలా కాలం నిలువ గలిగింది. కానీ, ఆ రాష్ట్రంలో కూడా ప్రజ లు ఆ పార్టీని, అది చేసే మతపరమైన రాజకీయాల్ని అర్థం చేసుకొని దూరం పెట్టారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే, కర్ణాటక ఎన్నికల్ని ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలుగా బీజేపీ తీసుకోలేదు.
ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, నడ్డా లాంటి నాయకులు కర్ణాటకలో పదుల సంఖ్యలో సభలు నిర్వహించారు. మోదీ భావోద్వేగపు ఉపన్యాసాలిచ్చారు. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామన్న కాంగ్రెస్ ప్రకటనను బలంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. హానుమాన్ చాలీసా చదివారు. దీన్నో ఉద్యమంగా దేశంవ్యాప్తం చేస్తామని చెప్పారు. ఈ విధంగా ఒక రాష్ర్టానికి పరిమితం కావాల్సిన ఎన్నికలకు బీజేపీ వాళ్లే దేశవ్యాప్త స్థాయి ఇచ్చారు. కాబట్టి, దాని ఫలితాన్ని కూడా ఆ పార్టీనే అనుభవించాల్సి ఉంటుంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనైనా బీజేపీ మారుతుందా? తన మత రాజకీయాలను, ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను వదిలిపెడుతుందా? ఇకనైనా రాజ్యంగం పరిధిలో వ్యవహరిస్తుందా? ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ఆలోచిస్తుందా? ఎజెండాను మార్చుకుంటుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీ ఆ పని చేయకపోతే భారతదేశం చూస్తూ కూర్చోదు. 75 ఏండ్ల ప్రస్థానంలో అనేక పరిణామాలను ఈ దేశం చూసింది. ఇందిర వంటి నియంతలనే ఓడించి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునఃప్రతిష్టించుకున్న చరిత్ర ఈ దేశానికి ఉంది. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో, బీజేపీ యేతర పక్షాలు కూడా ప్రజల ఎజెండానే ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలి. ప్రజల సమస్యల పరిష్కారానికి పని చేసే పార్టీలను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు. చరిత్ర దానిని అనేకమార్లు రుజువు చేసింది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-అస్కాని మారుతీ సాగర్
90107 56666