భారత రాజ్యాంగం ద్వారా సమానతను సాధించే దిశగా దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థ ముందుకు సాగాలని అంబేద్కర్ చెప్పారు. రాజ్యాంగం మౌలిక లక్ష్యం కూడా అదే. మనది సామ్యవాద, లౌకిక, గణతంత్ర ప్రజాస్వామ్య దేశం. ‘భారత దేశం’ అంటేనే రాష్ర్టాల సమాహారం. రాష్ర్టాల సమ్మేళనమే కేంద్ర ప్రభుత్వం. రాష్ర్టాల పరిధులు, అధికారాలను కాలరాసి కేంద్రమే పెత్తనం చేయాలనే ధోరణితో వ్యవహరించటం, అధికారాలన్నింటినీ కేంద్రానికి దఖలు పరచాలనుకోవడం రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకం.
ఒక తాత్విక, సైద్ధాంతిక దృక్పథంతోనే అధికారం మరింత వికేంద్రీకరించబడాలని ఒక రాష్ట్రంగా తెలంగాణ భావిస్తున్నది, ఆకాంక్షిస్తున్నది. మన రాజ్యాంగం కూడా ఇదే చెప్తున్నది. కాలక్రమంలో ప్రజాస్వామ్య పరిణతి పెరిగేకొద్దీ, ప్రజాస్వామ్యంలో మన ప్రయాణం సాగేకొద్దీ వ్యవస్థలు బలపడి, వ్యక్తుల పాత్ర సన్నగిల్లి వ్యవస్థలే జవాబుదారీగా ఉండి పౌరులకు ఉత్తమమైన సేవలందేలా అధికారం ఉండాలి. కానీ మొత్తం అధికారాన్ని కేంద్రం తన చేతిలో పెట్టుకొని, వ్యవస్థలను నీరుగార్చి, రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశాలనే ప్రస్థావించారు, ప్రశ్నించారు. రాజ్యాంగంలో రావాల్సిన మార్పులపై ఈ కోణంలో చర్చ జరగాలన్నారు. దీనికి అభ్యంతరాలు ఎందుకు?
రాజ్యాంగం మొత్తం మంచిగుంటే, ఇప్పటి దాకా 105 సార్లు మన రాజ్యాంగాన్ని ఎందుకు సవరించారు? 2000 ఫిబ్రవరి 22న జస్టిస్ వెంకటాచలయ్య సారథ్యంలో అప్పటి వాజపేయి ప్రభుత్వం రాజ్యాంగ సమీక్షకు కమిషన్ వేసింది వాస్తవం కాదా? 2002 మార్చి 31న ఈ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత, అప్పటి ఎన్డీయే ప్రభుత్వానికి మెజారిటీ లేక దాన్ని పార్లమెంటు ముందుంచకపోవడం వాస్తవం కాదా? పార్లమెంటు ఆమోదం లేకుండానే రాజ్యాంగ సమీక్షకు కమిషన్ వేసింది వాస్తవం కాదా?
వ్యవసాయ చట్టాలు రద్దుచేస్తూ.. ప్రధాని మోదీ హామీ ఇచ్చినవిధంగా, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించేందుకు ఏ చర్యలు తీసుకోలేదు. తాజా బడ్జెట్లో ఎటువంటి హామీ లేదు. పంట ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి గానీ, ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు గానీ ఎలాంటి సహకారం, ప్రోత్సాహం ఈ బడ్జెట్లో లేకపోవటం వాస్తవం కాదా! జనాభాలో సుమారు 60 శాతం ఆధారపడిన వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు గతేడాది కన్నా తగ్గించి 3.36 శాతానికి పరిమితం చేయడం బాధ్యతారాహిత్యమే.
మన దేశంలో సహజ వనరులున్నాయి. కానీ కేంద్రంలో ఇప్పటివరకు పాలించిన పాలకులకు వాటిని ఎలా వినియోగించుకోవాలో అవగాహన లేదు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనంతంగా అందుబాటులో ఉన్నా, అందిపుచ్చుకోలేని పరిస్థితి దేన్ని సూచిస్తున్నది? 75 ఏండ్లుగా కేంద్ర పాలకుల నిర్వాకమే నేటి సకల రుగ్మతలు, సమస్యలు.
‘నూరు పూలు వికసించనీ, వేయి ఆలోచనలు సంఘర్షించనీ..’ అనే రీతిలో స్వేచ్చగా మనగలిగినప్పుడే, ఆలోచనల సంగ్రహానికి, అభిప్రాయాల సంవాదానికి చోటు ఉంటుంది. ఆలోచనలను సైతం నియంత్రించే వ్యవస్థలో స్వతంత్రం గా ఆలోచించడం ఒక సాహసం. మానవ ఊహలను, కల్పనాశక్తిని, సృజనాత్మక ఆవిష్కరణలను అసహనంతో అడ్డుకునే ధూర్తత్వం చలామణి అయ్యే వ్యవస్థలో ఆలోచనా స్వేచ్ఛ ఓ అసిధార వ్రతం.
దేశంలో ఉన్న సమస్త ప్రజలకు, యువతకు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా రాజ్యాంగాన్ని పునర్నిర్వచించుకునే ఆవశ్యకత ఉందన్నారు కేసీఆర్. ఇప్పటికీ కరెంటు, తాగునీరు, రహదారులు, మౌలిక వసతులు లేని స్థితి ఉన్నది. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకొని ఈ దేశ దశ, దిశ మారేలా ముందుకు పురోగమించాలన్నది ఆయన ఆకాంక్ష. ఆ దిశగా చర్చ జరగాలి. అభిప్రాయాల వెల్లడే నేరమన్నట్లు భావించడం, వితండ వాదనలు చేయడం మధ్యయుగాల ఆలోచన.
వ్యవస్థీకృత విలువల్ని ప్రశ్నించే క్రమంలోనే మానవ సమా జం పురోగమించింది. తార్కికశక్తికి బలం చేకూరింది. మరో ఆలోచనకు తావివ్వకపోతే మానవ వికాసం సాధ్యపడేనా! అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఇది.
(వ్యాసకర్త: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి)