e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home News subhash chandra bose love story| గుండెల నిండా ప్రేమ‌.. అంత‌కు మించిన‌ త్యాగాలు.. క‌ళ్లు చెమ‌ర్చే గాథ‌

subhash chandra bose love story| గుండెల నిండా ప్రేమ‌.. అంత‌కు మించిన‌ త్యాగాలు.. క‌ళ్లు చెమ‌ర్చే గాథ‌

Independence day special | నేతాజీ పేరు చెప్ప‌గానే ఒక గంభీర‌మైన రూపం క‌ళ్ల ముందు మెద‌లాడుతుంది. స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటాన్ని ఎంచుకుని, యువ‌త‌ను స్వ‌రాజ్య పోరాటం వైపు తీసుకెళ్లిన‌ ఒక వీరుడు గుర్తొస్తాడు. సుభాష్ చంద్ర‌బోస్ జీవితంలో స్వ‌తంత్ర పోరాటం, ఆంగ్లేయులకు దొర‌క్కుండా ఉండేందుకు ఒక చోట నుంచి మ‌రోచోట‌కి పారిపోవ‌డం మాత్ర‌మే ఉన్నాయ‌ని చాలామందికి తెలుసు.కానీ ఆయ‌న‌లో మ‌రో కోణం ఉంది. బ‌య‌ట‌కు క‌టువుగా క‌నిపించే ఆయ‌న జీవితంలో రొమాంటిక్‌, ఎమోష‌న‌ల్ యాంగిల్ ఉంది.

అది 1934. శాస‌నోల్లంఘ‌నోద్య‌మం తీవ్ర‌రూపం దాల్చింది. ఆ స‌మ‌యంలో ఉద్య‌మంలో పాల్గొంటూ సుభాష్ చంద్ర‌బోస్ జైలు పాల‌య్యాడు. అక్క‌డ ఆయ‌న ఆరోగ్యం క్ర‌మంగా క్షీణించింది. దీంతో బ్రిటీష్ ప్ర‌భుత్వం చికిత్స నిమిత్తం ఆయ‌న్ను యూర‌ప్‌లోని ఆస్ట్రియా రాజ‌ధాని వియ‌న్నాకు పంపించింది. అక్క‌డ చికిత్స పొందుతూనే యూర‌ప్‌లో ఉన్న భార‌తీయ విద్యార్థుల‌ను ఏకం చేసి.. వారు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనేలా చేయాల‌ని బోస్ భావించారు. ఇందుకోసం ది ఇండియ‌న్ స్ట్ర‌గుల్ అని పుస్త‌కం రాయాల‌ని ఒక యూరోపియ‌న్ ప‌బ్లిష‌ర్ నేతాజీని కోరారు. దీంతో బోస్‌కు ఇంగ్లీష్ తెలిసిన‌, టైపింగ్ వ‌చ్చిన ఒక అసిస్టెంట్ అవ‌స‌రం ఏర్ప‌డింది. టైపిస్ట్ కోసం బోస్ స్నేహితుడైన డాక్ట‌ర్ మాథూర్ ఆయ‌న‌కు ఇద్ద‌రి పేర్ల‌ను సూచించారు. వారిలో ఒక‌రు ఎమిలీ షెంకెల్‌. ఆమెనే బోస్ త‌న స‌హాయ‌కురాలిగా నియ‌మించుకున్నారు. అప్ప‌టివ‌ర‌కు బోస్ ఆలోచ‌న‌ల‌న్నీ స్వాతంత్య్రోద్య‌మంపైనే నిమ‌గ‌న్న‌మై ఉండేవి. కానీ ఎమిలీ ప‌రిచ‌యం త‌న జీవితంలో పెద్ద తుఫాను తీసుకొస్తుంద‌ని ఆయ‌న ఊహించ‌లేదు. ఎమిలీ క‌ల‌వ‌డంతో బోస్ జీవిత‌మే మారిపోయింద‌ని.. సుభాష్ చంద్ర‌బోస్ సోద‌రుడు శ‌ర‌త్ చంద్ర‌బోస్ మ‌నుమ‌డైన సుగ‌త్ బోస్ రాసిన పుస్త‌కంలో పేర్కొన్నారు.

- Advertisement -

ఎమిలీ 1910 జ‌న‌వ‌రి 26న ఆస్ట్రియాలోని క్యాథ‌లిక్ కుటుంబంలో జ‌న్మించింది. ఆమె తండ్రి ఓ ప‌శు వైద్యుడు. త‌న కూతురు ఒక భార‌తీయుని వ‌ద్ద ప‌నిచేయ‌డం ఆయ‌న‌కు ఇష్టం లేదు. కానీ బోస్ త‌న మాట‌లు, మంచిత‌నంతో ఎమిలీ కుటుంబానికి ద‌గ్గ‌ర‌య్యాడు. దీంతో 1934 జూన్ నుంచి ఎమిలీ.. బోస్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ప్రారంభించారు. ఆ స‌మ‌యంలో ఎమిలీ చురుకుద‌నం, ప‌నిత‌నం, ముక్కుసూటిత‌నానికి బోస్ ముగ్ధుడ‌య్యాడు. దీంతో ఆమెను బెంగాలీ భాష‌లో బ‌ఘిని ( ఆడపులి ) అని ముద్దుగా పిలిచేవాడు. ఈ ప్ర‌యాణంలో బోస్ మ‌నసులో ప్రేమ చిగురించింది. బోస్ అంటే ఎమిలీకి కూడా ఇష్టం ఏర్ప‌డింది. అయితే ప్రేమ విష‌యాన్ని మాత్రం ముందుగా బోస్‌నే వ్య‌క్త‌ప‌రిచాడు. అప్ప‌టికి ఆమె వ‌య‌సు 23 ఏండ్లు. చంద్ర‌బోస్ వ‌య‌సు 34 ఏండ్లు.

ఎమిలీకి సుభాష్ చంద్ర‌బోస్ త‌న ప్రేమను వ్య‌క్త‌ప‌రిచిన విధానం కూడా చాలా గొప్ప‌గా ఉంది. ‘‘ ఇప్ప‌టివ‌ర‌కు నేను నా దేశాన్ని మాత్ర‌మే ప్రేమించాను. నా దేశంపై నాకు ఎంత ప్రేమ ఉందో నీపై కూడా అంతే ప్రేమ ఉంది. కానీ నా దేశం త‌ర్వాతే నాకు ఎవ‌రైనా.. నా దేశం కోసం చేసే స్వాతంత్య్ర పోరాట‌మే నాకు మొద‌టి భార్య‌. ఆ త‌ర్వాత స్థానం నీదే అని’’ ఎమిలీకి బోస్ త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచాడు. ఈ విష‌యాన్ని ఎమిలీ సుగత్ బోస్‌కు చెప్పుకొచ్చారు.

1934-36 మధ్య‌కాలంలో తన ఉనికి బయటపడకుండా ఉండటానికి, సైనిక పోరాటంలో యూరోపియన్ దేశాల సహాయాన్ని తీసుకోవడానికి బోస్ నిరంతరం ఒక చోట నుంచి మ‌రోచోటికి వెళ్లేవాడు. ఆ స‌మయంలో ఎమిలీపై త‌న‌కు ఎంత ప్రేమ ఉండేదో త‌న లేఖ‌ల రూపంలో తెలిపేవాడు. 1936 మార్చి 5న రాసిన ఈ లేఖలో.. ‘‘ స‌మ‌యం వ‌స్తే మంచు కూడా క‌రుగుతుంది. ప్ర‌స్తుతం నా హృద‌యం ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. నిన్ను ఎంత‌గా ప్రేమిస్తున్నానో రాయకుండా, చెప్ప‌కుండా న‌న్ను నేను ఆపుకోలేక‌పోతున్నా. మై డార్లింగ్‌.. నువ్వు నా హృద‌య సామ్రాజ్ఞివి. కానీ నువ్వు న‌న్ను ప్రేమిస్తున్నావా. భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో నాకు తెలియ‌దు. బ‌హుశా జీవితాంతం జైలులో బందీగా గ‌డ‌పాల్సి రావ‌చ్చు. న‌న్ను కాల్చి చంపొచ్చు లేదా ఉరితీయొచ్చు. నేను మ‌ళ్లీ నిన్ను చూడ‌లేక‌పోవ‌చ్చు. కానీ నువ్వెప్పుడూ నా హృద‌యంలో ఉంటావు. మ‌నం ఈ జీవితంలో క‌లిసి ఉండ‌లేక‌పోతే వ‌చ్చే జ‌న్మ‌లోనైనా క‌లిసి ఉందాం’’ అంటూ పేర్కొన్నారు. ఆ త‌ర్వాత భార‌త్‌కు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఎమిలీకి చాలా లేఖ‌లు రాశాడు.

బోస్ ఆలోచ‌న‌లు ఎప్పుడూ దేశ స్వాతంత్య్రం మీదే కేంద్రీకృత‌మై ఉండేవి.. అలాంటి స‌మ‌యంలోనూ ఆయ‌న ఎమిలీని త‌ల‌చుకుంటూనే ఉండేవాడు. 1937 ఏప్రిల్‌లో ఎమిలీకి ఆయ‌న రాసిన లేఖ‌నే అందుకు నిద‌ర్శ‌నం. ‘‘ నీ గురించి త‌ల‌చుకోకుండా ఒక్క‌రోజు కూడా గ‌డ‌వ‌దు. నువ్వు ఎల్ల‌ప్పుడూ నాతోనే ఉన్నావు. నువ్వు కాకుండా నేను ఇత‌రుల గురించి ఆలోచించ‌లేక‌పోతున్నా. ఇన్ని రోజుల్లో నేనెంత ఒంట‌రిగా, దిగులుగా ఉన్నానో నీకు చెప్ప‌లేను. కేవ‌లం ఒక్క విష‌యం మాత్ర‌మే న‌న్ను సంతోషంగా ఉంచుతోంది. అది నీ మీద ఉన్న ప్రేమ‌. రాత్రీప‌గ‌లూ నేను దాని గురించే ఆలోచిస్తున్నా.నాకు స‌రైన దారి చూపించాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ని ప్రార్థిస్తున్నా.’’ ఆ లేఖ‌లో రాశాడు. ఇలా ఎమిలీకి బోస్ దాదాపు 165 లేఖ‌లు రాశాడు. కానీ ఈ విష‌యం 1993 వ‌ర‌కు ఎవ్వ‌రికీ తెలియ‌దు. ఎమిలీ స్వ‌యంగా సుగ‌తా బోస్‌కు ఈ లేఖ‌లు ఇవ్వ‌డంతో బోస్ ప్రేమ విష‌యం తొలిసారి వెలుగులోకి వ‌చ్చింది.

ఒక‌రినొక‌రు ఇంత గాఢంగా ప్రేమించుకున్న బోస్‌, ఎమిలీ క‌లిసి ఉన్న‌ది మాత్రం త‌క్కువ రోజులే. 1937 డిసెంబ‌ర్ 27న ఆస్ట్రియాలోని బాడ్‌గ‌స్టైన్‌లో ర‌హ‌స్యంగా వీరి వివాహం జ‌రిగింది. 1942 న‌వంబ‌ర్ 29న వీరికి ఒక కూతురు పుట్టింది. త‌న కూతుర్ని చూసేందుకు బోస్ 1942 డిసెంబ‌ర్‌లో వియ‌న్నా వెళ్లారు. కూతురికి అనిత అని పేరు పెట్టారు. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి ఒక మిష‌న్ మీద వెళ్లిన బోస్‌.. ఆ త‌ర్వాత ఎప్పుడూ ఎమిలీ, అనిత‌ల‌ను క‌లుసుకోలేదు. కానీ ఎమిలీ మాత్రం త‌న తుదిశ్వాస వ‌ర‌కు సుభాష్ చంద్ర‌బోస్ జ్ఞాప‌కాల‌తోనే జీవించింది. 31 ఏండ్ల‌కే భ‌ర్త‌ను కోల్పోయినా ఆయ‌న మీద ఉన్న ప్రేమ‌, ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి చివ‌రి వ‌ర‌కు గోప్యంగానే ఉంది. భ‌ర్త‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం 1993 వ‌ర‌కు త‌మ ప్రేమ‌, పెళ్లి గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి చెప్పనేలేదు. ఎన్ని క‌ష్టాలు ఎదురైనా ఆమె బోస్ కుటుంబం నుంచి స‌హాయాన్ని తీసుకోవ‌డానికి నిరాక‌రించారు. ఓ చిన్న పోస్టాఫీసులో ప‌నిచేస్తూనే బోస్ గుర్తుగా మిగిలిన అనితా బోస్‌ను పెంచి పెద్ద చేసింది ఎమిలీ. జ‌ర్మ‌నీలో పెద్ద ఆర్థిక‌వేత్త‌గా తీర్చిదిద్దింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

1947 ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర వేడుక‌ల్లో గాంధీజీ ఎందుకు పాల్గొన‌లేదు?

1947 నుంచి ప్రతి రోజు ఎగురుతున్న జాతీయ జెండా

Independence day Celebrations | మువ్వ‌న్నెల మురిపాలు

జాతీయ జెండా ఏర్పాటులో అపశృతి.. క్రేన్‌ ట్రాలీ విరిగి ముగ్గురు మృతి

భ‌ర్త‌కు గుడిక‌ట్టి నిత్య పూజ‌లు.. ప‌తిభ‌క్తి చాటుకుంటున్న మ‌హిళ‌..!

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement