‘పండుగ అని కూడా లేదు. ఎప్పుడూ నట్టింట్లో నిద్రపోవడమేనా?’ మిట్ట మధ్యాహ్నం సోఫాలో పడుకున్న నిశితతో కోపంగా అన్నాడు మిథేశ్. ‘నిద్రాదేవి రమ్మన్నప్పుడు రాదు. వచ్చినప్పుడే పడుకోవాలి’ అని కసిరింది నిశిత. ‘ఈ మధ్య నీ వ్యవహారం ఏమీ బాలేదు’ కరుగ్గా అన్నాడు మిథేశ్. ‘నేనేం చేశా?’ విసుగ్గా అంది నిశిత. ‘సాయంత్రం మీ అమ్మవాళ్ల ఇంటికి వెళ్లి.. అక్కడే దీనిపై మాట్లాడదాం’ అంటూ రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకొన్నాడు మిథేశ్.
గంట గడిచింది… మిథేశ్ గదిలోంచి వణుకుతూ బయటికి వచ్చిన వంట మనిషి రాము మెట్లు దిగుతూ.. ‘అమ్మగారూ.. మన మిథేశ్ బాబును ఎవరో చంపేశారు’ అంటూ కేకేశాడు. దీంతో మిగతా ఇద్దరు పనివాళ్లు పరుగెత్తుకొచ్చారు. రాము అరుపులకు వెంటనే నిద్ర మేల్కొన్న నిశిత.. గదిలోకి పరిగెత్తింది. రక్తపు మడుగులో మిథేశ్ పడి ఉన్నాడు. అది చూసి హతాశురాలైంది నిశిత. అరగంటలో క్రైమ్ స్పాట్‌కు రుద్ర అండ్ టీమ్ చేరుకున్నారు. ఏం జరిగిందంటూ అందర్నీ ప్రశ్నించడం మొదలుపెట్టారు.
‘ఇంట్లో మొత్తం ఎంతమంది?’ నిశితను ప్రశ్నించాడు రుద్ర. ‘మిథేశ్, నేను ఇంకో ముగ్గురు పనివాళ్లు’ సమాధానం ఇచ్చింది. ‘ఇద్దరికి ముగ్గురు పనివాళ్లా?’ ఆశ్చర్యపోయాడు హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి. ‘మా ఇల్లు చాలా పెద్దది సార్. ఇద్దరం ఉద్యోగులమే! ఇంటిని చక్కబెట్టేవాళ్లు, వంట చేసేవాళ్లు.. ఇలా ఉండాలిగా’ బదులిచ్చింది నిశిత. ‘ముందుగా హత్యను ఎవరు చూశారు?’ అడిగాడు రుద్ర. రాము వైపు చేయి చూపించింది నిశిత. ‘నీ పేరేంటి?’ ప్రశ్నించాడు రుద్ర. ‘రాము సార్!’ అన్నాడు.. ‘ఏం చేస్తావ్?’ మళ్లీ ప్రశ్నించాడు రుద్ర. ‘వంటవాణ్ని సార్’ అన్నాడు. ‘హత్య జరిగిన సమయంలో ఏం చేస్తున్నావ్?’ అని ప్రశ్నించాడు. ‘సార్‌కు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి గదిలోకి తీసుకెళ్లా సార్.. ఇంతలో ఆయన రక్తపు మడుగులో ఉండటం చూసి భయపడిపోయా. వెంటనే కిందికి వచ్చి అమ్మగారికి చెప్పా’ వణికిపోతూనే చెబుతూ ఒక్కసారిగా స్పృహకోల్పోయాడు రాము. వెంటనే అతణ్ని పక్కకు తీసుకెళ్లిన సిబ్బంది.. కాస్త మజ్జిగ అందించారు.
మిథేశ్ సిటీలో ఓ పాపులర్ ఆంత్రప్రెన్యూర్ కావడంతో హత్య విషయం దుమారం రేపింది. మిథేశ్ ఇంటి చుట్టూ మీడియా ప్రతినిధులు గుమిగూడారు. అక్కడ అంతా గందరగోళంగా ఉంది. ఇదే సమయంలో అక్కడే ఉన్న పనివాళ్లు రుద్ర దగ్గరికి వచ్చారు. ‘సార్.. మేం ఇంటికి వెళ్తాం’ అన్నారు. ‘ఎందుకు.. అంత అర్జెంట్??’ ప్రశ్నించాడు రుద్ర. ఇద్దరూ మిన్నకుండిపోయారు. ఇంటికి వెళ్త్తామన్న ఇద్దరు పనివాళ్లు దంపతులు. భర్త సుబ్బయ్య తోటమాలిగా పనిచేస్తే.. భార్య శాంతమ్మ ఇంటిని చక్కబెడుతుంది.
‘మేడమ్.. మీ భర్త హత్య జరిగిన సమయం సుమారు ఒంటిగంట. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు?’ నిశితను అడిగాడు రుద్ర. ‘మధ్యాహ్నం నాకు నిద్రపోవడం అలవాటు. దీంతో నేను హాల్లో పడుకొన్నాను. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికొచ్చిన మిథేశ్.. నాతో ఇదే విషయమై చిన్న గొడవపడ్డాడు. తర్వాత రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. ఇలాంటి గొడవలు మాకు ఎప్పుడూ ఉండేవే. దీంతో నేనూ పడుకొన్నాను. గంట-గంటన్నర తర్వాత రాము పరుగెత్తుకొంటూ వచ్చి నన్ను నిద్రలేపాడు. అయ్యగారు చనిపోయారంటూ బోరుమన్నాడ’ని చెప్తూపోయింది నిశిత.
‘మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా?’ అని రుద్ర అడిగిన ప్రశ్నకు లేరంటూ తలూపింది నిశిత. ‘పనివాళ్లు ఎంతకాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు?’ అడిగాడు. సుమారు ఐదేండ్లుగా అంటూ బదులిచ్చింది. వాళ్లను కూడా ఇంటరాగేషన్ చేయడానికి రుద్ర వెళ్తుండగా.. ‘సార్.. వాళ్ల మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఒంటిగంట సమయంలో శాంతమ్మ స్టోర్ రూమ్‌లో పాత సామాను సర్దుతున్నది. సుబ్బయ్య మొక్కల పని చూస్తున్నాడు’ చెప్పింది నిశిత. ‘మరి.. రాము?’ సూటిగా ప్రశ్నించాడు రుద్ర. ‘వాడు.. వంట వండుతున్నాడు’ బదులిచ్చింది. నిశిత చెప్పింది నిజమేనన్నట్టు పనివాళ్లు ఇద్దరు తలూపారు. ఇంతలో రాముకు మెలకువ వచ్చింది. హత్య జరిగిన సమయంలో ఏం చేస్తున్నావంటూ అప్పుడే లేచిన రామును రుద్ర ప్రశ్నించాడు. వంట చేస్తున్నట్టు బదులిచ్చాడు.
గదిలో ఎలాంటి క్లూస్ దొరకలేదని ఫోరెన్సిక్ టీమ్ చెప్పింది. ‘సార్.. ఇది హై ప్రొఫైల్ కేసు. త్వరగా సాల్వ్ చేయాలి’ అంటూ రామస్వామి అంటుండగానే.. ‘ఇది హైప్రొఫైల్ కేసు.. నిజమే బాబాయ్.. అయితే, లో ఐక్యూతో నేరస్తులు ఇంత త్వరగా దొరుకుతారని అనుకోలేదు’ అంటూ రుద్ర నవ్వాడు. ఏమీ అర్థం కాలేదన్నట్టు రామస్వామి విస్తుపోయాడు. ఇంతలో లేడీ కానిస్టేబుల్ నిశితను తమదైన శైలితో విచారించడంతో అసలు విషయాన్ని మొత్తం చెప్పేసింది. అంతకుముందే రాముకు కూడా ఇదే ట్రీట్మెంట్ ఇవ్వడంతో.. నిశిత, తాను కలిసే మిథేశ్ను హత్య చేసినట్టు ఒప్పేసుకొన్నాడు. ఇంతకీ, మిథేశ్ను నిశిత-రాము కలిసి హత్య చేశారని రుద్ర ఎలా కనిపెట్టినట్టు?
అది ఎవరు?
మిథేశ్ హత్య జరిగిన సమయం మధ్యాహ్నం ఒంటిగంట. ఆ సమయంలో ఎవరైనా లంచ్ చేస్తారు. అయితే, మిథేశ్కు బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వడానికి వెళ్లానని రాము అబద్ధం చెప్పి రుద్రకు అనుమానం కలిగించాడు. మరోవైపు, మిథేశ్ హత్య జరిగిన సమయంలో తాను పడుకొన్నానని, రాము వచ్చి పిలిస్తేనే తనకు మెలకువ వచ్చిందన్న నిశిత.. హత్య సమయంలో పనిమనుషులు ఎవరేం చేస్తున్నారో కరెక్ట్‌గా చెప్పింది. అంటే, ఆమె నిద్రపోవడం అబద్ధమని తేలింది. కాగా, భార్య-భర్తలైన పనివాళ్లు సుబ్బయ్యకు, శాంతమ్మకు అనుమానం రాకుండా రాము, నిశిత కలిసే ఈ హత్య చేశారని, రాముతో తనకున్న అక్రమ సంబంధాన్ని కనిపెట్టిన మిథేశ్ ఎక్కడ దాన్ని బయటపెడతాడోనన్న భయంతో నిశిత ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు విచారణలో తేలింది.