వందేమాతరం ఉద్భవించిన వంగభూమిలో.. ఆమె తల్లడిల్లుతున్నది. జనగణమన పుట్టినింట.. పుట్టెడు బాధను అనుభవిస్తున్నది. 77 ఏండ్ల స్వతంత్ర దేశాన్ని ఆ ఆవేదన అడుగుతున్న ప్రశ్న… ‘స్వతంత్రమా.. నీవెక్కడ?’ ‘ఆడపిల్ల అర్ధరాత్రి నడిచిన నాడే అసలైన స్వాతంత్య్రం సిద్ధించినట్టు’ అన్న బాపూ ఆకాంక్షను సవాలు చేస్తున్నది.
ఆర్జీకార్ వైద్య కళాశాలలో డాక్టర్‌పై జరిగిన హత్యాచారంపై ఈ వ్యవస్థను ప్రశ్నిస్తున్నది కోల్‌కతాకు చెందిన 29 ఏండ్ల రిమ్జిమ్ సిన్హా!
తన సమరానికి స్వతంత్ర దినోత్సవమే సరైన సమయం అని భావించింది. కచ్చితమైన జవాబు కోసం బ్రిటిష్ వాళ్లు భారతాన్ని విడిచి వెళ్లిన ఆగస్టు 14 అర్ధరాత్రి (పంద్రాగస్టు) నడి వీధిలోకి రావాలని పిలుపునిచ్చింది. కోల్‌కతా ఆర్జీకార్ వైద్య కళాశాలలో జరిగిన హత్యాచారంపై.. మువ్వన్నెలు రెపరెపలాడే వేళ యావత్ స్వతంత్ర భారతం స్పందించాలని డిమాండ్ చేసింది. ఎఫ్బీ వాల్స్‌పై నినదిస్తే సమాధానం రాదు. ఎక్స్ హ్యాండిల్ వైరల్ చేస్తే జవాబు దొరకదు. అందుకే, నడివీధికొస్తే అయినా.. పాలకుల్లో కదలిక వస్తుందని భావించింది సిన్హా. అదీ అర్ధరాత్రి రోడ్డు ఎక్కితేనే సరి అని నిర్ణయానికొచ్చింది.
ఎందుకింత నిరసన?
కోల్‌కతా హత్యాచారం ఉదంతంలో నేరస్తుడు పట్టుబడ్డాడు. కేసు సీబీఐకి అప్పగించారు. విచారణ కొనసాగుతున్నది. కోర్టు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది. అయినా ఎందుకీ పోరాటం? నేరస్తుణ్ని చట్టం గట్టిగా శిక్షిస్తుంది. కానీ, నేరం జరిగిన తర్వాత జరిగిన, జరుగుతున్న పరిణామాలకు బాధ్యులు ఎవరు?రిమ్జిమ్ పదేపదే గొంతు చించుకొని ఇదే సవాలు విసురుతున్నది.
జరిగిన దుస్సంఘటనపై పెదవి విరిచిన ఆర్జీకార్ వైద్యకళాశాల ప్రిన్సిపాల్ ‘అంత అర్ధరాత్రి.. ఆ ఆడకూతురు ఒంటరిగా సెమినార్ హాల్‌కు వెళ్లడం ఎందుకు?’ అన్న ప్రశ్నకు సమాధానాన్ని కోరుతున్నది రిమ్జిమ్ సిన్హా.‘పెందరాలే ఇంటికి చేరుకోక.. ఏమిటీ పెత్తనాలు’ అని నోరుపారేసుకున్న పురుష పుంగవుల మస్తిష్కాలను కడిగేయడానికి అర్ధరాత్రి నిరసనకు పిలుపునిచ్చింది. జరిగిన తప్పిదానికి బేషరతుగా క్షమాపణ చెప్పడానికి సాహసించని కొందరు.. ‘ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకండి.. గుంపులుగా ఉండండి.. వెలుతురు ఉన్నచోటే గడపండి..’ అని స్వతంత్ర దేశంలో మౌఖిక ఆంక్షలు విధించండం ఏంటని నిలదీయడానికి నిరసనకు పూనుకుంది.
సిన్హా పిలుపు సామాజిక మాధ్యమాల్లో జాతీయ గీతంలా మార్మోగింది. ఆమెతో ఎందరో గొంతు కలిపారు. అర్ధరాత్రి నిరసనలో భాగమయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ‘నేను నా వంతుగా నిరసన తెలపాలని భావించాను. అదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాను. ఆ క్షణం నుంచి నా ఫోన్‌కు తీరిక లేకుండా కాల్స్ వస్తూనే ఉన్నాయి. పదహారేండ్ల యువతులు కదం తొక్కుతామని చెబుతున్నారు. అరవై ఏండ్ల అమ్మలు కూడా ‘నీ వెంట మేమున్నాం’ అంటున్నారు’ అని చెప్పుకొచ్చింది సిన్హా.
సమాజంలో సింహభాగం ఆమె పక్షాన ప్రశ్నిస్తుంటే.. జవాబు చెప్పాల్సిన పదవిలో ఉన్న ఓ పురుష మంత్రి తన అల్పత్వాన్ని బయటపెట్టుకున్నాడు. ‘నిరసన సరే.. ఆడవాళ్లంతా రోడ్డెక్కుతున్నారు మంచిదే! కానీ, మిమ్మల్ని మీ మొగుళ్లు కొడితే మా పూచీ లేదు’ అని వ్యాఖ్యానించాడు.
జాతిపిత ఆకాంక్షను, పిలుపును తమ ఊకదంపుడు ప్రసంగాల్లో తరచూ ఉటంకించే నేతలు.. రిమ్జిమ్ సిన్హా అడిగిన ప్రశ్నకు బదులు చెప్పకపోవచ్చు. చెప్పే ధైర్యం ఈ జన్మకు వాళ్లకు రాకపోవచ్చు. కానీ, ఈ నిరసన మాత్రం స్వతంత్ర భారతాన్ని కొత్త పోరాటానికి సన్నద్ధం చేస్తుందేమో!
జై బోలో స్వతంత్ భారత్ కీ.. జై!!
‘భారతదేశం అంతా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో.. ఓ మహిళగా నేనూ నా స్వేచ్ఛను ఆస్వాదించాలని కోరుకుంటున్నా. బాధితుల పక్షాన నిలవకపోగా.. ఈ సమయంలోనూ లింగవివక్ష చూపుతున్న వారిని సవాలు చేయాలనేదే నా ప్రయత్నం. వివక్షకు గురవుతున్న అందరూ ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చాను. ఎందరో స్పందించారు. రాత్రంతా నిరసన కొనసాగించకపోవచ్చు. కానీ, మూడు నాలుగు గంటలైనా.. మా గళం వినిపిస్తాం’
– రిమ్జిమ్ సిన్హా