మునుగోడు : తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన విధంగానే మునుగోడు ఎన్నికల్లోనూ ఎన్ఆర్ఐలు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడం అభినందనీయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు తెలియజేస్తూ ఎన్ఆర్ఐలు ప్రచురించిన గోడపత్రికను రాష్ట్ర ఎఫ్.డీ.సీ చైర్మన్ అనిల్ కుర్మాచలం, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకుల సమక్షంలో మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ యూకే-లండన్ శాఖలు తెలంగాణాకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమాలు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచాయన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందన్నారు.
ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీకి దక్కేది మూడో స్థానమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూకే నాయకులు శానబోయిన రాజ్ కుమార్, వల్లాల శ్రీనివాస్, ప్రవీణ్, సుభాశ్, రావుల పృథ్వి, స్థానిక నాయకులు నరేశ్ గౌడ్, రమేశ్, కార్తీక్,రాజుగౌడ్ పాల్గొన్నారు.