Kuwait | కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో ఆదివారం (జనవరి 26న) 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇండియన్ ఎంబసీలో నిర్వహించిన ఈ వేడుకలకు కువైట్లోని భారతీయ కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి.
ఈ సందర్భంగా భారత రాయబారి డాక్టర్ H.E.ఆదర్శ్ స్వైకా ఆదివారం ఉదయం 9:00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, భారత రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. అంతకుముందు రాయబార కార్యాలయం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భారత దేశం , కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని ఈ సందర్భంగా రాయబారి డాక్టర్ H.E.ఆదర్శ్ స్వైకా గుర్తుచేశారు. కువైట్లో నివసిస్తున్న భారతీయ పౌరులకు రాయబార కార్యాలయం అన్ని వేళలా సహాయాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. భారతీయులకు సహాయం అందించడానికి రాయబార కార్యాలయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ” మీ సహాయం కోసం మా వద్ద 24 గంటల వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. మీ పరిష్కారం కాని ఏవైనా సమస్యలను వినడానికి మా వారపు బహిరంగ సభలో ( Open House )నేను వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటాను” అని రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా చెప్పారు. భారతీయ పౌరులందరూ ఈ దేశ నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటన ఇండో-కువైట్ సంబంధాన్ని మరింత పెంచిందని రాయబారి డాక్టర్ H.E.ఆదర్శ్ స్వైకా తెలిపారు. అనంతరం భారతీయ కమ్యూనిటీ సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కువైట్లోని వివిధ వార్తాపత్రికలు ప్రత్యేక అనుబంధాలను విడుదల చేశాయి. ఎంబసీ ప్రాంగణంలో ఉచిత కాపీలను పంపిణీ చేశాయి.