ప్రముఖ రచయిత్రి, శ్రీ సాంస్కృతిక కళాసారథి-సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక సభ్యురాలు రాధిక మంగిపూడి సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికిగాను వివిధ రంగాలలో ప్రసిద్ధిగాంచిన 48 మందిని ఎంపిక చేయగా, వారిలో హాస్య రచనల విభాగంలో రాధిక ఎంపికయ్యారు. రాధిక మంగిపూడి 2016 లో సింగపూర్లో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించి ఇప్పటివరకు 3 కథా సంపుటులు, 2 కవితా సంపుటలు, 2 పద్య శతకాలు, ఒక వ్యాస సంపుటి రచించారు.
ఆగస్టు 16వ తేదీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హ్యూస్టన్ మహానగరంలో జరిగిన “14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”కు ప్రధాన అతిథులలో ఒకరిగా రాధిక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ తొలిసారి అమెరికా పర్యటనతో పాటు అంతటి ప్రతిష్టాత్మక వేదికపై తాను ప్రసంగించడం, తన 8వ పుస్తకం “కథ కంచికి” అనే నూతన కథా సంపుటి సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ చేతులమీదుగా ఆవిష్కరించబడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆ వెనువెంటనే తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారానికి ఎంపిక అవ్వడం ఇంకా ఆనందంగా ఉందని రాధిక తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాల కమిటీ సభ్యులకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
రాధిక ఈ పురస్కారం అందుకోబోవడం పట్ల శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ , ఇతర సభ్యులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు తెలుగు సంస్థల ప్రతినిధులు, డా. వంశీ రామరాజు వంటి భారత సాహితీ సాంస్కృతిక రంగ ప్రముఖులు, సాహిత్యకారులు, శ్రేయోభిలాషుల నుంచి రాధికకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ అధ్యక్షులు, అమెరికా హాస్యబ్రహ్మ వంగూరి చిట్టెన్ రాజు, తనకు 2011లో హాస్య రచన విభాగంలో వచ్చిన అదే కీర్తి పురస్కారం మళ్ళీ తమ సంస్థ అంతర్జాతీయ సమన్వయకర్త అయిన రాధిక అందుకోబోవడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలో హైదరాబాద్ లో పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య నిత్యానందరావు తెలియజేశారు.