Global BRS NRIs | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై జరుగుతున్న నిరాధార, రాజకీయ ప్రేరిత ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సమావేశాన్ని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ నేత మహేష్ బిగాల ఆధ్యర్యంలో జూమ్ (Zoom)ద్వారా నిర్వహించగా, వివిధ దేశాల నుంచి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్కాంల పేరుతో కాలయాపన..
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. కేసీఆర్ మేనిఫెస్టోలో పొందుపరచని అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. రైతుబంధు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలు కోట్లాది కుటుంబాల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చాయని తెలిపారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా దారి తప్పిందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన పాలకులు స్కాంల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం, గొర్రెల స్కామ్, ఫార్ములా–ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ అంటూ వరుసగా కేసులు పెట్టి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మహేష్ బిగాల ఆరోపించారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే నాయకత్వాన్ని రాజకీయ కక్షతో టార్గెట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఈ సమావేశంలో ఎన్ఆర్ఐలు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన కేటీఆర్, హరీశ్‌రావుపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం పూర్తిగా రాజకీయ ప్రేరిత చర్యగా వారు పేర్కొన్నారు.
ప్రతిపక్షాలను అణిచివేయడమే లక్ష్యంగా..
ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రతిపక్షాలను అణిచివేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎన్ఆర్ఐలు ఆందోళన వ్యక్తం చేశారు. పాలన వైఫల్యాలను దాచిపెట్టేందుకు కేసులు, విచారణలు, మీడియా ట్రయల్స్‌ను ఆయుధాలుగా వాడటం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారుతుందని మహేశ్ బిగాల హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఉద్యమ శక్తి అని ఈ సమావేశంలో వారు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి అభివృద్ధి వరకు ప్రతి దశలో బీఆర్ఎస్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని, ఆ చరిత్రను ఎవరూ తుడిచివేయలేరని వారంతా అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని, రాష్ట్ర భవిష్యత్తుపై జరుగుతున్న కుట్రలను ఎన్ఆర్ఐలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తారని ఈ సమావేశంలో నిర్ణయించారు.
బీఆర్ఎస్ కార్యక్రమాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు..
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే అంతర్జాతీయ స్థాయిలో కూడా గొంతెత్తుతామని స్పష్టం చేశారు. కేసులు, ఆరోపణలు, దుష్ప్రచారాల ద్వారా బీఆర్ఎస్ నాయకత్వాన్ని దెబ్బతీయాలన్న ప్రయత్నాలు ప్రజల తీర్పును మార్చలేవని ఎన్ఆర్ఐలు తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని గుర్తు చేశారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే సరైన సమాధానం చెబుతారని, ఓట్ల రూపంలో ఈ రాజకీయ కక్షకు గట్టి బుద్ధి చెప్పడం ఖాయమని గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐలు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐలు పార్టీ నాయకత్వానికి అండగా నిలుస్తూ, తెలంగాణ ప్రజల హక్కుల కోసం జరిగే పోరాటంలో భాగస్వాములుగా కొనసాగుతామని ఈ సమావేశం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.