NRI Support to KCR | 2001లో మొదలు పెట్టి.. 2014 తర్వాత తెలంగాణను బంగారు తెలంగాణగా చేస్తూ దేశంలో గుణాత్మక మార్పు తేవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తలిచారని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చడానికి తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ఎన్నారైలు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఆదివారం 52 దేశాల ప్రతినిధులతో జరిగిన బీఆర్ఎస్ తొలి ఎన్నారై సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్గా టీఆర్ఎస్ పేరు మార్పును ఎన్నారైల తరపున స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్కు ఎన్నారైల నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందన్నారు. అనిల్ కూర్మాచలానికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుత దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరం అన్న తీర్మానానికి 52 దేశాల ఎన్నారై ప్రతినిధులు మద్దతు తెలిపారు. కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యం అని మహేశ్ బిగాల చెప్పారు. సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ దేశ భవితవ్యాన్ని మార్చబోతున్నదని అన్నారు. బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో కేసీఆర్ అడుగు జాడల్లో ముందుకు వెళ్తామని చెప్పారు. వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలను ఏకం చేస్తామని, వారికి రాష్ట్రాభివృద్ధి ఎలా జరిగిందో వివరించి మద్దతు కూడగడతామని తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా మారిందని మహేశ్ బిగాల చెప్పారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ సేవలు దేశానికి అవసరం అని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. బీఆర్ఎస్కు మద్దతుగా సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం ఆమోదించిన సంగతి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం అని తెలిపారు. ఈ నెల 22న ఆస్ట్రేలియాలో పీవీ నర్సింహారావు తొలి విగ్రహాన్ని పెడుతున్నట్లు వెల్లడించారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికపై భవిష్యత్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. చెక్ రిపబ్లిక్, హంగేరీ బీఆర్ఎస్ టీమ్‌కు మహేశ్ బిగాల శుభాకాంక్షలు చెప్పారు.
త్వరలో జరిగే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం చెప్పారు. దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు. గుజరాత్ మోడల్ ఫెయిలైందని, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. లండన్‌లోని మిగతా రాష్ట్రాల ఎన్నారైలు కూడా కేసీఆర్‌కు తమ మద్దతు ఉంటుందని చెప్పారన్నారు. ప్రధానమంత్రి కావడం అనేదానికన్నా మంచి అజెండాతో ముందుకు వెళ్లాలన్నారు. అందరినీ కలుపుకుని ముందుకెళ్తామని తెలిపారు.
టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలంకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు న్యూజిలాండ్ ప్రతినిధి జగన్ వొదినాల అన్నారు. జాతీయ రాజకీయాల్లో మన తెలుగు వాడికి ఒక అవకాశం రావాలని పేర్కొన్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ వైపు దేశ ప్రజలంతా చూస్తున్నారన్నారు. న్యూజిలాండ్‌లోని మిగతా రాష్ట్రాల ఎన్నారై ప్రజల నుంచి కూడా సీఎం కేసీఆర్‌కు మద్దతు లభిస్తుందన్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందేమీ లేదని యూకే ప్రతినిధి అశోక్ వ్యాఖ్యానించారు. టీఎస్ ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలంకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తాము క్షేత్రస్థాయిలో పని చేసి బీఆర్ఎస్ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. డెన్మార్క్ టీం ప్రతినిధి శ్యామ్‌బాబు ఆకుల మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్కు మాదిరే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు.
కేంద్ర స్థాయిలో రాజకీయం చేస్తామంటే జాతీయ పార్టీలకు వణుకు వస్తున్నదని సౌతాఫ్రికా ప్రతినిధి నాగరాజు గుర్రాల చెప్పారు. దేశ రాజకీయాలు, చరిత్రలో దేశాన్ని బాగు చేయడానికి సీఎం కేసీఆర్ స్థాపించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో రాజకీయం చేయొచ్చు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి చేయొచ్చు. ఢిల్లీవోడు వచ్చి తెలంగాణలో రాజకీయం చేయొచ్చు. బీహార్ నుంచి వచ్చి చేయొచ్చు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చి రాజకీయం చేయొచ్చు. తెలంగాణోళ్లు కేంద్ర రాజకీయాల్లోకి వస్తామంటే జాతీయ పార్టీలకు వణుకు వస్తుందన్నారు. దేశ భవిష్యత్‌ను మార్చి అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ వస్తున్నారని, ఆయనకు ఎన్నారైలంతా ఏకమై మద్దతు ఇవ్వాలన్నారు.
కేసీఆర్ వంటి దూరదృష్టి గల నాయకుడు కావాలని ఒమన్ ప్రతినిధి మహిపాల్ అభిప్రాయ పడ్డారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అవసరం అని మహేశ్ బిగాల ప్రతిపాదించిన తీర్మానానికి మద్దతు తెలిపారు. తెలంగాణను అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా కేసీఆర్ అభివృద్ధి చేస్తారన్నారు. కువైట్ ప్రతినిధి అభిలాష మాట్లాడుతూ దేశంలోనే నంబర్‌వన్‌గా తెలంగాణ ఉందని, భారత్ కూడా అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలవాలని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశం తప్పక ముందుకు వెళుతుందన్నారు. .
మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని అంటున్నారని మలేషియా టీం ప్రతినిధి సందీప్ చెప్పారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశమంతా జరిగితే ఎంతో బాగుంటుందన్నారు. సీఎం కేసీఆర్ దానికి న్యాయం చేయగలరన్నారు. ఆయనకు ఎన్నారైలంతా మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి విజన్ ఉన్న నేత కావాలని బహ్రెయిన్ ప్రతినిధి సతీశ్ కుమార్ చెప్పారు. దేశంలో చక్రం తిప్పగల నాయకుడు కేసీఆరేనని, ఆయన వల్ల దేశ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
తెలంగాణలో సాధించిన అభివృద్ధి దేశమంతా కావాలని ఖతార్ టీం ప్రతినిధి శ్రీధర్ అబ్బగొని అన్నారు. దేశ అభివృద్ధి కోసం తమ మద్దతు ఉంటుందన్నారు. తాము దీన్ని ఒక టాస్క్‌లాగా తీసుకుని పని చేస్తామన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రతినిధి ఆకుల సురేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశం ముందుకు తీసుకెళ్తున్నారని, దీనివల్ల గల్ఫ్ వాళ్లకు న్యాయం జరుగుతుందన్నారు. తక్కువ టైంలో తెలంగాణకు ఎంతో గుర్తింపు వచ్చిందని చెప్పారు.
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వంటి నేతల జాబితాలో సీఎం కేసీఆర్ చేరతారని కెనడా టీం ప్రతినిధి కృష్ణ అన్నారు. దేశ జనాభాలో 45 శాతంగా ఉన్న యువతకు దిశా నిర్దేశం చేసే శక్తి కేసీఆర్‌కే సాధ్యం అని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను పీవీ నర్సింహారావు మార్చినట్లే సీఎం కేసీఆర్ కూడా దేశాన్ని మార్చాలని కోరుతున్నట్లు అన్నారు. కెనడాలో తమిళనాడు ప్రతినిధి భూభలం మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇంకా, చెక్ రిపబ్లిక్ ప్రతినిధి రాఘవ, హంగేరి డెలిగేట్ అభిలాష్, చైనా నుంచి రవీందర్ రెడ్డి, అమెరికా నుంచి నరసింహ, శివకుమార్ శర్మ, అరవింద్, ఆస్ట్రియా డెలిగేట్ రంగు మహేశ్ గౌడ్, పోలండ్ నుంచి సాయికిరణ్, స్వీడన్లో మహేందర్, సౌతాఫ్రికా నుంచి నరేందర్ రెడ్డి, అరవింద్, యూకే టీం ప్రతినిధి నవీన్, అట్లాంటా నుంచి నిరంజన్ పొద్దుటూరి, భాస్కర్ పిన్న, యూకే నుంచి సృజనరెడ్డి, నవీన్ భువనగిరి, చీక చంద్రశేఖర్, సత్య, అబ్దుల్ జాఫర్, టాంజానియా నుంచి నరసింహారెడ్డి, బహ్రెయిన్‌కు చెందిన బొలిశెట్టి వెంకటేశ్, కేఫ్‌టౌన్ నుంచి వీరేన గాండ్ల, డల్లాస్‌కు చెందిన శ్రీనివాస్ రవి, అమెరికా ప్రతినిధి వెంకట్, కువైట్ ప్రతినిధి సురేశ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలిపారు.