హైదరాబాద్: ఆస్ట్రేలియాలో తెలుగు ప్రజల ఆదరణ చూరగొన్న తొలి తెలుగు ప్రవాస పత్రిక ‘తెలుగు పలుకు’ నాలుగో వసంతంలోకి ప్రవేశించింది. పూర్తిగా భారతదేశం వెలుపల ముద్రితమవుతున్న మొదటి మాస పత్రిగా గుర్తింపు పొందిన తెలుగు పలుకు.. మూడేండ్ల క్రితం దసరా పండుగ రోజున ఆస్ట్రేలియాలోని తెలుగు పాఠకులను పలుకరించింది. తొలి ప్రతి విడుదలై సెప్టెంబర్ 29న మూడేండ్లు పూర్తిచేసుకున్నది. నాలుగో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చిన్నారుల కోసం ఆస్ట్రేలియా చందమామ అనే మాస పత్రికను కూడా ప్రారంభించింది. వార్షికోత్సవం సందర్భంగా పత్రిక వ్యవస్థాపక సంపాదకులు శ్రీనివాస్ గొలగాని శుభాకాంక్షలు తెలియజేశారు. పత్రిక మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.