Bahrain | కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు చేయడంలో విఫలమైందని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు ఫ్లకార్డులు పట్టుకుని విభిన్నంగా నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బాబ్ ఉల్ బహ్రెయిన్ మనామా, జూపెర్ టవర్, సెంట్రల్ బస్ స్టేషన్,అక్కర్ , మామీర్, మోహరాఖ్ ఏరియాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాధారపు సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏర్పడిన 100 రోజుల్లోనే 420 హామీలు అమలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన అలివికాని హామీలను నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టారని అన్నారు. మీరు పెట్టిన 100 రోజుల గడువు ముగిసి 420 రోజులు అయ్యిందని అన్నారు. తెలంగాణ మహిళలు, వృద్ధులు , వికలాంగులు, రైతన్నలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఆటో కార్మికులు 420 హామీలు ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూస్తున్నారని తెలిపారు.ఈ హామీల అమలుపై ప్రశ్నిస్తే నాయకులపై అక్రమంగా కేసులు పెట్ట నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా మీరిచ్చిన హామీలు అమలు చేసేదాకా వెంటబడుతూనే ఉంటామని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఇప్పటికైనా నాయకులపై అక్రమ కేసులు, నిర్బంధాలు ఆపి ప్రజలకు ప్రజాపాలన అందించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాధారపు సతీశ్‌కుమార్ సూచించారు. ఈ విధానం మారకపోతే రానున్న రోజుల్లో మీకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేశ్, జనరల్ సెక్రటరీ అన్నారం సుమన్, సెక్రటరీ చెన్నమనేని రాజేందర్, చిలుకూరి రాజలింగం, భరత్, నందు కుమార్ కూడా నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అలివికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.