Singapore |శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ దంపతులతో ఇష్టాగోష్టి, ఆత్మీయ అభినందన సమావేశం ఉత్సాహంగా జరిగింది. డిసెంబర్ 18వ తేదీన లిటిల్ ఇండియాలోని సరిగమ బిస్ట్రోలో జరిగిన పెద్ద సంఖ్యలో తెలుగు వారు పాల్గొన్నారు.
కౌముది మాసపత్రిక సంపాదకులు, కొన్నివందల పరిశోధనాధారిత “టాక్ షో”ల ప్రయోక్త కిరణ్ ప్రభ మాట్లాడుతూ.. సమయాభావం వల్ల ఒక్క 12 గంటలు మాత్రమే సింగపూర్‌లో గడిపే అవకాశం దొరికిందని తెలిపారు. వారం మధ్యలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పటికీ ఇంతమంది హాజరవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు, సుబ్బు వి పాలకుర్తికి ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 1300 టాక్ షోలను నిర్వహించామని, తెలిసినంతలో ఒక్క మన తెలుగు భాషలో తప్ప వేరే ఏ భాషలో కూడా ఇన్ని విభిన్న రంగాలను ఎంచుకుని రకరకాల సబ్జెక్ట్ లలో ఒక్క మనిషి ఇన్ని టాక్ షోలను చేసింది లేదని పేర్కొన్నారు. ఇదంతా ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, తెలుగు భాష మీద అభిమానంతో మాత్రమే చేస్తున్న కార్యక్రమం అని వివరించారు. తమ టాక్ షో లను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళే క్రమం ఎలా ఉంటుందో సోదాహరణలతో వివరించారు. ఎంతో మంది వింటున్న కార్యక్రమం కాబట్టి మాట్లాడే ప్రతి పదం నిజ నిర్ధారణతో, ఖచ్చితత్వం ఉండేలా చూసుకుంటానని వివరించారు.
కాంతి కిరణ్ మాట్లాడుతూ.. కౌముది పత్రిక ప్రారంభించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది అభిమానుల్ని తమకు అందిస్తుందని అస్సలు అనుకోలేదని అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తదుపరి వచ్చిన ఆహూతుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ దాదాపు 2 గంటల పాటు ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించారు.
సుబ్బు వి పాలకుర్తి సభా నిర్వహణ గావించిన ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ.. కిరణ్ ప్రభతో గత మూడు సంవత్సరాలుగా ఆన్లైన్ వేదికల ద్వారా పరిచయం ఉన్నప్పటికీ.. వారిని సింగపూర్‌లో ఇలా ఇష్టాగోష్టి కార్యక్రమంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కిరణ్ ప్రభను పరిచయం చేసిన తానా సాహిత్య సంఘం అధ్యక్షులు తోటకూర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే సింగపూర్‌లో సాహిత్య కార్యక్రమాలకు నాంది పలికిన వంగూరి చిట్టెన్ రాజుకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షులు జవహర్ చౌదరి, రంగా రవికుమార్, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్ వీరా, ధనుంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రామాంజనేయులు చామిరాజు, పాతూరి రాంబాబు, సునీల్ రామినేని, కోణాళి కాళీ కృష్ణ సహాయ సహకారాలు అందించారు. రాధాకృష్ణ గణేశ్న, సాంకేతిక సహకారం అందించారు. 30 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ విందు భోజన ఏర్పాట్లను సరిగమ బిస్ట్రో రెస్టారెంట్ వారు కేశాని దుర్గా ప్రసాద్, సురేంద్ర చేబ్రోలు, మోహన్ నూకల ఏర్పాటు చేశారు.