హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న రాజకీయ దురుద్దేశాలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని దక్షిణాఫ్రికా
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు. చరిత్రలో ఎన్నో కమిషన్లు రాజకీయ ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కమిషన్ల నివేదికలు ఏ ఒక్కటైనా న్యాయస్థానాల్లో నిలబడలేకపోయిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న డ్రామా కూడా అదే కోవకు చెందింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ల పేరుతో రోజూ ఒక కొత్త సీరియల్ వేసి ప్రజల దృష్టిని మళ్లించే పనిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని స్పష్టంగా తెలుస్తోందన్నారు.
ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. వారిని ఆదుకోవాలనే లక్ష్యమే లేదు. కేవలం కేసీఆర్ రాజకీయంగా వేధించాలనే అజెండాతో ముందుకెళ్తున్నారు. ఇది నైతికంగా తప్పు, ప్రజా వ్యతిరేకం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. అలాంటి నాయకుడిపై అసత్య ఆరోపణలు, బోగస్ కమిషన్లతో దాడులు చేయడం ఎంతో దురదృష్టకరం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ డ్రామాల్ని, దురుద్దేశాల్ని తిరస్కరించనున్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం తరపున, కేసీఆర్ నాయకత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.