జ్యూరిచ్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా బరిలో నిలిచిన మాగంటి సునీతకు (Sunitha Gopinath) ప్రవాస తెలంగాణ సమాజం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ (BRS Swetzerland) శాఖ అధ్యక్షులు శ్రీధర్ గందె తెలిపారు. దివంగత ప్రజా నాయకుడు, జూబ్లీహిల్స్ అభివృద్ధి ప్రదాత మాగంటి గోపీనాథ్ చూపిన మార్గంలో పయనిస్తూ, ఆయన ఆశయాలను నెరవేర్చగల సమర్థురాలు సునీత అని, ఆమె విజయం నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని చెప్పారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ మార్గదర్శనంలో మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో చేసిన సేవ అమోఘమని కొనియాడారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సంక్షేమం పట్ల ప్రస్తుత పాలకులకు చిత్తశుద్ధి కొరవడిందని విమర్శించారు. ఎన్నికల ముందు ‘ఆరు గ్యారెంటీల’ పేరుతో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి, నేడు వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలు పేద, మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భర్తను కోల్పోయిన ఒక మహిళ పట్ల సానుభూతి చూపకుండా, వ్యక్తిగత విమర్శలకు దిగడం విచారకరమని, రాజకీయాల్లో హుందాతనం పాటించాలని హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్ర సాధకులు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) దార్శనికత వల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనించిందని గుర్తుచేశారు. రైతు బంధు, దళిత బంధు, మిషన్ భగీరథ వంటి పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. ఆయన నాయకత్వంలోనే తెలంగాణ ఆత్మగౌరవం ఇనుమడించిందని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న ఆయన తపనే రాష్ట్రాన్ని దశాబ్ద కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టిందన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కూడా కేసీఆర్ మార్గనిర్దేశంలోనే జరిగిందని మరువకూడదని వెల్లడించారు. అదేవిధంగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంలో నిలిపారని ప్రశంసించారు. ఐటీ, పరిశ్రమలు, పురపాలన శాఖల మంత్రిగా ఆయన చేసిన కృషితో హైదరాబాద్‌కు అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తాయని, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.
మరోవైపు, ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన హరీశ్ రావు.. గత ప్రభుత్వంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖలను సమర్థవంతంగా నిర్వహించి, రాష్ట్ర సంక్షేమానికి వెన్నుదన్నుగా నిలిచారు. కేసీఆర్ దార్శనికత, కేటీఆర్ నాయకత్వ పటిమ, హరీశ్ రావు కార్యదక్షత అనే ఈ త్రిశక్తి నాయకత్వమే తెలంగాణకు స్వర్ణయుగాన్ని అందించిందని ఆయన అభివర్ణించారు.
ఈ నేపథ్యంలో, జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించిన బీఆర్ఎస్ పార్టీ వైపే నిలబడాలని శ్రీధర్ గందె విజ్ఞప్తి చేశారు. సునీత గెలుపు కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదని, అది మాగంటి గోపినాథ్ ఆశయాల గెలుపని, కేసీఆర్ నాయకత్వానికి దక్కే గౌరవమని అన్నారు. ఆమె విజయానికి మద్దతుగా, బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ తరపున ఆన్లైన్ ప్రచారం నిర్వహిస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, బీఆర్ఎస్ సాధించిన విజయాలను ప్రతి గడపకూ చేరవేస్తామని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో జూబ్లీహిల్స్‌లో కారు గుర్తు భారీ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.