స్విట్జర్లాండ్ : స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరం( Zurich) బతుకమ్మ సంబురాలతో పులకించిపోయింది. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చిన తెలుగు ఆడపడుచులు, మంగళహారతులు, బతుకమ్మ పాటల నడుమ ఈ వేడుకలు అత్యంత వైభవంగా కనులపండువగా జరిగాయి. స్విస్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో హిర్జెన్బాచ్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలు, వారి దశాబ్దకాల సాంస్కృతిక ప్రస్థానానికి దర్పణం పట్టాయి.
తెలంగాణ సంస్కృతికి జీవనాడిగా నిలిచే బతుకమ్మ పండుగను విదేశీ గడ్డపై జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. పట్టుచీరలలో మెరిసిపోయిన మహిళలు, యువతులు బతుకమ్మల చుట్టూ చేరి ఉత్సాహంగా ఆడిపాడారు. వారి జానపద గీతాలతో ఆ ప్రాంగణమంతా మార్మోగింది. ప్రకృతిని ఆరాధిస్తూ, భూమి, నీరు, మానవుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే ఈ పండుగ స్ఫూర్తిని స్విస్‌లో నివసిస్తున్న తెలుగువారు అద్భుతంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి నిర్వాహక బృందం సభ్యులు శ్రీధర్ గండే, కిషోర్ తాటికొండ, అనిల్ జాల, అల్లు కృష్ణ, పవన్ దుద్దిళ్లతో పాటు ఇతర స్వచ్ఛంద కార్యకర్తలు ఎంతగానో కృషి చేశారని స్విస్ తెలుగు సమాజం ప్రతినిధులు తెలిపారు. గత పదేళ్లుగా తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరువకుండా, భావితరాలకు వాటిని అందించాలన్న సత్సంకల్పంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని వారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఉత్సవాల ముగింపులో మహిళలు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకువెళ్లి సమీపంలోని జలవనరులలో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం స్విట్జర్లాండ్‌లోని తెలుగు వారి మధ్య ఐక్యతను పెంపొందించడమే కాకుండా, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. వేడుకలకు హాజరైన వారికి అందించిన తెలంగాణ పిండివంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.