లండన్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలని మోసం చేస్తుందని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో, ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనుమతించాలని ఎన్నారైల పక్షాన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు.
అత్యంత కీలకమైన ఈ బిల్లును ఆమోదిస్తే ప్రజలకు భరోసా లభిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని అడిగే అధికారం న్యాయ పరంగా పోరాడే శక్తి ఉంటుందని తెలియజేసారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ రోజులు ప్రజల్ని మోసం చేస్తూ ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా తప్పించుకోలేదని, అసెంబ్లీ స్పీకర్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సహకరించి ప్రజల పక్షాన నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే నాయకులు అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, సిక్కా చంద్రశేఖర్ గౌడ్, సత్యమూర్తి చిలుముల, హరి గౌడ్ నవపేట్, రవి ప్రదీప్ పులుసు పాల్గొన్నారు.