Warangal TIMS | వరంగల్‌లోని టిమ్స్ హాస్పిటల్‌కు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నత్‌నగర్ టిమ్స్ దవాకాన ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న అల్వాల్ టిమ్స్‌కు మాజీ సీఎం టి.అంజయ్య పేరు, ఎల్.బీ నగర్ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వరంగల్ సూపర్ స్పెషాలిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేర్లను పెట్టాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా, పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న సంకల్పంతో నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ టిమ్స్ హాస్పిటల్స్ నిర్మించారు. సనత్‌నగర్ ఛాతి దవాఖాన ప్రాంగణంలో అత్యాధునిక దవాఖానను నిర్మించాలని తలపెట్టిన నాటి సీఎం కేసీఆర్ 2022 ఏప్రిల్ 26న టిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇందుకు అవసరమైన నిధులు కేటాయించి వేగంగా నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో టిమ్స్ నిర్మాణం అనుకున్న దానికంటే ఆలస్యమైంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ చాలాకాలంపాటు టిమ్స్ నిర్మాణాలను పట్టించుకోలేదు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రశ్నించడంతో ఎట్టకేలకు మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ శంకుస్థాపన చేసి, నిర్మాణం ప్రారంభించిన టిమ్స్‌ను ఇప్పుడు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకొంటున్నది. కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకొన్న సనత్‌నగర్ టిమ్స్ సోమవారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.