న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం(Ayodhya Ram Temple)లో విరాళాలను చోరీ చేసిన కేసులో సిట్ తన నివేదికను రిలీజ్ చేసింది. రామ జన్మభూమి ట్రస్టు మాజీ చీఫ్ చంపత్ రాయ్‌తో పాటు మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు ఆ కేసులో సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. అయోధ్య ఆలయానికి అందిన విరాళాలను దోచుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో 8 మందిని యూపీ సర్కారు అరెస్టు చేసింది. విరాళాలను చోరీ చేసిన కేసును దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మరో వైపు సుప్రీంకోర్టులోనూ ఈ కేసు విచారణ జరుగుతున్నది. తాజాగా ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో.. అయోధ్య ఘటనపై ప్రభుత్వం స్పందించాలని విపక్షాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వాస్తవానికి విరాళాలు చోరీ అయినట్లు తెలిసిన కొన్ని రోజులకే.. చంపత్ రాయ్ తన రాజీనామాను సమర్పించారు.
రామాలయ ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు.. స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ క్లీన్ చిట్ ఇచ్చింది. ట్రస్టులో సభ్యుడిగా ఉన్న అనిల్ మిశ్రాకు కూడా సిట్ క్లియరెన్స్ ఇచ్చింది. అయోధ్య రామ మందిరాన్ని మేనేజ్ చేస్తున్న ఆ ఇద్దరూ ఆరోపణలు రావడంతో రాజీనామా చేశారు. యూపీ ప్రభుత్వ హోంశాఖ సోమవారం సిట్ తుది నివేదికను శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేసింది. తమ నివేదికలో తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది.
లక్నో డివిజనల్ కమీషనర్ విజయ్ విశ్వాస్ పంత్.. త్రిసభ్య కమిటీకి అధిపతిగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 13వ తేదీన ఆ కమిటీని ఏర్పాటు చేసింది. రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ కిరణ్ ఎస్, స్పెషల్ సెక్రటరీ నీల్ రతన్ కుమార్ దీంట్లో సభ్యులుగా ఉన్నారు. జూన్ 23వ తేదీన ప్యానల్ తన ప్రాథమిక నివేదికను అందజేసింది. సిట్ తన నివేదికలో అనేక కఠిన నియమావళిని సూచన చేసింది. విరాళాల చోరీ అంశంలో ట్రస్టు సభ్యుడు కృష్ణమోహన్ స్థానిక పోలీసు స్టేషన్లో తొలుత ఫిర్యాదు చేశారు. జూన్ 25వ తేదీన ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంట్లో 8 మంది ఉన్నారు. అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాత్సవ్, రామ్ శంకర్ యాదవ్ ఈ కేసులో నిందితులు. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఎ) సెక్షన్ కింద బుక్ చేశారు.