Anirudh Ravichander-Kavya Maran | కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ల వివాహంపై మరోసారి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పలుమార్లు వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొత్త ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. అనిరుధ్, కావ్య మారన్ నవంబర్ 10న గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనేలా ఈ వివాహ వేడుకను నిర్వహించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు అనిరుధ్ రవిచందర్ లేదా కావ్య మారన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ప్రస్తుతం ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంగానే కనిపిస్తోంది.
అనిరుధ్, కావ్య మారన్ మధ్య సన్నిహిత సంబంధం ఉందంటూ గతంలో కూడా పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు.ఇదిలా ఉంటే.. అనిరుధ్‌కు బంధువైన నటుడు, నాటక రచయిత వైజీ మహేంద్రన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆ అమ్మాయి కావ్య మారనే అంటూ నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.
ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలకు కూడా సంగీతం అందిస్తూ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’, షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కింగ్’ తదితర భారీ ప్రాజెక్టులకు ఆయన సంగీతం అందిస్తున్నారు. మరోవైపు కావ్య మారన్ వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా ఆమె క్రికెట్ అభిమానుల్లోనూ మంచి పాపులారిటీ సంపాదించారు. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తెగా వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ వ్యవహారాల్లో చురుగ్గా కనిపిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అనిరుధ్–కావ్య పెళ్లి గురించి మరోసారి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఈ జంట నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా? లేక ఇది మరో సోషల్ మీడియా రూమరేనా? అన్నది మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్‌గానే కొనసాగనుంది.