Sai Durga Tej | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. మెగా హీరో సాయి దుర్గా తేజ్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఓ సెలబ్రేషన్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు వివిధ కార్యక్రమాలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాయి దుర్గా తేజ్ కాణిపాకం ఆలయ గెస్ట్‌హౌస్‌లో అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో కేక్ కటింగ్ వంటి వేడుకలు నిర్వహించడంపై కొందరు భక్తులు, నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి దర్శనం కోసం వచ్చే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి వ్యక్తిగత వేడుకలు నిర్వహించడం సముచితం కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయానికి సంబంధించిన వసతి గృహంలో ఈ కార్యక్రమం జరగడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సాధారణ భక్తులకు ఆలయ పరిసరాల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయని, మరి ప్రముఖుల విషయంలో ఇలాంటి కార్యక్రమాలకు ఎలా అవకాశం కల్పించారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారం నేపథ్యంలో ఆలయ అధికారులు, పాలకమండలి తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ పవిత్రత, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని ప్రాంగణంలో ఎలాంటి వ్యక్తిగత సెలబ్రేషన్స్‌కు అనుమతి ఇవ్వకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖులు ఆలయాలకు వచ్చినప్పుడు వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం సహజమే అయినప్పటికీ, ఆలయ నియమావళికి భంగం కలిగించే కార్యక్రమాలకు మాత్రం అనుమతులు ఇవ్వకూడదని భక్తులు అంటున్నారు.సాయి దుర్గా తేజ్ అభిమానులతో కలిసి కేక్ కట్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశంపై చర్చ మరింత పెరిగింది. కొందరు అభిమానులు మాత్రం ఆయన కేవలం గెస్ట్‌హౌస్‌లో అభిమానులతో కలిసి కార్యక్రమం నిర్వహించారని, దీనిని అనవసరంగా వివాదం చేయొద్దని అంటున్నారు. మరోవైపు, ఆలయ ప్రాంగణంలో ఏ తరహా వేడుకలు నిర్వహించినా నియమాలను పాటించాల్సిందేనని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.